Begin typing your search above and press return to search.

తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో బెట్టింగుల జోరు ఎంతంటే?

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏపీలో విపరీతమైన ఆసక్తి నెలకొంది.

By:  Tupaki Desk   |   16 Nov 2023 4:10 AM GMT
తెలంగాణలో ఎన్నికలు.. ఏపీలో బెట్టింగుల జోరు ఎంతంటే?
X

తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై ఏపీలో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరికి అధికారం దక్కుతుంది? లాంటి ప్రశ్నల దగ్గర నుంచి తెలంగాణలోని కొన్ని కీలక నియోజకవర్గాల మీద పెద్ద ఎత్తున వివరాలు సేకరిస్తున్నారు. అంతేకాదు.. బెట్టింగులు సైతం జోరుగా సాగుతున్నాయి. ఏపీలో వ్యక్తమైన ఆసక్తిని బెట్టింగులుగా మలుచుకొని.. అందుకు అవసరమైన వాట్సాప్ గ్రూపుల్ని సైతం క్రియేట్ చేసినట్లుగా చెబుతున్నారు.

విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై వందల కోట్ల రూపాయిల బెట్టింగులు సాగుతున్నట్లుగా చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాలు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీలో ఆసక్తి వ్యక్తమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాల్ని చూస్తే..

- ఎల్ బీ నగర్

- శేరిలింగంపల్లి

- కుకట్ పల్లి

- ఉప్పల్

- మల్కాజ్ గిరి

- కుత్భుల్లాపూర్

- జూబ్లీహిల్స్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇవే కాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న మరికొన్ని నియోజకవర్గాలపైనా ఆసక్తి వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు అసెంబ్లీ స్జానాలతో పాటు.. ఆ మధ్యన ఉప ఎన్నికలు జరిగిన దుబ్బాక.. హుజూరాబాద్ తదితర నియోజకవర్గాలపైనా ఆసక్తి వ్యక్తమవుతోంది. ముఖ్యంగా..

కరీంనగర్

సూర్యాపేట

హుజూరాబాద్

దుబ్బాక

గజ్వేల్ మరికొన్ని నియోజకవర్గాలపై బెట్టింగులు భారీగా నడుస్తున్నాయి. ఇక్కడి అభ్యర్తుల గెలుపు ఓటములపై రూ.100కు రూ.500చొప్పున బెట్టింగ్ నడుస్తోంది. అధికార.. విపక్షాలకు చెందిన అగ్రనేతలు పోటీలో ఉన్న నియోజకవర్గాల్లో ఆయా నేతలకు వచ్చే మెజార్టీ పైన వందకు రూ.వెయ్యి చొప్పున బెట్టింగ్ సాగుతోంది. తెలంగాణలో తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైనా పందేలు సాగుతున్నాయి. బీఆర్ఎస్ అయితే కేసీఆర్ అన్నది క్లారిటీ ఉండగా.. కాంగ్రెస్.. బీజేపీలు విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి ఎవరన్న దానిపైనా పందేలు నడుస్తుండటం గమనార్హం.

పందేలు అన్ని కూడా అధికార బీఆర్ఎస్.. విపక్ష కాంగ్రెస్ మధ్యనే ఎక్కువగా సాగుతున్నట్లుగా చెబుతున్నారు. ముంబయి.. ఢిల్లీకి చెందిన బెట్టింగ్ ముఠాలు తెలంగాణ ఎన్నికల మీద ఫోకస్ చేసినట్లుగా చెబుతున్నారు. భీమవరానికి చెందిన ఒక రొయ్యల వ్యాపారి శేరిలింగంపల్లిలో గెలిచే పార్టీపై కోటి రూపాయిలు పందెం కాసినట్లు చెబుతున్నారు. అతను పందెంలో పేర్కొన్న పార్టీ గెలిస్తే రూ.5 కోట్లు సొంతం కానున్నాయి. ఓడితే.. కోటి రూపాయిలు పోగొట్టుకోనున్నట్లు చెబుతున్నారు. ఖాళీ చెక్కుల్ని కూడాఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే తీరులో మరికొన్ని నియోజకవర్గాల మీద జోరుగా బెట్టింగ్ సాగుతుండటం గమనార్హం.