హ్యుమన్ ట్రాఫికింగ్..! ఒక్కసారిగా ఉలిక్కిపడిన హైదరాబాద్
ఢాకాకు చెందిన రూపా అనే మహిళ పర్యటన పేరుతో భారత్‌కి తీసుకెళ్తానని నమ్మబలికిందని బాలిక పోలీసులకు తెలిపింది.
By: Tupaki Desk | 17 Aug 2025 4:00 PM ISTభాగ్యనగరంలో మైనర్ల అక్రమ రవాణా ముఠాల దారుణాలు మరోసారి బయటపడ్డాయి. బంగ్లాదేశ్‌కు చెందిన 15 ఏళ్ల బాలిక ఆరు నెలలుగా దళారుల చెరలో మగ్గుతున్నది. చివరికి ధైర్యం చేసి బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌లోకి చేరి తన వేదనను వెల్లడించింది.
మాయమాటలతో వలలోకి
ఢాకాకు చెందిన రూపా అనే మహిళ పర్యటన పేరుతో భారత్‌కి తీసుకెళ్తానని నమ్మబలికిందని బాలిక పోలీసులకు తెలిపింది. బోటులో సరిహద్దు దాటి, రైలు మార్గంలో హైదరాబాద్ చేరుకున్న తరువాత ఆమెను 20 వేలకు అమ్మేశారు. దీంతో బాధితురాలు బలవంతంగా వ్యభిచార కూపంలోకి నెట్టబడింది.
హోటళ్లలో బలవంతం
దళారులు హోటళ్లలో కస్టమర్లకు దగ్గరకు తీసుకెళ్లేవారని బాలిక చెప్పింది. మహమ్మద్ సమీర్ అనే వ్యక్తి తరచూ తనను కస్టమర్ల దగ్గరికి తీసుకెళ్లేవాడని వివరించింది. ఒక సందర్భంలో పోలీస్‌స్టేషన్ కనిపించగానే పరుగెత్తి లోపలికి చేరి సహాయం కోరిందని వివరించింది.
బాలిక ధైర్యం.. ముఠా ఆగడాలు బహిర్గతం
చెల్లుబాటు అయ్యే పత్రాలు లేవనే భయంతో ఇంతకాలం నోరెత్తలేదని, జైలుకు పంపుతారేమోనని కలవరపడ్డానని బాలిక పేర్కొంది. కానీ చివరికి చేసిన ప్రయత్నం ముఠా ఆకృత్యాలను బట్టబయలు చేసింది.
తల్లిదండ్రుల అన్వేషణలో పోలీసులు
బంగ్లాదేశ్‌లో ఆమె తల్లిదండ్రులను కనుగొనడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో మైనర్ల అక్రమ రవాణా విపరీతంగా పెరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
పెరుగుతున్న ముప్పు
రాజ్యసభలో సమర్పించిన గణాంకాల ప్రకారం, ఇటీవల 1,301 మంది మైనర్లు హైదరాబాద్ లో అక్రమ రవాణాకు గురయ్యారు. నకిలీ గుర్తింపులతో బంగ్లాదేశ్ నుంచి వలసలు జరుగుతున్నాయని అధికారులు ధృవీకరించారు. అవగాహన కార్యక్రమాలు, ప్రత్యేక దాడులు జరుగుతున్నా ఈ ముఠాలు నియంత్రణలోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
కఠిన చర్యలే మార్గం
ఈ ఘటన మరోసారి చాటింది. మైనర్ల రక్షణ కోసం కఠిన పర్యవేక్షణ, ప్రజల సహకారం, అంతర్జాతీయ సమన్వయం అత్యవసరమని రూడీ చేసింది.
బాధితులకు అండగా నిలిస్తేనే..
15ఏళ్ల బాలిక చేసిన ధైర్యానికి పోలీసులు అండగా నిలిచారు. ఇలా మోసపోయిన బాలికలకు సమాజం కూడా భరోసా ఇచ్చినప్పుడు మానవ అక్రమ రవాణా ముఠాల నుంచి బయటపడతారు. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని మాయమాటలతో మోసగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటే హ్యుమన్ ట్రాఫికింగ్ ను నిర్మూలించవచ్చు.
