రూ.18 కోట్లు పెట్టి..90 డిగ్రీల మలుపుతో ఫ్లైఓవర్..భోపాల్ లో చోద్యం
తాజాగా భోపాల్ లో చేపట్టిన ఓ ఫ్లై ఓవర్ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వాడకందారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇదేం డిజైన్ అంటూ నోరెళ్లబెడుతున్నారు.
By: Tupaki Desk | 12 Jun 2025 3:17 PM ISTఎక్కడైనా ఫ్లై ఓవర్లు ఎందుకు కడతారు..? ట్రాఫిక్ సమస్యను నిరోధించడానికి.. భవిష్యత్ లో ఏమైనా రోడ్డు విస్తరణ లాంటి ప్రాజెక్టులు చేపట్టినా ఇబ్బందులు రాకుండా ఉండడానికి.. ఇక నగరాలు/పట్టణాల్లో రైల్వే లైన్ వంటివి అడ్డం వస్తే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా వాటి మీదుగా ఫ్లై ఓవర్లు కడతారు.
శతాబ్దాల చరిత్ర ఉన్న తమిళనాడు రాజధాని చెన్నైలో 30 ఏళ్ల కిందట ఫ్లైఓవర్ల నిర్మాణం అనే విప్లవం తీసుకొచ్చారు అప్పటి మేయర్, ప్రస్తుత సీఎం స్టాలిన్. భారతీయ సిలికాన్ వ్యాలీగా మారిన బెంగళూరులో ఇలాంటి ముందుచూపు లేకపోవడంతోనే ఇప్పటికీ తీవ్ర ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. అయితే, తెలుగువారికి ఇష్టమైన నగరం హైదరాబాద్ లో ఈ ఇబ్బంది లేదు. అన్ని ప్రభుత్వాలు చాలా ముందుచూపుతో ఫ్లైఓవర్లు కట్టుకుంటూ వెళ్లాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్ జామ్ లు వస్తున్నా అవి కేవలం అప్పటి పరిస్థితుల కారణంగానే. మరో ముఖ్య విషయం ఏమంటే.. ఈ మూడు నగరాల్లోనూ ట్రాఫిక్ నివారణకు మెట్రో రైల్ సేవలు అందుబాటులో ఉండడం.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్. ఈ పేరు వినగానే మనందరికీ 1984 నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ఫ్యాక్టరీ ప్రమాదమే. ఈ దుర్ఘటనలో మిథైల్ ఐసో సైనేట్ లీక్ అయి వేలాదిమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దేశ నడిబొడ్డున ఉండే భోపాల్ 41ఏళ్ల కిందటి ఈ ఘొర ప్రమాద ముద్రను చెరిపేసుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఈ 40 ఏళ్లలో దేశంలోని చాలా నగరాలు డెవలప్ మెంట్ లో దూసుకెళ్లగా.. భోపాల్ మాత్రం అలానే ఉండిపోయింది.
తాజాగా భోపాల్ లో చేపట్టిన ఓ ఫ్లై ఓవర్ (రైల్వే ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం వైరల్ అవుతోంది. సోషల్ మీడియా వాడకందారులతో పాటు స్థానిక ప్రజలు కూడా ఇదేం డిజైన్ అంటూ నోరెళ్లబెడుతున్నారు. రూ.18 కోట్లతో ఐష్ భాగ్ స్టేడియం వద్ద నిర్మించిన ఈ బ్రిడ్జి 90 డిగ్రీల కోణంలో ఉండడమే దీనికి కారణం. వాస్తవానికి ఫ్లైఓవర్ లేదా రైల్వే ఓవర్ బ్రిడ్జిలను వాహనాలను వేగంగా వెళ్లేలా నిర్మిస్తారు. అలాంటివి 90 డిగ్రీల కోణంలో ఉంటే ఎలా అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానంగా అధికారులు ఏం చెబుతున్నారో తెలుసా?.. బ్రిడ్జి నిర్మాణంలో భూమి కొరత కారణంగానే ఇలా చేపట్టామని.. ఫొటో చూస్తే మీకే అసలు విషయం అర్థం అవుతుంది.
