Begin typing your search above and press return to search.

అతి తెచ్చిన అరెస్టు.. బిగ్ బాస్ 7 విజేతను పోలీసులు అరెస్టు చేశారెందుకు?

ఈ క్రమంలో కొందరు అల్లరిమూక ఆరు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేసిన వైనం షాకింగ్ గా మారింది.

By:  Tupaki Desk   |   21 Dec 2023 4:23 AM GMT
అతి తెచ్చిన అరెస్టు.. బిగ్ బాస్ 7 విజేతను పోలీసులు అరెస్టు చేశారెందుకు?
X

బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ (రైతుబిడ్డ) ను పోలీసులు అరెస్టు చేశారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున.. విజేతను ప్రకటించిన అనంతరం రైతుబిడ్డ అభిమానుల పేరుతో క్రియేట్ చేసిన గలభా ఒక ఎత్తు అయితే.. ఆ క్రమంలో విజేతగా నిలిచిన రైతుబిడ్డ తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఓవైపు లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందని.. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసులు కోరుతున్నా.. ‘రైతుబిడ్డ’కు ఇదేం అన్యాయం అంటూ సెంటిమెంట్ డైలాగులు కొట్టటమేకాదు.. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారేందుకు కారణమయ్యాడని అతడిపై ఆరోపణలు ఉన్నాయి.

ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద గుమిగూడిన అభిమానులు.. బిగ్ బాస్ ప్రోగ్రాం నుంచి బయటకు వస్తున్న వారి కార్లను అడ్డుకోవటం.. వారి వాహనాలపై దాడికి యత్నించటమే కాదు.. దాన్ని నిలువరించే ప్రయత్నం చేసిన పోలీసులపైనా దాడికి దిగారు.ఈ క్రమంలో కొందరు అల్లరిమూక ఆరు ఆర్టీసీ బస్సుల్ని ధ్వంసం చేసిన వైనం షాకింగ్ గా మారింది. రైతుబిడ్డ సెంటిమెంట్ తో షోలో విజేతగా నిలిచిన పల్లవిప్రశాంత్ కు మద్దతుగా నిలిచిన వారు దాడికి ఎందుకు పాల్పడ్డారన్నది ప్రశ్నగా మారింది.

ఈ కేసులో బిగ్ బాస్ విజేత పల్లవి ప్రశాంత్ ను ఏ1గా చేర్చారు. అతడి సోదరుడు కూడా నిందితుల జాబితాలో చేర్చారు. ఎందుకిలా? అన్న ప్రశ్నకు సమాదానం వెతికితే.. విజేతగా ప్రకటించిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చే క్రమంలో.. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందన్న విషయాన్ని గుర్తించిన పోలీసులు.. విజేత పల్లవి ప్రశాంత్ ను వెనుక గేటు నుంచి బయటకు పంపారు. అయితే.. విజేతగా నిలిచిన నేపథ్యంలో.. తన సోదరుడు ఏర్పాటు చేసిన ఊరేగింపుకోసం.. వెనక్కి రావటంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే సమయంలో శాంతిభద్రతల సమస్య చోటు చేసుకొని.. దాడి.. విధ్వంసం చోటు చేసుకున్నాయి. దీంతో..గొడవకు ప్రాధమికంగా రైతుబిడ్డ సెంటిమెంట్ కార్డు వాడే బిగ్ బాస్ 7 విజేతను పోలీసులు అతడి సొంతూరు (గజ్వేల్ మండలం కొల్గుర్)లోని ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం అతడ్ని హైదరాబాద్ కు తరలించారు. పల్లవి ప్రశాంత్ తో పాటు అతడి సోదరుడ్ని కూడా అరెస్టు చేశారు. తన అరెస్టు సందర్భంగా పోలీసులకు తాను సహకరిస్తానని చెప్పిన అతన్ని హైదరాబాద్ కు తీసుకొచ్చి దాదాపు ఆరు గంటల పాటు పోలీసులు విచారించినట్లుగా చెబుతున్నారు. అనంతరం న్యాయమూర్తి ఇంటి వద్ద హాజరుపర్చగా అతడ్ని.. అతడి సోదరుడికి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ కు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో.. ప్రొసీజర్ ను పూర్తి చేసి చంచల్ గూడ జైలుకు తరలించారు. మోతాదుకు మించిన అతితోనే పల్లవి ప్రశాంత్ ఇన్ని కష్టాల్ని కొని తెచ్చుకున్నట్లుగా చెబుతున్నారు. అతడిపై తొమ్మిది సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఒక బిగ్ బాస్ విజేత తన తీరుతో జైలుకు వెళ్లటం ఇదే తొలిసారిగా అభిప్రాయపడుతున్నారు.