Begin typing your search above and press return to search.

రేవంత్ అలా .. భట్టి ఇలా !

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేత ఒక్కో విధంగా ప్రవర్తిస్తుండడం, ఒకే అంశం మీద ఒక్కొక్కరూ ఒక్కో వైఖరి ప్రదర్శిస్తుండడం పార్టీ వర్గాలలో గందరగోళానికి దారి తీస్తున్నది

By:  Tupaki Desk   |   20 April 2024 8:08 AM GMT
రేవంత్ అలా .. భట్టి ఇలా !
X

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక్కో నేత ఒక్కో విధంగా ప్రవర్తిస్తుండడం, ఒకే అంశం మీద ఒక్కొక్కరూ ఒక్కో వైఖరి ప్రదర్శిస్తుండడం పార్టీ వర్గాలలో గందరగోళానికి దారి తీస్తున్నది. అసలు ఇది అధిష్టానం పన్నిన వ్యూహమా ? లేక నాయకుల అవగాహనా లోపమా ? అని పార్టీలో అంతర్గతంగా తీవ్ర చర్చలు నడుస్తున్నాయి. రెండు రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ పర్యటనకు వెళ్లాడు. ఈ సంధర్భంగా అక్కడ ప్రచారంలో మాట్లాడుతూ ‘‘కేరళ సీపీఎం ముఖ్యమంత్రి పినరయి విజయన్ కమ్యూనిస్ట్ రూపంలో కనిపించే కమ్యునలిస్ట్ అని, తెర వెనక ఆయనకు బీజేపీతో సంబంధాలు ఉన్నాయి’’ అని ఆరోపించాడు. రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే సీపీఎం పార్టీకి కోపం తెప్పించాయి.

కేరళలో రేవంత్ సీపీఎం మీద ఆరోపణలు చేయగా శుక్రవారం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సీపీఎం పార్టీకి స్వయంగా వెళ్లి పార్టీ రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రం, చెరుపల్లి సీతారాములులను కలిసి ఎన్నికలలో మద్దతు అభ్యర్థించడం చర్చకు దారి తీసింది. ఈ సంధర్భంగా కేరళలలో రేవంత్ వ్యాఖ్యలను సీపీఎం నేతలు భట్టి విక్రమార్కతో ప్రస్తావించినట్లు తెలుస్తున్నది. ‘‘కేరళలో బీజేపీ వందలాది మంది కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తుందని, అక్కడ బీజేపీని నిలువరించేందుకు శాయశక్తులా సీపీఎం పనిచేస్తుందని, అలాంటిది అక్కడికి వెళ్లి రేవంత్ అలా మాట్లాడడం సరైనది కాదని’’ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం.

సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ పార్టీలు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేయగా, ఉప ముఖ్యమంత్రి మాత్రం ఎన్నికలలో మద్దతు కోరుతూ తమ కార్యాలయానికి రావడం పట్ల సీపీఎం కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో ప్రతి విషయం ప్రజల్లోకి వెళ్లే ముందు నాయకులు అంతా ఒకే మాట మీద ఉంటే బాగుంటుందని, లేకుంటే కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా గందరగోళానికి గురవుతారన్న వాదన వినిపిస్తున్నది.