నెట్టింట ఎందరో భాస్కర్ రెడ్డిలు.. అందరికీ ఇవి స్ట్రాంగ్ హెచ్చరికలు!
అలాగని భాస్కర్ రెడ్డికీ... చంద్రబాబు, లోకేష్, పవన్, భువనేశ్వరి వంటి వారితో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వమూ లేదు.. కనీసం వారిని అతడు ప్రత్యక్షంగా చూశాడో లేదో కూడా తెలియదు!
By: Tupaki Political Desk | 9 Nov 2025 1:42 PM ISTగత కొంతకాలంగా రాజకీయాల్లో వికృత చేష్టలు పెరిగిపోతున్నాయనే చర్చ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థిని విమర్శించాలంటే.. ఆ విమర్శ హుందాగా ఉండాలనే ఇంగితం మరిచిపోతున్నారు. పైగా సదరు రాజకీయ నాయకుడి భార్యను, కుటుంబ సభ్యులను సైతం దూషించడం.. మార్ఫింగ్ ఫోటోలు సృష్టించే నీచానికీ ఒడిగడుతున్నారు. అలాంటి వారికి ఓ లెసన్ భాస్కర్ రెడ్డి ఉదంతం!
అవును... ఇటీవల రాజకీయాల్లో సోషల్ మీడియాని పనికిమాలిన పనులకు వాడుతున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఓ విషయంపై విమర్శించాలంటే.. అది సబ్జెక్ట్ పరంగా ఉండటం మారిపోతోంది. ప్రత్యర్థి నాయకుడితో ఏదో పూర్వజన్మ వైరం ఉందన్నంత స్థాయిలో విమర్శలు వికృతరూపం దాలుస్తున్నాయి. అసహ్యం కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా భాస్కర్ రెడ్డి అరెస్టయ్యారు!
సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినట్లు చెబుతున్న భాస్కర్ రెడ్డి.. లండన్ వెళ్లారు. ఈ క్రమంలో గత కొంతకాలంగా చంద్రబాబు, పవన్, లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యులపైనా శృతిమించిన, వికృత పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు! ఏడు సముద్రాల అవతల ఉన్నాములే.. మమ్మల్ని ఎవరు ఏమి చేస్తారనే నమ్మకమో, ధైర్యమో, అజ్ఞానమో, అమాయకత్వమో తెలియదు కానీ.. నిరాటంకంగా చెలరేగిపోయారు!
కట్ చేస్తే... ఆయన ఏపీకి రావాల్సి వచ్చింది. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొనడానికి ఆయన వచ్చారు. దీనికి సంబంధించిన సమాచారం పోలీసులకు అందింది. దీంతో.. రంగంలోకి దిగిన పోలీసులు అత్యంక్రియలు పూర్తి చేసిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో తనను పోలీసులు గట్టిగా కొట్టారని ఆయన ఆరోపించారు.. అతని అరెస్టును ఖండిస్తూ వైసీపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు.. ట్విట్టర్ లో పోస్టులు పెట్టారు.
అంతకు మించి భాస్కర్ రెడ్డికి ఒరిగిందేమీ లేదు! అంతకు మిమిచ్ దొరికేది కూడా ఏమీ ఉండే అవకాశం లేదు!! కారణం... గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు, పవన్, లోకేష్ లతో పాటు రాజకీయాలతో సంబంధం లేని నారా భువనేశ్వరిపైనా అతడు అసభ్యకరమైన పోస్టులు పెట్టారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. దాన్ని నాడు అతడు "గొప్ప"గా భావించి ఉండొచ్చు! కానీ ఇప్పుడు పాపం పండిన పరిస్థితి!
అలాగని భాస్కర్ రెడ్డికీ... చంద్రబాబు, లోకేష్, పవన్, భువనేశ్వరి వంటి వారితో ఎలాంటి వ్యక్తిగత శత్రుత్వమూ లేదు.. కనీసం వారిని అతడు ప్రత్యక్షంగా చూశాడో లేదో కూడా తెలియదు! కానీ.. తాను ఇష్టపడే పార్టీకి తానేదో మేలు చేస్తున్నాను అనే మైకంలో, తనను పార్టీ పెద్దలు గుర్తిస్తారనే ఆలోచనతోనో ఇలాంటి అసభ్యకరమైన పనికి పూనుకున్నాడు.
అంతా ఆలోచించుకోవాల్సిన సమయం ఇది!:
మొన్న ఓ ఎన్నారై, నేడు భాస్కర్ రెడ్డి, రేపు మరో వ్యక్తి.. ఎవరైనా కానీ, ఎక్కడ నుంచైనా కానీ... ఇలాంటి పనులకు పూనుకోవడం వల్ల ఎప్పటికైనా పాపం పండుతుందని, ఫలితం అనుభవించాల్సి వస్తుందని, ఫలితంగా జీవితం పాడవుతుందని గ్రహించుకోవాలి. ఇలాంటి పోస్టుల వల్ల.. తాను అభిమానించే నాయకుడికి ఒరిగేదీ ఉండదు.. తాను వ్యతిరేకించే నేతకు ఊడేదేమీ ఉండదు అన్న విషయాన్ని ఎప్పటికీ, ఎవరూ మరిచిపోకూడదు.
ప్రధానంగా భాస్కర్ రెడ్డి అనుభవాన్ని సోషల్ మీడియా సైన్యం అని, సోషల్ మీడియా పులులమని, సిమ్హాలమని చెప్పుకుని చెలరేగిపోయే జనాలు.. స్వానుభవం వరకూ తెచ్చుకోకుండా జాగ్రత్తపడాలి. నచ్చిన పార్టీ ఉంటే ఓటు వేయాలి, పది మందిని ప్రజాస్వామ్య పద్దతిలో ప్రభావితం చేసి ఓటు వేయించాలి. ఆ విషయం మరిచి.. ప్రత్యర్ధులను దూషించడం వల్ల తన పార్టీకి ఏదో ప్రయోజనం కలుగుతుందని వారు భావిస్తే... నెక్స్ట్ భాస్కర్ రెడ్డిలు వారే అవుతారు... పార్టీ ఏదైనా, అధికారంలో ఎవరున్నా..!!
