బొత్స మేనల్లుడు ఎంపీనా లేక ఎమ్మెల్యేగానా ?
అయితే ఆయన తగినంత సమయం భీమిలీలో వైసీపీని అభివృద్ధి చేసేందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది విమర్శగా ఉంది.
By: Satya P | 12 July 2026 9:16 AM ISTవిజయనగరం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా పరిషత్తు చైర్మన్ గా ఉన్న వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను వచ్చే ఎన్నికల్లో ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా దేనికి పోటీ చేస్తారు అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఆయన రాజకీయ క్షేత్రం పూర్తిగా విజయనగరం జిల్లాగానే ఉంది. ఆయన జిల్లా అధ్యక్షుడిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయనకు అక్కడే పట్టు ఉంది. అయితే విశాఖ జిల్లా భీమునిపట్నం అసెంబ్లీ ఇంచార్జిగా ఆయనకు వైసీపీ అధినాయకత్వం బాధ్యతలు అప్పగించింది. దాంతో ఆయన ఈ బాధ్యతను కూడా మోస్తున్నారు. అయితే ఆయన తగినంత సమయం భీమిలీలో వైసీపీని అభివృద్ధి చేసేందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది విమర్శగా ఉంది.
అసలే కంచుకోటగా :
ఇక భీమిలీ అన్నది సామాన్యమైన సీటు కాదు. ఇది టీడీపీకి కంచుకోటగా ఉంది. 1983 నుంచి ఇప్పటికి పది సార్లు అసెంబ్లీకి ఎన్నికలు జరిగితే మూడు సార్లు తప్ప మిగిలిన అన్ని సార్లూ టీడీపీ గెలిచింది. భీమిలీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం నిర్ణయాత్మక శక్తిగా ఉంటుంది. అలాగే బీసీలు అధికం. మత్స్యకారులు యాదవులు నాగవంశీకులు ఇలా అనేక సామాజిక వర్గాలు భీమిలో రాజకీయాల్లో ప్రభావితం చేస్తాయి. చిన్న శ్రీను కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడం, భీమిలీ అసెంబ్లీలో కొంత భాగం విజయనగరం అసెంబ్లీ సీటుని ఆనుకుని ఉండడంతో ఆయనకు ఈ బాధ్యతకు అప్పగించారు అని అంటున్నారు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేసిన తరువాత వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భీమిలీ వైసీపీకి చిన్న శ్రీను చుట్టపు చూపుగా వస్తున్నారు అన్న విమర్శలు సొంత పార్టీ నుంచే ఉన్నాయని అంటున్నారు.
వర్గ పోరుతో పార్టీ :
ఇక స్థానికులకే వైసీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించాలని వైసీపీలో డిమాండ్ ఉంది. గతంలో కూడా అవంతికి బాధ్యతలు అప్పగించి సీటు ఇచ్చారు. ఆయన తీరా గెలిచిన తరువాత తన సొంత వర్గానికే మేలు చేశారు అని వైసీపీలో మొదటి నుంచి ఉంటున్న వారికి అన్యాయం జరిగింది అని గుర్తు చేస్తున్నారు. ఇక వర్గ పోరు అధికం అయి 2024 లో ఘోరంగా వైసీపీ ఓటమి పాలు అయింది అని అంటున్నారు. ఇపుడు కూడా స్థానికేతరుడిగా చిన్న శ్రీనుని వైసీపీ వర్గాలు అంటున్నాయి. దాంతో టీడీపీకి బలమైన కంచుకోటలో వైసీపీ మరింతగా ఇబ్బందులు పడుతోంది తప్ప ఎత్తిగిల్లలేకపోతోంది అని అంటున్నారు.
ఎంపీగానే చాన్స్ :
చిన్న శ్రీనుకి వచ్చే ఎన్నికల్లో విజయనగరం నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇస్తారు అని కూడా అంటున్నారు. ఎన్నికల సమయానికి సరైన నాయకుడికే టికెట్ దక్కుతుందని ఒక వైపు ప్రచారం సాగుతోంది. అయితే విశాఖ జిల్లాలో కూడా బొత్స హవా సాగుతున్న నేపధ్యంలో చిన్న శ్రీను భీమిలీ నుంచి ఎమ్మెల్యేగానే పోటీకి దిగుతారు అని అంటున్నారు. ఒకవేళ ఆయనకు ఆ ఉద్దేశం ఉంటే ఇప్పటి నుంచే పార్టీని పటిష్టం చేయాలని విజయనగరం జిల్లా రాజకీయాలను వదిలేసి పూర్తి కాలం వెచ్చించాలని పార్టీ నేతలు కోరుతున్నారు. అలా కాకుండా రెండు చోట్లా ఉంటే కనుక అది వైసీపీకే ఇబ్బంది అవుతుందని అంటున్నారు.
