Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ కి పెను సవాల్ ...వారంతా నో చెబుతున్నారా...!

ప్రతీ సెకన్ కూడా గతిని మారుస్తుంది. రాజకీయాల్లో అయితే ఓడలు బళ్ళు అవుతాయి.

By:  Tupaki Desk   |   24 Feb 2024 3:48 AM GMT
బీఆర్ఎస్ కి పెను సవాల్ ...వారంతా నో చెబుతున్నారా...!
X

కాలం మహిమ అని అందుకే అంటారు. కాలం నిన్నలా లేదు అని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ప్రతీ మనిషి జీవితంలో కనిపిస్తాయి. ప్రతీ సెకన్ కూడా గతిని మారుస్తుంది. రాజకీయాల్లో అయితే ఓడలు బళ్ళు అవుతాయి. ఇపుడు గులాబీ పార్టీలో అదే కనిపిస్తోంది. బీఆర్ఎస్ అంటే ఆ సౌండే వేరుగా ఉండేది.

ఏమా సందడి ఏమా హడావుడి అన్నట్లుగా కనిపించేది. కేసీఆర్ అంటే అపర చాణక్యుడే అనేవారు. మాకు కొండంత అండ కేసీఆర్ ఉండగా దిగులేలా అన్న చర్చ కూడా చేస్తూ వచ్చేవారు. కేవలం మూడు నెలల ముందు వరకూ ఇదే సీన్. ఇపుడు మాత్రం అంతా ఉల్టా సీదా అయిపోయింది. బీఆర్ఎస్ ని చూస్తే ఏవీ నాటి వైభోగములు అని అనుకోకతప్పదు.

బీఆర్ఎస్ కి ఇపుడు అసలైన అగ్ని పరీక్షగా ఎంపీ ఎన్నికలు వచ్చి పడ్డాయి. ఇదంతా కేసీఆర్ చేసుకున్నదే. ఆయన 2014లో ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఎంపీ ఎమ్మెల్యే ఎలక్షన్ ఒకేసారి సాగింది. అదే 2018 నాటికి ఆరు నెలల ముందు ఎన్నికలు అనుకుంటూ వెళ్లారు. అసెంబ్లీలో సక్సెస్ కొట్టారు. అదే లోక్ సభ నాటికి సగం ఎంపీ సీట్లు అయ్యాయి.

అయినా చేతిలో రాష్ట్ర అధికారం ఉంది కాబట్టి ఆ తక్కువ సీట్లు ప్రభావం చూపించలేదు. ఇపుడు రెండు సార్లు ఎన్నికలు రెండు పోటీలు మాత్రం ఓడిన పార్టీగా బీఆర్ఎస్ కి పెను సవాల్ గానే మారుతున్నాయని అంటున్నారు. డిసెంబర్ లో ఓటమి సంభవించింది. దాని నుంచి తేరుకునేలోగా తొడగొట్టి కాంగ్రెస్ మరో ఎన్నికకు పిలుస్తోంది.

ఈ రకమైన పరిస్థితి కర్నాటకలో లేదు. అక్కడ కూడా 2023లో ఎన్నికలు జరిగినా పార్లమెంట్ ఎన్నికలకు చాలా సమయం ఉంది. దాంతో ప్రభుత్వ వ్యతిరేకత ఎంతో కొంత ఉన్నా దాని నుంచి లబ్ది పొందేందుకు అక్కడ బీజేపీ జేడీఎస్ తో జతకట్టి మరీ రంగంలోకి దిగిపోతోంది. తెలంగాణాలో అంతా పచ్చిగానే ఉంది.

దాంతో పాటు ప్రజల మైండ్ సెట్ కూడా అలాగే ఉంది. కాంగ్రెస్ కే మరోమారు చేయెత్తేలా ఓటర్లు ఉన్నాయి. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. కాబట్టి మోడీ వేవ్ ఏమైనా ఉంటే ఆ వైపుగా కొన్ని ఎంపీ సీట్లు టర్న్ అవుతాయి. మరి బీఅర్ఎస్ కి ఏమి మిగులుతుంది అంటే ఆలోచించాల్సిందే అంటున్నారు.

ఎన్నికలు తరుముకుని వస్తున్న వేళ బీఆర్ఎస్ మొత్తం 17 ఎంపీ సీట్లలో అభ్యర్ధుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నా పూర్వపు ఉత్సాహం అయితే ఎవరిలోనూ లేదని అంటున్నారు. ఎందుకంటే సర్వేలు సంగతి పక్కన పెడితే జనం పల్స్ ఈ మధ్యనే చూశారు. దాంతో బీఆర్ఎస్ నుంచి ఎంపీ పోటీ అంటే కొందరు కీలక నేతలు సున్నితంగా తప్పుకుంటున్నారు అని ప్రచారం సాగుతోంది.

వాస్తవానికి ఎంపీ టికెట్ కోసం క్యూలు కట్టాల్సిన చోట ఇపుడు ఎందుకొచ్చిన పోటీ అని అనుకుంటున్నారు అంటే జనం నాడిని పట్టిన రాజకీయ నేతలు కాబట్టే అంటున్నారు. ఎంత పోటీ చేసినా ఎంతగా తగలేసుకున్నా జనం అయితే ఈ అతి తక్కువ సమయంలో మనసు మార్చుకోరని ఫలితంగా మరోసారి ఓటమి భారం నెత్తిన ఎందుకు మోయాలీ అన్న దాంతోనే సీనియర్ల నుంచి చాలా మంది నేతలు తమకు టికెట్ వద్దు అని చెబుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

దీంతో అర్ధబలం అంగబలం ఉన్న నేతలను ఏరి మరీ పోటీకి నిలబెట్టడం గులాబీ పార్టీకి కత్తి మీద సాముగా ఉంది అని అంటున్నారు. అభ్యర్థులు దొరుకుతారు కానీ వారంతా గెలుపు గుర్రాలేనా అంటే డౌట్ పడాల్సి ఉంటుంది. అలాగని ఏదో పోటీ పెట్టాం అన్నట్లుగా ఉండకూడదు, ఒక విధంగా చెప్పాలీ అంటే బీఆర్ఎస్ లాంటి పార్టీలకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య.

ఈసారి ఎన్నికల్లో కనుక కనీసంగా సీట్లు తెచ్చుకోకపోతే ఇబ్బంది అవుతుంది. దాంతో గులాబీ కోటలో దీని మీదనే చర్చ సాగుతోంది అని అంటున్నారు. గట్టి అభ్యర్ధులను పెట్టి అధికార కాంగ్రెస్ ని ఢీ కొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధం కావాల్సి ఉంది. ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నాలు ఎంతమేరకు ఫలితాలు ఇస్తాయో చూడాల్సి ఉంది.