Begin typing your search above and press return to search.

భారత్ బియ్యం.. మోడీ సర్కారు తాజా పథకమిది.. కేజీ ఎంతంటే?

మోడీ సర్కారు మరో కొత్త పథకానికి తెర తీసింది. 'భారత్ బియ్యం' పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Dec 2023 9:30 AM GMT
భారత్ బియ్యం.. మోడీ సర్కారు తాజా పథకమిది.. కేజీ ఎంతంటే?
X

మోడీ సర్కారు మరో కొత్త పథకానికి తెర తీసింది. 'భారత్ బియ్యం' పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. కేజీ రూ.25కే అందించటం ద్వారా మధ్యతరగతి జీవులకు కాస్తంత ఉపశమనంగా మారుతుందని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటికే భారత్ ఆటా.. భారత్ డాల్ పేరుతో గోధుమ పిండి.. పప్పుల్ని విక్రయిస్తున్న కేంద్రం.. ఇప్పుడు బియ్యం మీద ఫోకస్ పెట్టింది. ఈ భారత్ బియ్యాన్ని భారత జాతీయ వ్యవసాయ సహకార విపణి సమాఖ్య.. జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య సంచార శకటాల ద్వారా ప్రజలకు అందించాలన్నది ఆలోచనగా చెబుతున్నారు.

మరో నాలుగు నెలల్లో సార్వత్రి ఎన్నికలు ముంచుకొస్తున్న బియ్యం ధరలు భారీగా పెరిగి.. మధ్యతరగతి జీవులు ఇబ్బందులు పడుతున్న వైనం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. భారత్ బియ్యం పేరుతో రాయితీ ధరకు బియ్యాన్ని అందించటం ద్వారా ప్రభుత్వం మీద సానుకూలతను పెంచుకోవాలన్నది మోడీ సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. జాతీయ మీడియా సంస్థలు నుంచి ప్రాంతీయ మీడియా సంస్థలు భారత్ బియ్యం పథకం గురించి వార్తలు ఇస్తున్నట్లుగా వార్తలు అందిస్తున్నా.. కేంద్రం మాత్రం ఇప్పటివరకు సానుకూల ప్రకటన చేయకపోవటం గమనార్హం.

తగ్గింపు ధరలకే భారత్ ఆటా.. భారత్ డాల్ అందిస్తున్న వేళ.. బియ్యాన్ని కూడా బ్రాండ్ చేసి అమ్మేసే ప్రక్రియ కోట్లాది మందికి ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేజీ బియ్యం కనిష్ఠంగా రూ.45 గరిష్ఠంగా రూ.70వరకు చేరుకున్న దుస్థితి. ఇలాంటి వేళ కేజీ పాతికకు ఇవ్వటం ద్వారా ప్రజల్లో సానుకూలత పెంచొచ్చన్న మాట వినిపిస్తోంది. ధరల నియంత్రణలో మోడీ సర్కారు వైఫల్యం చెందుతున్న ప్రచారం ఎన్నికల వేళ మరింత పెరిగే పరిస్థితి.

అలాంటి నెగిటివ్ ప్రచారానికి చెక్ పెట్టేలా భారత్ బియ్యం పథకాన్ని తెర మీదకు తీసుకొస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే దేశంలోని రెండువేల కేంద్రాల నుంచి భారత్ బియ్యం అమ్మకాల్ని చేపడుతున్నట్లుగా చెబుతున్నారు. అనంతరం.. ఇతర ప్రాంతాల్లోకి ఈ పంపిణీ వ్యవస్థను విస్తరించే వీలుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కీలకమైన సార్వత్రిక ఎన్నికల వేళకు పాతిక రూపాయిలకు కేజీ బియ్యాన్ని అందించటం ద్వారా మోడీ సర్కారు మీద సానుకూలత పెంచే వీలుంది. కాకుంటే.. బియ్యం నాణ్యత విషయంలో మోడీ సర్కారు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.ఈ విషయంలో చిన్నతేడా వచ్చినా మొదటికే మోసం అవుతుందన్న మాట వినిపిస్తోంది.