Begin typing your search above and press return to search.

టీటీడీ Vs భూమన.. పరకామణి కేసు ఓ బ్రహ్మస్త్రమా?

టీటీడీ విషయంలో చికాకు పుట్టిస్తున్న వైసీపీ నేత భూమనపై బ్రహ్మస్త్రం సంధించే అవకాశం కూటమి ప్రభుత్వానికి చిక్కిందనే చర్చ జరుగుతోంది.

By:  Tupaki Desk   |   21 Sept 2025 12:31 PM IST
టీటీడీ Vs భూమన.. పరకామణి కేసు ఓ బ్రహ్మస్త్రమా?
X

టీటీడీ విషయంలో చికాకు పుట్టిస్తున్న వైసీపీ నేత భూమనపై బ్రహ్మస్త్రం సంధించే అవకాశం కూటమి ప్రభుత్వానికి చిక్కిందనే చర్చ జరుగుతోంది. టీటీడీ మాజీ చైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయిన భూమన ప్రభుత్వానికి అనే విధాలుగా చికాకులు తెప్పిస్తున్నారు. విపక్ష నేతగా ప్రభుత్వంపై మడమతిప్పని పోరాటం చేస్తున్నారు. కేసులను లెక్క చేయకుండా తాను ఏం చెప్పాలని అనుకున్నారో అది చెప్పేసి ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తున్నారు. భూమన ఆరోపణల్లో నిజానిజాలు సంగతి అటుంచితే.. ఆ ఆరోపణలకు సమాధానం చెప్పలేక ప్రభుత్వం, టీటీడీ పాలకవర్గం, అధికారులు నానా హైరానా పడాల్సివస్తోంది.

టీటీడీ గోశాలలో వందల సంఖ్యలో మూగజీవాలు మరణిస్తున్నాయని, మహా విష్ణువుకు అపచారం జరిగిందని భూమన చేసిన ఆరోపణలు కలకలం రేపాయి. అంతకుముందు శ్రీవారి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని ముఖ్యమంత్రి ఆరోపించగా, వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఈ విషయమై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీవారి ప్రసాదాలపై చేసిన సంచలన ఆరోపణలతో గత ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి డిఫెన్సులో పడిపోయినట్లు చర్చ జరిగింది. అయితే దీని నుంచి క్రమంగా కోలుకున్న భూమన ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించారని పరిశీలకులు చెబుతున్నారు.

ఇక భూమన విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు గట్టిగా ఫోకస్ చేశారు. ఇదే సమయంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ లో టీటీడీ బాండ్ల స్కాం తెరపైకి తెచ్చారు. అయితే ఈ విషయంలో భూమన రివార్స్ అటాక్ చేయడం, అందుకోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితంగా మెలిగిన శ్రీలక్షిపైనే ఆరోపణలు చేయడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడిందని అంటున్నారు. భూమనకు చెక్ చెప్పే విషయంలో అనేక మార్గాలను పరిశీలించిన ప్రభుత్వ పెద్దలకు ఇప్పుడు పరాకమణిలో దొంగతనం కేసు బ్రహ్మస్త్రంగా మారిందని టాక్ వినిపిస్తోంది.

టీటీడీ పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ అనే వ్యక్తిని కోర్టులో నిందితుడిగా ప్రవేశపెట్టకుండానే.. లోక్ అదాలత్ లో రాజీ చేయడం, అతడు చోరీ చేస్తుండగా సీసీ పుటేజీకి చిక్కడం వంటివి బలమైన ఆధారాలు ఉన్నా చర్యలు తీసుకోకపోవడంపై కూటమి పెద్దలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా దాదాపు వంద కోట్ల మేర శ్రీవారి హుండీని దోచేశారని, 40 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను బినామీ పేర్లతో రాయించుకున్నారని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై తమ వద్ద ఉన్న ఆధారాలను బయటపెట్టారు. అంతేకాకుండా ఈ వ్యవహారంపై హైకోర్టు ద్వారా సీఐడీ విచారణకు ఆదేశాలు పొందారు. దీంతో భూమనకు చెక్ చెప్పే అవకాశాలు లభించినట్లు కూటమి నేతలు హంగామా చేస్తున్నట్లు చెబుతున్నారు. బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వెంటనే మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతాలో భూమనపై ఆరోపణలు చేస్తూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

కూటమి దూకుడు చూస్తే భూమనను పక్కాగా రౌండప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరాకమణి విషయంలో కొందరు అధికారులు అప్రూవర్ అవుతారనే ప్రచారం చేయడంతోపాటు రవికుమార్ ప్రాణాలకు ప్రమాదం ఉందని చెప్పడం ఆసక్తికరంగా మారింది. ఈ విషయంలో ఇప్పటివరకు వైసీపీ నుంచి కౌంటర్ రాకపోవడంతో ఆ పార్టీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారా? లేక సరైన సమయంలో స్పందించి తమ తప్పు లేదని నిరూపించుకుంటారా? అనేది చూడాల్సివుంది. ఏదిఏమైనా పరకామణిలో దొంగతనం ఎపిసోడ్ రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. పవిత్ర పుణ్యక్షేత్రంలో అపచారాలకు అడ్డూఅదుపూ ఉండదా? అనే ప్రశ్న తలెత్తుతోంది.