బిగ్ బాస్ షోలో చెప్పినట్లు చేసిన కల్యాణ్ పడాల
మాటలు చెప్పటం వేరు.. వాటిని ఆచరించటం వేరు. ఈ విషయంలో తనను వేలెత్తి చూపించేందుకు అవకాశం లేని విధంగా వ్యవహరించాడు బిగ్ బాస్ సీజన్ 9 విజేత కల్యాణ్ పడాల.
By: Tupaki Desk | 26 Dec 2025 10:33 AM ISTమాటలు చెప్పటం వేరు.. వాటిని ఆచరించటం వేరు. ఈ విషయంలో తనను వేలెత్తి చూపించేందుకు అవకాశం లేని విధంగా వ్యవహరించాడు బిగ్ బాస్ సీజన్ 9 విజేత కల్యాణ్ పడాల. కామనర్ గా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన అతను.. మొదటి నాలుగు వారాలకు భిన్నంగా చివరకు విజేతగా నిలవటం.. పెద్ద ఎత్తున ప్రజాభిమానాన్ని పొందటం తెలిసిందే. తాజాగా అతను తన సొంతూరుకు వెళ్లిన సందర్భంలో గ్రామస్థుల నుంచి ఘనస్వాగతం లభించింది.
బిగ్ బాస్ షోలో చెప్పినట్లు తాను విజేతగా మారితే ముగ్గురు పిల్లల్ని దత్తత తీసుకుంటానని.. వారి బాధ్యతల్ని తాను మోస్తానని చెప్పటం తెలిసిందే. ఆ మాటకు తగ్గట్లే తాను ఇప్పటికే ముగ్గురు పిల్లల్నిదత్తత తీసుకున్న విషయాన్ని కల్యాణ్ పడాల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పటం గమనార్హం. దీంతో.. తాను మాటల మనిషిని కాదు.. చేతల మనిషినన్న విషయాన్ని స్పష్టం చేశారని చెప్పాలి. విజేతగా నిలిచి వారం కూడా కాక ముందే.. షోలో చెప్పినట్లుగా దత్తత కార్యక్రమాన్ని పూర్తి చేయటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
కల్యాణ్ నేపథ్యాన్ని చూస్తే.. రీల్ స్టోరీలా కనిపిస్తుంది. విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేటకు చెందిన కల్యాణ్ తల్లిదండ్రులు పేదరికంలో ఉండేవారు. స్నాక్స్ అమ్ముకుంటూ జీవనం సాగించేవారు. ఇలాంటి వేళ కల్యాణ్ పుట్టటం.. ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావటంతో.. కల్యాణ్ ను బంధువుల ఇంటికి పంపారు. తన పరిస్థితి.. తన ఇంటి పరిస్థితిని అర్థం చేసుకొని ఇష్టంతో చదవటం.. మంచి మార్కులు సాధించేవాడు.
విశాఖలోని తన మేనత్త రమాదేవి ఇంట్లో చదువుకున్నానని.. ఎన్టీఆర్ ట్రస్టు సాయంతో కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో పదో తరగతి.. ఇంటర్.. డిగ్రీ విజయనగరంలో చదివినట్లు కల్యాణ్ చెప్పారు. తన తండ్రి కోరిక తీర్చేందుకు ఆర్మీలోజాబ్ సాధించిన ఇతను.. బిగ్ బాస్ 9 సీజన్ లో కామనర్ గా అడుగు పెట్టటం.. చివరకు షోకు విజేతగా నిలవటం తెలిసిందే. తనకు సినిమాల్లో నటించే అవకాశం వస్తే నటిస్తానని.. మంచి కథలు దొరికితే చేస్తానన్న అతడి కోరిక తీరాలని ఆశిద్దాం. ఆల్ ద బెస్టు కల్యాణ్ పడాల.
