పరకామణి దొంగతనం ఎపిసోడ్.. భూమన కౌంటర్
తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దొంగతనం ఎపిసోడ్ పై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి స్పందించారు.
By: Tupaki Desk | 21 Sept 2025 3:00 PM ISTతిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో దొంగతనం ఎపిసోడ్ పై టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి స్పందించారు. పరకామణిలో దొంగతనం చేసిన రవికుమార్ ను తాను రక్షించానని నిరూపిస్తే తల నరుక్కుంటానని సవాల్ చేశారు. ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్న మంత్రి లోకేశ్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుపై భూమన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంత్రి లోకేశ్ ను జ్ఞాన, శూన్య ముర్ఖేష్ గా అభివర్ణించారు. అదేవిధంగా టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భక్తి లేని రస రాయుడు అంటూ ఆరోపించారు. బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం తర్వాత కూటమి నేతలు తనపై విమర్శలు చేయడాన్ని ద్రుష్టిలో పెట్టుకుని ఆదివారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడారు భూమన. పరకామణి దొంగతనంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
పరకామణి దొంగతనం విషయంలో ‘తమ పార్టీ అధికారంలో ఉండగానే రవికుమార్ అనే వ్యక్తిని పట్టుకున్నాం’ అని భూమన స్పష్టం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రవికుమార్ దొంగతనం చేసినట్లు ఆయన వెల్లడించారు. రవికుమార్ కుటుంబ సభ్యులు పాప పరిహారంగా తమ ఆస్తులను టీటీడీకి రాసిచ్చారని భూమన తెలిపారు. రవికుమార్ అనే దొంగను చంద్రబాబు ప్రభుత్వం పట్టుకుందా? కొట్టేయాలని అనుకున్న వారు దొంగను పట్టుకుంటారా? అంటూ ఆయన ప్రశ్నించారు. దమ్ము, ధైర్మం ఉంటే విజిలెన్స్ నివేదిక బయటపెట్టాలని సవాల్ విసిరారు. రవికుమార్ కు తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో కూడా ఆస్తులు ఉన్నాయని ఆయన తెలిపారు.
మా బినామీలకు ఆస్తులు ఇచ్చివుంటే సీబీఐతో విచారణ జరిపించాలని భూమన డిమాండ్ చేశారు. దేవాదాయ మంత్రి ఆనం సమాధానం ఇచ్చాక కూడా ఆ నివేదిక ఎందుకు బయటకు రాదు? ఆ నివేదికకు సంబంధించి చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉంది? జ్ఞాన, శూన్య ముర్ఖేష్ లోకేశ్, భక్తి లేని రస రాయుడు బీఆర్ నాయుడు అంటూ భూమన దుమ్మెత్తిపోశారు. పరకామణి ఘటన జరిగిందని రుజువైతే తన తల నరుక్కుంటాను, దమ్ముంటే సీబీఐ చేత విచారణ జరిపించాలి, నిజాలు నిగ్గు తేల్చాలని భూమన సవాల్ విసిరారు. కూటమిలో తాబేదార్లుగా ఉన్న అధికారులతో విచారణ చేయిస్తే వాస్తవాలు బయటకు రావు. చంద్రబాబు హయాంలో కొట్టేసిన స్వామి వారి నిధులను మేం ఆ దేవదేవుడికి రాయించామని భూమన వివరణ ఇచ్చారు. బీఆర్ నాయుడు చైర్మన్ గా వచ్చినప్పటి నుంచి అడుగడుగునా తప్పులు జరుగుతున్నాయని భూమన ఆరోపించారు.
చంద్రబాబు పాలనలో సీసీ కెమెరాల పుటేజ్ బయటపెట్టాలని భూమన డిమాండ్ చేశారు. లడ్డూ విషయంలో జరిగినట్లే సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. వందల కోట్లు అవినీతికి పాల్పడ్డామని మాపై నిందలు వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీవాణి ట్రస్టు రద్దు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇది చాలా మంచి స్కీమ్ అని మెచ్చుకున్నారని భూమన గుర్తు చేశారు. పరకామణిలో ఏం జరుగుతుందో నిరంతరం చూపించాలి, విఐపీ దర్శనాలు తగ్గిస్తున్నామని చెప్పి, ఇంకా పెంచుతూ పోయారని భూమన విమర్శించారు.
