అచ్చుగుద్దినట్లు ఇది‘లక్కీ భాస్కర్’ సినిమానే..! భూటన్ లగ్జరీకార్ల స్మిగ్లింగులో అసలు ట్విస్ట్ ఇదే..
అచ్చం ‘లక్కీ భాస్కర్’ సినిమాలో చూపినట్లు ఖరీదైన కార్లను విదేశాల నుంచి తీసుకువచ్చి మన దేశంలో విక్రయించినట్లు గుర్తించారు.
By: Tupaki Desk | 24 Sept 2025 12:00 AM ISTలగ్జరీ కార్ల స్మిగ్లింగు గుట్టును ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. అచ్చం ‘లక్కీ భాస్కర్’ సినిమాలో చూపినట్లు ఖరీదైన కార్లను విదేశాల నుంచి తీసుకువచ్చి మన దేశంలో విక్రయించినట్లు గుర్తించారు. చిత్రంగా ఈ విషయంలో ‘లక్కీ భాస్కర్’ సినిమా కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటుండటం యాదృచ్ఛికమే అయినా ఆసక్తికరంగా మారింది. భూటన్ ఆర్మీ ఉపసంహరించుకున్న అత్యంత ఖరీదైన కార్లను మన దేశానికి తీసుకువచ్చి, ఇక్కడే అవి తయారైనట్లు చూపి లక్షల రూపాయల పన్ను ఎగవేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేరళలో సాధారణ తనిఖీల్లో ఇలాంటి వాహనం పట్టుబడటంతో ఇంటెలిజెన్స్ అధికారులు తీగలాగితే మొత్తం డొంక కదిలిందని అంటున్నారు.
లక్కీ భాస్కర్ సినిమాలో పోర్టు నుంచి స్మగ్లింగు గూడ్సును తీసుకువచ్చి స్థానికంగా విక్రయిస్తుంటారు. అదేవిధంగా కథానాయకుడు ఒకసారి రెండు ఖరీదైన కార్లు తీసుకువచ్చి విక్రయించడం ఆ సినిమా కథను అందులో కథానాయకుడి జీవితాన్ని మలుపుతిప్పింది. అయితే కేరళతోపాటు దేశంలో పలు ప్రాంతాల్లో కస్టమ్స్ అధికారుల తనిఖీలతో ఖరీదైన కార్లు కొనుగోలు చేసిన వారి జీవితాలు ఎలా ప్రభావితమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ‘ఆపరేషన్ సమకూర్’ పేరుతో దేశవ్యాప్తంగా ఏకకాలంలో కొనసాగుతున్న తనిఖీలు, పలువురు సెలబ్రెటీలను వేలెత్తిచూపడంతో సంచలనంగా మారింది.
వాస్తవానికి విదేశీ వాహనాలను కొనుగోలు చేయాలంటే మన దేశంలో పన్నులు చెల్లించాల్సివుంటుంది. అయితే దిగుమతి సుంకాలు భారీగా ఉండటం వల్ల కొన్ని విదేశీ కార్లు వాటి వాస్తవ ధర కన్నా, మన దేశానికి తీసుకువచ్చేసరికి రెండింతలు పెరుగుతున్నాయి. దీంతో అలాంటి లగ్జరీ కార్లుపై మనసుపడిన కొందరిని బ్రోకర్లు బురిడీ కొట్టించారు. అడ్డదారుల్లో ఆ వాహనాలను మన దేశానికి తెప్పించి వాటిని ఇక్కడే తయారు చేసినట్లు రికార్డులు స్రుష్టించి భారీగా పన్ను ఎగవేతకు పాల్పడ్డారని అధికారులు గుర్తించారు.
మన దేశంలో అమలులో ఉన్న ట్రేడ్ నిబంధనల్లో లొసుగులను గుర్తించిన కొందరు ఏజెంట్లు పక్కా ప్లానింగుతో భూటన్ నుంచి లగ్జరీ కార్లను తీసుకువచ్చి వాటిని హిమాచల్ ప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేయించినట్లు కస్టమ్స్ నిఘాలో వెల్లడైందని చెబుతున్నారు. కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండా భూటాన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉన్న వాహనాలు మన దేశంలో నడపడం నిషేధం. అయితే కొందరు ఏజెంట్లు అతితెలివితో వ్యవహరించి భూటాన్ నుంచి హిమాచల్ ప్రదేశ్ కు అక్రమంగా వాహనాలను తీసుకువచ్చి వాటికి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేయించినట్లు గుర్తించారు. సిమ్లా రూరల్ (HP 52)లో ఈ దందా ఎక్కువగా జరుగుతున్నట్లు అధికారుల ద్రుష్టికి వచ్చింది. స్థానిక అధికారులు కూడా సహాయ సహకారాలు అందించడంతో లగ్జరీ కార్లు దేశంలోకి ఈజీగా ప్రవేశించినట్లు భావిస్తున్నారు.
విదేశాల నుంచి విలాసవంతమైన, ఖరీదైన వస్తువులను స్మగ్లింగు ద్వారా మన దేశంలోకి తీసుకురావడం కొత్తమే కాదు. వివిధ రూపాల్లో ఈ స్మగ్లింగు కొనసాగుతున్నట్లు అనేక కథనాల ద్వారా తెలుస్తోంది. అత్యంత లాభదాయకమైన ఈ వ్యవహారంలో అంతే రిస్క్ ఉంటుందని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు. అయితే తాజాగా భూటాన్ ఆర్మీ ఉపసంహరించుకున్న ఖరీదైన వాహనాలను కారుచౌకగా కొని ఇక్క అంతకు పదింతల లాభానికి విక్రయించడమే ఆసక్తి రేపుతోంది.
ఇటీవల భూటాన్ ఆర్మీ కొన్ని వాహనాలను పక్కన పెట్టిందని, అలా ఆ దేశ ఆర్మీ ఉపసంహరించుకున్న వాహనాలను విక్రయించినట్లు చెబుతున్నారు. దీంతో కొందరు వ్యక్తులు అక్కడ రూ.లక్ష పెట్టి కొనుగోలు చేసిన వాహనాలను హిమాచల్ లో రిజిస్ట్రేషన్లు మార్చి రూ.10 లక్షలకు విక్రయించినట్లు కస్టమ్స్ అధికారులకు సమాచారం అందిందని చెబుతున్నారు. అదేవిధంగా ఎస్యూవీలను రూ.3 లక్షలకు కొని రూ.30 లక్షల వరకు విక్రయించినట్లు గుర్తించారు. నిజానికి ఇలా భూటాన్ నుంచి తీసుకువచ్చే వాహనాలకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాలి. అయితే కొందరు ఏజెంట్లు చేసిన మాయతో భూటాన్ వాహనాలు ఎటువంటి కస్టమ్స్ డ్యూటీ చెల్లించకుండానే భారత్ రోడ్లపై తిరుగుతున్నాయి. ఇటీవల కేరళకు చెందిన ఓ వ్యక్తి రూ.25 లక్షలకు ఓ వాహనాన్ని కొనుగోలు చేసి ఇక్కడ తిప్పుతుండగా, కస్టమ్స్ అధికారులకు ఆ సమాచారం అందిందని చెబుతున్నారు. దీంతో వారు తీగలాగితే మొత్తం 150 వాహనాలు మన దేశానికి వచ్చాయని, ఇందులో 20 వరకు ఎస్యూవీలు కేరళలో ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారని చెబుతున్నారు.
