Begin typing your search above and press return to search.

టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా?

దీంతో... భూమన ఎన్నికల అఫిడవిట్‌ లోనే "క్రిస్టియన్" అని ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని తేలింది

By:  Tupaki Desk   |   12 Aug 2023 11:30 PM GMT
టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా?
X

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు చైర్మన్‌ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి రెండోసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన్ని ఈ పదవికి ఎంపిక చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించగానే.. అన్యమతస్తులకు అవకాశం కల్పించారంటూ విమర్శలు రేగాయి.

సోషల్ మీడియాలో భూమన కుటుంబానికి చెందిన వారి వివాహ దృశ్యాలు వైరల్ అయ్యాయి. భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడని బీజేపీ నాయకుడు లంక దినకర్ వంటి వారు విమర్శించారు. ఇదే సమయంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి భారీ ట్వీట్ చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ అన్నది రాజకీయ పునరావాస పదవి కానేరదు అంటూ... హిందూ ధర్మంపై నమ్మకమున్న వారిని, హిందూ ధర్మం అనుసరించే వాళ్లని మాత్రమే టీటీడీ చైర్మన్‌ గా నియమించాలని ఆమె కోరారు. ఇదే సమయంలో బీజేపీలో ఉన్న టీటీడీ మాజీ ఈవో.. ప్రచ్ఛన్న మత అజెండాతో ఈ ప్రభుత్వం నడుస్తోందని ఆరోపించారు.

దీంతో నిజంగానే భూమన కరుణాకర్ రెడ్డి క్రైస్తవుడా.. అదే విషయాన్ని ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారా.. అసలు టీటీడీ చైర్మన్‌ గా ఫలానా మతస్తులే ఉండాలనే నిబంధన ఉందా అనే విషయాలు చర్చకు వచ్చాయి!

భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పటివరకూ నాలుగు దఫాలు ఎన్నికల్లో పోటీ చేశారు. 2009లో తిరుపతి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరపున పోటీచేసిన భూమన.. పీఆర్పీ చిరంజీవి చేతిలో ఓడిపోయారు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ నుంచి భూమన గెలిచారు.

అనంతరం 2014 ఎన్నికల్లో భూమన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో గెలిచి రెండోసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రెండు దఫాలూ వైసీపీ నుంచే ఆయన పోటీ చేశారు. ఇలా నాలుగుసార్లు పోటీ చేసిన భూమన.. ఏనాడూ తన అఫిడవిట్ లలో మత ప్రస్తావన తీసుకురాలేదు.

దీంతో... భూమన ఎన్నికల అఫిడవిట్‌ లోనే "క్రిస్టియన్" అని ఉందంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం వాస్తవం కాదని తేలింది. ఇదే సమయంలో హిందూ మతస్తులే టీటీడీ ఛైర్మన్ గా ఉండాలనే రూల్ ఏమైనా ఉందా అనేది ఇప్పుడు చూద్దాం!

టీటీడీ కోసం ప్రత్యేక బోర్డు‌ను స్వాతంత్ర్యానికి పూర్వమే (1932) ప్రారంభించారు. అప్పటి వరకూ మహంతుల ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు నడిచేవి. అయితే 1936 నుంచి ప్రభుత్వ ఆధ్వర్యంలో టీటీడీ వ్యవహారాలు సాగుతున్నాయి. టీటీడీ పాలకమండలికి భూమన 51వ చైర్మన్ గా ఉన్నారు.

అయితే.. చట్టాన్ని అనుసరించి పాలకమండళ్ల నియామకంలో ఫలానా మతం వారిని నియమించాలనే నిబంధన ఎక్కడా లేదని తెలుస్తోంది. కాకపోతే.. హిందూ ఆలయాల్లో హిందూమత ఉద్ధరణే లక్ష్యమనే భావనతో దాన్ని అనుసరించే వారికే అవకాశాలు కల్పించడం ఆనవాయితీగా వస్తోంది.

అయితే టీటీడీ సిబ్బంది అంతా హిందూ మతాచారాలను ఆచరించేవారై ఉండాలని, వారికే అవకాశం కల్పించాలని ప్రభుత్వం షరతు పెట్టింది. ఆలయ పాలకమండలి సభ్యుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం 2019లో చట్టం తీసుకొచ్చింది.

ఈ లెక్క ప్రకారం చట్టాన్ని అనుసరించి ఆరుగురు ఎస్సీలకు, నలుగురు ఎస్టీలకు చోటు దక్కాల్సి ఉండాల్సి ఉంటుంది! కానీ, ప్రస్తుత పాలక మండలిలో 36 మంది సభ్యులు ఉంటే, అందులో ఇద్దరే ఎస్సీలు ఉన్నారు!

ఆ సంగతి అలా ఉంటే... హిందూమతాచారాలను పాటిస్తూ గతంలోనూ భూమన వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. దళిత గోవిందం వంటివి విజయవంతంగా నిర్వహించారు! దీంతో టీటీడీ చైర్మన్‌ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం సరికాదనే విమర్శ అర్థరహితమనే అనుకోవాలని అంటున్నారు పరిశీలకులు.