Begin typing your search above and press return to search.

ఫస్ట్ క్లాస్ కాదు కానీ పాస్ అయిన భువనేశ్వరి

చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్రకు వచ్చిన టీడీపీ బిడ్డల్ని పుంగనూరులో నిర్బంధించి టీడీపీ చొక్కాలను.. జెండాలను చించేసిన విషయాన్ని ప్రస్తావించటం బాగున్నా.. దానికి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎఫెక్టు చూపించలేకపోయారని చెప్పాలి.

By:  Tupaki Desk   |   26 Oct 2023 4:57 AM GMT
ఫస్ట్ క్లాస్ కాదు కానీ పాస్ అయిన భువనేశ్వరి
X

అనూహ్య పరిణామాల నేపథ్యంలో దశాబ్దాల తరబడి రాజకీయ వేదికల మీదకు వచ్చి మాట్లాడటం అన్నది ఎరుగని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి.. తొలిసారి అందుకు భిన్నంగా రియాక్టు అయ్యారు. స్కిల్ స్కాం ఆరోపణలతో చంద్రబాబు జైల్లో ఉన్న వేళ.. నిజం గెలవాలన్న పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాన్ని చేపట్టటం తెలిసిందే. బుధవారం ఉమ్మడి చిత్తూరు జిల్లా (ప్రస్తుత తిరుపతి జిల్లా) చంద్రగిరి నియోజకవర్గంలోని అగరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తన తొలి ప్రసంగాన్ని పూర్తి చేశారు.

ఇన్నేళ్లుగా చంద్రబాబు రాజకీయాల్లో ఉన్నా.. పార్టీ కార్యక్రమాలకు సంబంధించి అంటీముట్టనట్లుగా వ్యవహరించిన భువనేశ్వరి.. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా ఏకంగా స్పీచ్ ఇవ్వాల్సిన ప్రత్యేక పరిస్థితి నెలకొంది. దీంతో.. ఆమె ప్రసంగం ఎలా ఉండనుంది? అన్న ఆసక్తి వ్యక్తమైంది. తాజాగా ఆమె తొలి బహిరంగ సభ ప్రసంగాన్నిచూసినప్పుడు.. పక్కాగా ప్రిపేర్ అయినట్లుగా కనిపించింది.

చంద్రబాబు మాదిరే కాస్తంత నీరసంగా ఆమె స్పీచ్ ఉందన్న మాట వినిపిస్తోంది. అలా అని మరీ అంత అల్పంగా లేనప్పటికీ.. అదిరేలా మాత్రం లేదన్న మాట వినిపిస్తోంది. భువనేశ్వరి మొదటి బహిరంగ ప్రసంగాన్ని.. ఫస్ట్ క్లాస్ కాదు కానీ పాస్ అయ్యారని మాత్రం చెప్పక తప్పదు. ఆమె మాటల్లో సెంటిమెంట్ ను ఎంత రంగరించినా.. అందుకు తగ్గట్లుగా మాటలు లేవని మాత్రం చెప్పక తప్పదు.

చంద్రబాబు గురించి మాకంటే మీకే బాగా తెలుసు. నిరంతరం మీ కోసమే ఆలోచిస్తారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఎంతో ముందుచూపుతో పని చేశారంటూ రోటీన్ గా వినే మాటలే భువనేశ్వరి నోటి నుంచి వినపడటంతో.. వినే వారికి కొత్తగా విన్నట్లుగా అనిపించలేదు. ఎప్పుడు వినే మాటలే భువనేశ్వరి నోటి నుంచి వచ్చాయన్న సాదాసీదా భావనే వ్యక్తమైంది.

పాతికేళ్ల క్రితం హైటెక్ సిటీని తీసుకొచ్చి.. లక్షలాది కుటుంబాల్లో సంతోషాన్ని నింపారని.. వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ శ్రేణుల్ని వేధించటమే తప్పించి రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన లేదన్న మాటలు పెద్దగా ప్రభావాన్ని చూపేలా లేవంటున్నారు. మరింత సూటిగా.. స్పష్టంగా మాట్లాడాల్సి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీని దేశంలోనే ముందుంచాలన్న ఉద్దేశంతో ఎన్నో నిద్రలేని రాత్రుల్నిచంద్రబాబు గడిపారన్న మాట చెప్పిన భువనేశ్వరి.. సాగునీటి ప్రాజెక్టులు ఏమయ్యాయి అన్న మాట అడిగినందుకు అక్రమ కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు.

చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు చేపట్టిన సైకిల్ యాత్రకు వచ్చిన టీడీపీ బిడ్డల్ని పుంగనూరులో నిర్బంధించి టీడీపీ చొక్కాలను.. జెండాలను చించేసిన విషయాన్ని ప్రస్తావించటం బాగున్నా.. దానికి కౌంటర్ ఇచ్చే విషయంలో ఎఫెక్టు చూపించలేకపోయారని చెప్పాలి. అయితే.. ఇక్కడో విషయాన్ని చెప్పాలి. చెప్పాలనుకున్న విషయాల్ని చెప్పేయటమే తప్పించి.. మాటలు వెతుక్కోవటం.. ఏం మాట్లాడాలన్న విషయాన్ని పదే పదే కాగితం మీద చూసుకొని మాట్లాడకుండా.. మనసులో ఉన్న మాటల్ని చెప్పేయటం సానుకూలాంశంగా చెప్పాలి. కాకుంటే.. మరింత ఎఫెక్టివ్ గా ప్రసంగాన్ని సిద్దం చేసుకొని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.