భోగాపురం ఎయిర్‌పోర్ట్ టూ విశాఖ- బస్సులే బస్సులు !
విశాఖ నుంచి ఎయిర్ పోర్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళిపోతుంది. కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది.
By: Satya P | 31 May 2026 9:38 AM ISTవిశాఖ నుంచి ఎయిర్ పోర్టు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్ళిపోతుంది. కేవలం నెల రోజులు మాత్రమే సమయం ఉంది. ఇక మీదట ఎయిర్ ట్రావెలర్స్ అంతా భోగాపురం వెళ్ళి అక్కడ నుంచి మాత్రమే డొమెస్టిక్ ఫ్లైట్ల నుంచి అన్ని రకాల ఫ్లైట్లు ఎక్కాల్సి ఉంటుంది. అయితే విశాఖకు అరవై కిలోమీటర్ల పైగా దూరం ఉన్న భోగాపురం విమానాశ్రయానికి చేరుకునే దారేదీ అని విమర్శలు ఇప్పటిదాకా వినిపించాయి. భోగాపురం నుంచి విశాఖకు ఎనిమిది లైన్ల రోడ్లు వేస్తున్నారు. అలాగే అనకాపల్లి రూట్లో సెమీ రింగ్ రోడ్డుని డెవలప్ చేస్తున్నారు. ఇక జూలైలో ఎయిర్ పోర్టు ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యేనాటికి బస్సులను కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ విధంగా రవాణా సమస్య లేకుండా పూర్తి జాగ్రత్తలను కూటమి ప్రభుత్వం తీసుకుంటోంది.
ఎయిర్ పోర్టు నుంచి 40 ప్రత్యేక బస్సులు :
ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి విశాఖపట్నానికి ఏకంగా 40 ప్రత్యేక బస్సులు రాకపోకలు సాగించేలా చర్యలు చేపడుతున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నం నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి 40 ప్రత్యేక బస్సులను కేటాయించనున్నట్లు తెలిపారు. ఇవి ఈవీ బస్సులుగా ఉండబోతున్నాయి. దాంతో వేగంతో పాటు పర్యావరణ సమస్యలు లేకుండా సకాలంలో ప్రయాణీకులను అక్కడకి చేర్చి తిరిగి తీసుకుని రావడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.
మొత్తం ఏడువందల దాకా :
ఏపీలో ఆర్టీసీలో ఇపుడు సరికొత్త విప్లవం రాబోతోంది. ఏకంగా బస్సుల ఆధునీకరణ కోసం కూటమి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ఏడు వందల దాకా తొలి దశలో ఈవీ బస్సుల విస్తరణకు కూటమి ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. తొలి దశలో వచ్చే ఈ 700 ఈవీ బస్సులు రెండు నెలల్లో అందుబాటులోకి రానున్నాయని కూటమి ప్రభుత్వ పెద్దలు వెల్లడించారు. జూలై నెలలో ఆరు డిపోలలో ఈవీ బస్సుల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధం కానున్నాయని తెలిపారు.
తిరుపతి కోసం సైతం :
అదే విధంగా ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న ప్రఖ్యాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తిరుపతి కోసం ప్రత్యేకంగా 300 ఈవీ బస్సులను కూటమి ప్రభుత్వం కేటాయించింది. అలాగే మరో 500 ఈవీ బస్సుల కొనుగోలు ప్రక్రియ పూర్తయిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇవే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకు పైగా ఈవీ బస్సులను రంగంలోకి దించి రవాణా రంగాన్ని మొత్తం ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని కీలకమైన అడుగులు వేస్తోంది అని అంటున్నారు.
ప్రైవేటీకరణ లేదు :
ఏపీలో ఆర్టీసీని ప్రైవేటీకరించే ఆలోచన అన్నది ఏ కోశానా కూటమి ప్రభుత్వానికి లేదని ముఖ్యమంత్రి అధ్యక్షత జరిగిన సమావేశంలో స్పష్టం చేయడం విశేషం. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఆర్టీసీ అవినాభావ అనుబంధమని కూడా కూటమి ప్రభుత్వం పేర్కొంటోంది. ఇక ఏపీలో పీపీపీ విధానంలో అన్ని ఆర్టీసీ డిపోల ఆధునీకరణ చేపట్టేందుకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా రవాణా మంత్రి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు.
ఆర్టీసీకి కొత్త రూపు :
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండేళ్లలోనే నైట్ ఔట్ అలవెన్స్ సహా ఉద్యోగుల పలు సమస్యలను పరిష్కరించినట్లు మంత్రి గుర్తుచేశారు. త్వరలో అందుబాటులోకి రానున్న కొత్త ఈవీ బస్సులతో ఏపీఎస్ఆర్టీసీకి మరింత కొత్త రూపు సంతరించుకుంటుందని మంత్రి చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్న ఆర్టీసీని కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందని మంత్రి పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న స్త్రీ శక్తి పథకం విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకుని కొనసాగుతోందని ఆయన చెప్పడం గమనార్హం.
