Begin typing your search above and press return to search.

భోగాపురం విమానాశ్రయం దేశంలోనే రెండోది.. ఈ రికార్డు ఎందుకంటే..

విశాఖపట్నం సమీపంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అరుదైన రికార్డు నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   3 Jan 2026 5:00 AM IST
భోగాపురం విమానాశ్రయం దేశంలోనే రెండోది.. ఈ రికార్డు ఎందుకంటే..
X

విశాఖపట్నం సమీపంలో నిర్మించిన భోగాపురం విమానాశ్రయం అరుదైన రికార్డు నమోదు చేసింది. రెండు రోజుల్లో ట్రైల్ రన్ కు సిద్ధమవుతున్న ఈ విమానాశ్రయం గ్రీన్ ఫీల్డ్ విభాగంలో దేశంలోనే రెండో ఎయిర్ పోర్టుగా ఖ్యాతి గడించింది. వాయువేగంతో పూర్తయిన గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయంగా కూడా భోగాపురం పేరు తెచ్చుకుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరో ఆరు నెలల్లో వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ విమానాశ్రయం విశాఖ నగరానికి తద్వారా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి గేమ్ ఛేంజర్ గా పనికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఈ నెల 4న టెస్ట్ ఫ్లైట్ కు రంగం సిద్ధం కావడంతో భోగాపురం నిర్మాణం పూర్తయినట్లే భావిస్తున్నారు. చిన్నచిన్న పనులు మాత్రమే మిగిలి ఉండటంతో భోగాపురం ఎయిర్ పోర్టు వీలైనంత త్వరలో ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

దేశంలో రెండో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం భోగాపురం. దీనికి ముందు ముంబై మహానగరంలో తొలి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు నిర్మించారు. అయితే ఈ రెండు విమానాశ్రయలను పోల్చి చూస్తే.. భోగాపురం విమానాశ్రయం కొత్త చరిత్రను నమోదు చేసినట్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇటీవలే నిర్మాణం పూర్తి చేసుకున్న ముంబై రెండో ఎయిర్‌పోర్టు నిర్మాణ పనులు దాదాపు 25 ఏళ్ల పాటు సాగాయని చెబుతున్నారు. దేశ ఆర్ధిక రాజధాని అయిన ముంబైలో విమానాల ట్రాఫిక్ పెరిగిపోవడంతో రెండో విమానాశ్రయం ఉండాలని 90వ దశకంలోనే ప్రభుత్వం భావించింది. కానీ, అనేక అవాంతరాలతో నిర్మాణానికి సుదీర్ఘ కాలం పట్టిందని అంటున్నారు.

ఇదే సమయంలో మరో మెట్రో నగరం బెంగళూరులో రెండో విమానాశ్రయం నిర్మాణం కోసం అక్కడి ప్రభుత్వాలు పదేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. కానీ, ఇంతవరకు కార్యరూపం తేలేకపోయాయని చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బెంగళూరుకు రెండో విమానాశ్రయం ఎప్పుడు ప్రారంభం అవుతుందో.. ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఉందని అంటున్నారు. కానీ విశాఖపట్నంలో భోగాపురం ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు నిర్మాణం రికార్డు సమయంలో పూర్తయింది. ఇది విశాఖ వాసులకు ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రెండో విమానాశ్రయం కావడం గమనార్హం. ముంబై, బెంగళూరుకి దశాబ్దాలు పట్టిన పని విశాఖలో రెండేళ్లలోపే పూర్తయిందని, ఈ సక్సెస్‌ కు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కారణమని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

నిజానికి భోగాపురం విమానాశ్రయం ఐదేళ్ల క్రితమే పూర్తి కావాల్సివుందని అంటున్నారు. 2019లోనే ఈ విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగితే.. రకరకాల కారణాల వల్ల పనులు ముందుకు సాగలేదు. 2023లో అప్పటి సీఎం జగన్ మరోసారి విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆయన అధికారం నుంచి దిగిపోయారు. అయితే 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. ప్రభుత్వ మార్గనిర్దేశంలో కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేసింది. విజయనగరం జిల్లాలో నిర్మిస్తున్న భోగాపురం విమానాశ్రయాన్ని జీఎంఆర్ సంస్థ చేపడుతోంది. ఈ సంస్థ యాజమాన్యం స్థానికులే కావడం, కేంద్ర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ ప్రాంతీయుడే కావడంతో రికార్డు సమయంలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తి చేశారని అంటున్నారు.