అమెజాన్ సీఈవో వివాహం... ప్రకృతికి సరికొత్త శాపం!!
అక్కడ అతిథుల కంటే ఎక్కువగా సెక్యూరిటీ, వంటవారు, సర్వీస్ చేసేవారు, డ్రైవర్లే ఎక్కువగా ఉంటారని కూడా చెబుతుంటారు.
By: Tupaki Desk | 27 Jun 2025 9:36 AM ISTసెలబ్రిటీల వివాహంలో ఉండే ఆడంబరం, ఆకర్షణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలామంది ఆశ్చర్యపోయేలా, ఎక్కువమంది అసూయ చెందేలా అన్నట్లుగా వీరి వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. భూదేవంత మండపం, ఆకాశమంత పందిరి ఉండకపోయినా.. ఖర్చు మాత్రం అంతకుమించి ఉంటుంది. కొంతమంది దీన్ని న్యూసెన్స్ వేల్యూ ఆఫ్ వెల్త్ అని కూడా అంటారు!
అక్కడ అతిథుల కంటే ఎక్కువగా సెక్యూరిటీ, వంటవారు, సర్వీస్ చేసేవారు, డ్రైవర్లే ఎక్కువగా ఉంటారని కూడా చెబుతుంటారు. ఏది ఏమైనా.. అత్యంత ఖర్చుతో కూడిన కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహించుకుంటారు. ఈ క్రమంలో నేడు జరగబోతున్న అమెజాన్ సీఈవో వివాహానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అదే.. ఈ వివాహం కోసం ప్రైవేట్ జెట్ ల వినియోగం అంశం.
అవును...జెఫ్ బెజోస్ – లారెన్ సాంజెచ్ ల వివాహం ఖర్చు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన వివాహం కోసం ఇటలీలోని వెనీస్ నగరం మొత్తాన్ని అద్దెకు ఇచ్చినట్లుగా పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ వేడుక ద్వారా విడుదలయ్యే ఉద్గారాలు హాట్ టాపిక్ గా మారాయి. ఈ వివాహ వేడుక కోసం సుమారు 96 ప్రైవేట్ జెట్ లు రాబోతున్నాయని అంటున్నారు. ఇప్పుడు ఇవి విడుదల చేసే కర్బన ఉద్గరాలే టాపిక్.!
ఈ వివాహానికి హాజరయ్యేవారిలో స్థానికంగా ఉన్నవారు కార్లలో వస్తారు.. కాస్త దూరంగా ఉన్నవారు విమానాల్లో వస్తారు. అయితే.. మరికొంతమంది మాత్రం ప్రపంచం నలుమూలల నుంచి సొంత ప్రైవేట్ జెట్ లతో బయలుదేరుతున్నారు. వీటి సంఖ్య 96గా చెబుతున్నారు. ఇక ఇవి రోజుకు 27,300 కార్లు విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు సమానమైన కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తాయని లెక్కిస్తున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రకారం.. ఒక సాధారణ ప్రయాణీకుల వాహనం సంవత్సరానికి దాదాపు 3.6 మెట్రిక్ టన్నుల (3,600 కిలోలు) సీఓ2 ను విడుదల చేస్తుంది! ఆ విధంగా చూసుకుంటే... బెజోస్ వివాహానికి హాజరవ్వడం కోసం ఎగురుతున్న 96 విమానాలు మొత్తం 345 టన్నులు (3,45,000 కిలోలు) కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను విడుదల చేస్తాయన్నమాట!
కాగా... బెజోస్ – సాంచెజ్ మే 2023లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు వారు వివాహం చేసుకోబోతున్నారు. ఇటలీలోని వెనిస్ లో జరిగే ఈ వివాహ కార్యక్రమానికి కేటీ పెర్రీ, ఓప్రా విన్ ఫ్రే, మిక్ జాగర్, ఇవాంకా ట్రంప్ వంటి ప్రముఖులు హాజరవుతారని చెబుతున్నారు.
ఇక గత ఏడాది జరిగిన ప్రచారం మేరకు... వారు తమ వివాహానికి $600 మిలియన్లు ఖర్చు చేయనున్నారు! అయితే.. ఈ ప్రచారాన్ని అమెజాన్ వ్యవస్థాపకుడు తోసిపుచ్చారు. బదులుగా 15 - 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేయవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయని కథనాలొస్తున్నాయి.
