Begin typing your search above and press return to search.

వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!

తిరిగి అక్టోబర్‌ 3 న చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ ముందు సరెండర్‌ అవ్వాలని వైఎస్‌ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

By:  Tupaki Desk   |   22 Sep 2023 8:01 AM GMT
వైఎస్‌ వివేకా హత్య కేసులో కీలక పరిణామం!
X

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కీలక పరిణామం చోటు చేసుకుంది. వివేకా కేసులో అరెస్ట్‌ అయిన కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి చంచల్‌ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. 12 రోజుల పాటు భాస్కర్‌రెడ్డి కి ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైన సంగతి తెలిసిందే. భాస్కర్‌ రెడ్డి అనారోగ్యంగా ఉన్నట్టు కోర్టుకు చంచల్‌ గూడ సూపరింటెండెంట్‌ రిపోర్ట్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స దృష్ట్యా భాస్కర్‌ రెడ్డికి సీబీఐ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

హైదరాబాద్‌ లోనే చికిత్స పొందాలని భాస్కర్‌ రెడ్డికి ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌ ను విడిచివెళ్లవద్దని పలు షరతులు విధించింది. ఈ మేరకు సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన జైలు నుంచి సెప్టెంబర్‌ 22న విడుదలయ్యారు.

తిరిగి అక్టోబర్‌ 3 న చంచల్‌ గూడ జైలు సూపరింటెండెంట్‌ ముందు సరెండర్‌ అవ్వాలని వైఎస్‌ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. జైలు నుంచి విడుదలైన వెంటనే భాస్కర్‌ రెడ్డిని చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌ కు తరలించారు.

2019 ఎన్నికల ముందు మార్చిలో వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. మొదట్లో గుండెపోటు అని వార్తలు వచ్చినా తర్వాత ఆయనది హత్య అని వెల్లడైంది. దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డి, సునీల్‌ యాదవ్, దస్తగిరి, వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డి తదితరులు వైఎస్‌ వివేకా హత్యలో సూత్రధారులు, పాత్రధారులని సీబీఐ అభియోగాలు మోపింది. వివేకా హత్యకు కుట్రపన్నడంతోపాటు హత్య తర్వాత సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడం, సాక్షులను బెదిరించడం వంటి పనులకు పాల్పడ్డారని సీబీఐ అభియోగాలు నమోదు చేసింది.

కడప ఎంపీగా వైఎస్‌ షర్మిల లేదా వైఎస్‌ విజయమ్మ పోటీ చేయాలని వైఎస్‌ వివేకా సూచించారని.. ఇదే జరిగితే తన కుమారుడికి సీటు రాదని భావించి వైఎస్‌ భాస్కరరెడ్డి.. వివేకాను హత్య చేయించారని సీబీఐ అభియోగాలు మోపింది. అంతేకాకుండా గతంలో వివేకా ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయినప్పుడు వైఎస్‌ భాస్కరరెడ్డికి ఇంటికి వెళ్లి వారిని తిట్టారని.. ఈ కోపం కూడా వారిలో ఉందని సీబీఐ ఆరోపించింది.

ఇప్పటికే ఈ వ్యవహారంలో వైఎస్‌ భాస్కరరెడ్డి బెయిల్‌ కోసం పలుమార్లు పిటిషన్లు పెట్టుకోగా వాటిని కోర్టు తిరస్కరించింది. మరోవైపు వైఎస్‌ వివేకా కుమార్తె సునీత.. నిందితులు దాఖలు పిటిషన్లకు కౌంటర్లు దాఖలు చేస్తూ వస్తున్నారు. బెయిల్‌ ఇవ్వవద్దని ఆమెతోపాటు సీబీఐ కూడా కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు వైఎస్‌ భాస్కరరెడ్డికి సీబీఐ కోర్టు 12 రోజులపాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.