Begin typing your search above and press return to search.

కేటీఆర్ తో భట్టి, ఉత్తం... ఆ పని చేస్తున్నదెవరు?

తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి.. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కింది. ఉన్నంతలో క్లియర్ మెజారిటీనే కాంగ్రెస్ కు కట్టబెట్టారు తెలంగాణ ప్రజానికం.

By:  Tupaki Desk   |   7 Dec 2023 6:30 AM GMT
కేటీఆర్  తో భట్టి, ఉత్తం... ఆ పని చేస్తున్నదెవరు?
X

తెలంగాణలో ఎన్నికలు ముగిసాయి.. కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ దక్కింది. ఉన్నంతలో క్లియర్ మెజారిటీనే కాంగ్రెస్ కు కట్టబెట్టారు తెలంగాణ ప్రజానికం. ఈ సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ఉత్తం కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే ఫైనల్ గా అధిష్టాణం రేవంత్ వైపే మొగ్గు చూపింది. దీంతో తెలంగాణకు రెండో ముఖ్యమంత్రిగా రేవంత్ అవుతున్నారు!

అవును... తెలంగాణకు సరికొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ ఎంపికయ్యారు. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో భ‌ట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డిలపై కొంతమంది ఉద్దేశ పూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నార‌ని వారి అభిమానులు వాపోతున్నారు. ఇందులో ప్రధానంగా కేటీఆర్‌ తో వాళ్లిద్దరు గ‌తంలో భేటీ అయిన ఫొటోను తెర‌పైకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ చేస్తున్నారు.

దీంతో ఆ ఫోటోలకు "ఇలాంటి వాళ్లు డిప్యూటీ సీఎంలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం పని అంతే సంగ‌తులు" అంటూ ట్రోలింగ్ చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో... తెలంగాణ కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌లు భ‌ట్టి విక్రమార్క, ఉత్తం కుమార్ రెడ్డి లను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేశారని.. వాళ్లిద్దరిపై ఎవరో కావాలనే కుట్రపూరిత టార్గెట్ చేశారని వారి వారి అనుచ‌రులు వాపోతున్నారు.

ఇదే సమయంలో ఎన్నిక‌ల‌కు ముందు కూడా మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తం కుమార్ రెడ్డితోపాటు మ‌రికొంద‌రు కీలక నేతలు బీఆరెస్స్ లోకి వెళుతున్నట్టు ప్రచారం చేయ‌డం వెనుక‌ కూడా భారీ వ్యూహం దాగి ఉందని చెబుతున్నారు. ఉద్దేశ పూర్వకంగానే బీఆరెస్స్ నేత‌ల‌తో భ‌ట్టి, ఉత్తం కుమార్ రెడ్డి స‌న్నిహితంగా ఉండేవారనే ప్రచారం చేయడం ద్వారా వాళ్లిద్దరిని రాజ‌కీయంగా అడ్డు తొల‌గించుకునేందుకు ప‌న్నిన కుట్రగా ప్రచారం జ‌రుగుతోంది.

దీంతో ఆ అదృశ్య శక్తి ఎవరు... వీరిద్దరినీ అడ్డు తొలగించుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికి అనే ప్రశ్నలు నెట్టింట దర్శనమిస్తున్నాయి. దీంతో శుభమా అని సుమారు 10ఏళ్ల తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న క్రమంలో... తెలంగాణ‌లో నిజ‌మైన కాంగ్రెస్ వాదుల‌ను బ‌ద్నాం చేయ‌డానికి పెద్ద కుట్ర జ‌రిగిందని అనుమానాలు వ్యక్తమ‌వుతున్నాయి. దీంతో... ఇలాంటి అనుమానాలను వీలైనంత తొందరగా అణిచిపెట్టని పక్షంలో ఇబ్బందులు తప్పవనే కామెంట్లు వినిపిస్తున్నాయి!