ఫ్రెషర్లకు చెన్నై.. జీతాల్లో టాప్ హైదరాబాద్
ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏయే నగరాల్లో ఎక్కువ? లాంటి ప్రశ్నలకు తాజాగా విడుదలైన ఇండీడ్ పే మ్యాప్ సర్వే రిపోర్టు సమాధానాల్ని చెబుతోంది.
By: Tupaki Desk | 4 July 2025 2:00 PM ISTజాబ్ లో చేరే వారికి ఏ నగరం అనువుగా ఉంది? ఎక్కడ ఎక్కువగా అవకాశాలు లభిస్తున్నాయి? అనుభవం ఉన్నోళ్లకు ఏ సిటీలో ఎక్కువగా జీతాలు వస్తున్నాయి? ఏ నగరంలో జీవన వ్యయం ఎక్కువగా ఉంటోంది? అందరికి అనువుగా ఉన్న మహానగరం దేశంలో ఏది? కొలువులో చేరిన తర్వాత వేతనాల పెరుగుదల.. ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఏయే నగరాల్లో ఎక్కువ? లాంటి ప్రశ్నలకు తాజాగా విడుదలైన ఇండీడ్ పే మ్యాప్ సర్వే రిపోర్టు సమాధానాల్ని చెబుతోంది.
ఈ సర్వే రిపోర్టును ఆషామాషీగా తయారు చేయలేదు. దేశ వ్యాప్తంగా 1300 మంది కంపెనీ యజమానులు.. 2500 మంది ఉద్యోగుల అభిప్రాయాల్ని సేకరించారు.అంతేకాదు.. ఉద్యోగులకు ఇచ్చే జీతాలు.. ఉద్యోగ అవకాశాలు.. వివిధ పరిశ్రమలు.. వివిధ రంగాలతో పాటు.. జీవన వ్యయం మీదా ఫోకస్ చేశారు. ఈ రిపోర్టులోని కీలక అంశాల్ని చూస్తే.. చదువులు పూర్తై.. ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి అనువుగా చెన్నై మహానగరం ఉంటే.. ఉద్యోగంలో అనుభవం ఉండి.. మరింత ఎక్కువ అవకాశాలు.. మంచి జీతం కావాలంటే మాత్రం హైదరాబాద్ మహానగరం టాప్ లో ఉన్నట్లుగా తేలింది.
ఈ రెండు నగరాలతో పాటు అహ్మదాబాద్ కూడా అగ్రస్థానంలోనే ఉన్నట్లు రిపోర్టు వెల్లడించింది. ఈ మూడు నగరాలు ఢిల్లీ.. ముంబయిలను దాటి ముందుకు వెళ్లినట్లుగా తేల్చారు. కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి చెన్నై సౌకర్యవంతంగా ఉండటమే కాదు.. ఫ్రెషర్లకు నెలకు సగటున రూ.30,100 జీతం వస్తోందని.. రెండో స్థానంలో హైదరాబాద్ ఉందని చెబుతున్నారు. ఈ సిటీలో మాత్రం ఫ్రెషర్లకు రూ.28,500 జీతం ఉన్నట్లు చెబుతున్నారు.
ఉద్యోగంలో ఒక మోస్తరు అనుభవం (కనీసం 2-5 ఏళ్లు) ఉన్న వారికి హైదరాబాద్ ది బెస్ట్ అని చెబుతున్నారు. ఇలాంటి వారికి హైదరాబాద్ లో నెలకు సగటున రూ.47,200 వరకు వస్తుందని అంచనా వేశారు. ఇక ఐదేళ్ల నుంచి ఎనిమిదేళ్ల అనుభవం ఉన్న వారికి మాత్రం రూ.69,700 వరకు జీతం వస్తోందని వెల్లడైంది. జీతాలు ఎక్కువగా ఉండే నగరాల్లో హైదరాబాద్ తర్వాత చెన్నై.. అహ్మదాబాద్ నగరాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. టెక్నాలజీ.. డిజిటల్ రంగాల్లో కెరీర్ ముందుకు వెళ్లాలంటే మాత్రం ఈ మూడు నగరాలు (హైదరాబాద్, చెన్నై, అహ్మదాబాద్) బెస్టు అంటున్నారు.
ఏయే రంగాల వారికి ఎక్కువ జీతాలు ఎక్కువగా వస్తున్నాయన్న అంశాన్ని సర్వే రిపోర్టు వెల్లడించింది. ఐటీ.. తయారీ.. టెలికం రంగాలకు చెందిన వారికి ఎక్కువ జీతాలు వస్తున్నాయని.. ప్రొడక్టు.. ప్రొడెక్టు మేనేజ్ మెంట్ విభాగాల్లో గరిష్ఠ వేతనాలు లభిస్తున్నట్లుగా వెల్లడైంది. వెబ్ సైట్లు.. యాప్ లు రూపకల్పన చేసే ఉద్యోగాల్లోని నిపుణులకు ఐటీ డెవలపర్లతో సమానంగా వేతనాలు వస్తున్నట్లు తెలిపారు. ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఒకప్పటి మాదిరి పెద్ద నగరాలు.. పేరు మోసిన సిటీస్ లోనే ఉద్యోగాలు పరిమితం కావటం లేదని.. దేశంలోని ఇతర నగరాలు కూడా ఉద్యోగ. ఉపాధి కేంద్రాలుగా మారుతున్నట్లుగా వెల్లడైంది.
అంతకంతకూ పెరుగుతున్న జీవన వ్యయానికి తగ్గట్లు. కంపెనీలు ఇస్తున్న జీతాలు సరిపోతున్నాయా? అని ప్రశ్నిస్తే మాత్రం.. 69 శాతం మంది తమ జీతాలు సరిపోవటం లేదని చెబుతున్నారు. ఇలా చెప్పిన వారిలో 96 శాతం మంది ఢిల్లీకి చెందిన వారు ఉండటం గమనార్హం. ఆ తర్వాతి స్థానంలో ముంబయి (95 శాతం).. పుణెలో (94 శాతం). బెంగళూరులో (93 శాతం) ఉన్నాయి. జీవన వ్యయం భరించలేనంత ఎక్కువగా మారటంతో గ్రామాలు.. పట్టణాల నుంచి ఎక్కువ మంది నగరాలకు రావటం లేదని అభిప్రాయపడుతున్నట్లు రిపోర్టు వెల్లడించింది.
