ట్రెండింగ్ ట్వీట్ ఫైట్.. భోగాపురంపై జగన్ ఆసక్తికర ట్వీట్
భోగాపురం విమానాశ్రయంపై ట్వీట్ వార్ ఆసక్తి రేపుతోంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టు ఘనత తమదంటే తమదని అధికార విపక్షాలు వాదులాడుకుంటున్నాయి
By: Tupaki Desk | 30 July 2026 1:10 AM ISTభోగాపురం విమానాశ్రయంపై ట్వీట్ వార్ ఆసక్తి రేపుతోంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఎయిర్‌పోర్టు ఘనత తమదంటే తమదని అధికార విపక్షాలు వాదులాడుకుంటున్నాయి. విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు తొడుగుతున్నామని, గేట్ వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా ఎయిర్ పోర్టును తీర్చిదిద్దునున్నామని ప్రభుత్వం చెబుతోంది. ఇదే సమయంలో భోగాపురం ఎయిర్ పోర్టు కోసం ముఖ్యమంత్రి ఏమీ చేయకపోయినా క్రెడిట్ చోరీ చేస్తున్నారని మాజీ సీఎం జగన్మోహనరెడ్డి విమర్శలతో ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొడుతున్నారు.
భోగాపురం విమానాశ్రయం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమీ చేయలేదని, 2019 ఎన్నికలకు ముందు హడావుడిగా శంకుస్థాపన చేసి, ఇప్పుడు క్రెడిట్ అంతా తనదే అంటూ చెప్పుకుంటున్నారని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి విమర్శిస్తున్నారు. ఈ మేరకు ఎక్స్ లో సుదీర్ఘ పోస్టు రాశారు. భోగాపురం విమానాశ్రయం క్రెడిట్‌ను చోరీ చేసేందుకు చంద్రబాబు నాయుడు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని, తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలంటూ ‘క్రెడిట్ వితౌట్ కంట్రిబ్యూషన్’ రాజకీయం చేస్తున్నారని ఆరోపంచారు. 2020 జూన్ నెలలో తమ ప్రభుత్వమే కాంట్రాక్టు సంస్థ జీఎంఆర్ తో ఒప్పందం చేసుకుందని జగన్ రెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు.
అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే భూసేకరణ పూర్తి చేశామని, 4 గ్రామాల నిర్వాసితులకు పునరావాసం కల్పించామని వివరించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం రూ.967 కోట్లు, ఎయిర్‌పోర్టుకు నీళ్లు తీసుకురావడం కోసం రూ.75కోట్లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కోసం రూ. 134.5 కోట్లు, ప్రత్యామ్నాయ రోడ్ల కోసం రూ.7.29 కోట్లు, సబ్‌స్టేషన్ కోసం రూ.2.35 కోట్లు ఖర్చు చేశామని లెక్కలతో సహా తన ట్వీట్ లో రాసుకొచ్చారు. మొత్తంగా తన ప్రభుత్వంలో రూ.1200 కోట్లు పెడితే ఇప్పుడు మీరేం చేశారు చంద్రబాబుగారూ? అంటూ మాజీ సీఎం నిలదీశారు.
భూసేకరణ నుంచి అనుమతుల వరకు అన్ని పనులు వైసీపీ ప్రభుత్వమే పూర్తి చేసినా, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం విశాఖపట్నం నగరం నుంచి విమానాశ్రయానికి వేగంగా చేరుకునేందుకు ఇప్పటికీ సరైన రోడ్డు నిర్మించలేకపోయిందని ఆరోపించారు. రూ.6,300 కోట్ల ఖర్చుతో 55 కి.మీ. మేర ఆరులైన్ల హైవేను కేంద్రం ప్రకటించినా, రెండేళ్లు గడుస్తున్నా ఆ రహదారికి అతీగతీ లేదని ఆరోపించారు. ప్రయాణికులు నరకయాతన పడాల్సిన పరిస్థితి నెలకొందని విమర్శించారు.
ఇక మాజీ సీఎం విమర్శలపై అధికార టీడీపీ కూటమి ఎక్స్ లో అదేస్థాయిలో ఎదురుదాడి చేస్తోంది. గతంలో భోగాపురం ఎయిర్‌పోర్టును తీవ్రంగా వ్యతిరేకించిన మాజీ సీఎం జగన్మోహనరెడ్డి ప్రకటనలను ఎత్తిచూపుతోంది. 2015 ఏప్రిల్ 22న భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకిస్తూ విశాఖ ఎయిర్‌పోర్టును విస్తరించుకోవచ్చు కదా అంటూ జగన్ రెడ్డి చేసిన ప్రకటనను గుర్తు చేసింది. అదేవిధంగా ఎయిర్‌పోర్ట్ పేరు చెప్పి 15,000 ఎకరాల భూమిని పూలింగ్ కింద తీసుకోవడాన్ని వ్యతిరేకించిన విషయాన్ని ఎత్తిచూపింది. అప్పట్లో ఎర్రబస్సు కూడా రాని ఊరికి ఎయిర్‌బస్సులు తీసుకువస్తారా? అంటూ మాట్లాడారని గుర్తుచేస్తూ ఎక్స్ లో ట్వీట్ లు చేస్తోంది. ఇలా రెండు వైపుల నుంచి భోగాపురం ఎయిర్ పోర్టు క్రెడిట్ కోసం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ప్రతి విమర్శలు చోటుచేసుకుంటుండటం ఆసక్తి రేపుతోంది.
