ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కారును నడిపింది ఒక మహిళే.. ఆమె ఎవరంటే ?
ఈ ప్రయాణం కేవలం ఒక సాహసం మాత్రమే కాదు.. ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
By: Tupaki Desk | 21 May 2025 6:00 AM ISTప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కారును నడిపింది ఒక మహిళే అన్న విషయం మీకు తెలుసా? ఇది నిజం! కార్ల ఆవిష్కర్త కార్ల్ బెంజ్ రూపొందించిన తొలి కారును 1888 ఆగస్టు 5న ఆయన భార్య బెర్తా బెంజ్ నడిపారు. ఈ ప్రయాణం కేవలం ఒక సాహసం మాత్రమే కాదు.. ఆటోమొబైల్ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయింది.
కార్ల్ బెంజ్ తాను తయారుచేసిన కారు పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తుంటే.. బెర్తా బెంజ్ మాత్రం ఆ కారుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. తన భర్త నిద్రపోతున్నప్పుడు తన కుమారులు రిచర్డ్, యూజెన్‌లతో కలిసి బెర్తా బెంజ్ సీక్రెట్ గా ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు. వారు ఏకంగా 106 కిలోమీటర్లు కారు నడిపారు. జర్మనీలోని మాన్‌హైమ్ నుంచి ఫోర్జ్‌హైమ్ వరకు సాగిన ఈ ప్రయాణంలో అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.
ఈ ప్రయాణంలో కారులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఇంధనం అయిపోతే వారు స్థానిక అపోథికరీ (మందుల దుకాణం) నుంచి 'లిగ్రోయిన్' అనే రసాయనాన్ని కొనుగోలు చేసి ఇంధనంగా వాడారు. బ్రేకులు పాడైతే, బెర్తా తన జుట్టులో ఉన్న పిన్‌ను ఉపయోగించి వాటిని రిపేరు చేశారు. కొండలు ఎక్కడానికి కారుకు శక్తి సరిపోకపోతే, ఆమె తన కుమారులను కిందకు దిగి కారును తోయమని చెప్పేవారు. ఈ సంఘటనలన్నీ కారు రూపకల్పనలో ఉన్న లోపాలను కార్ల్ బెంజ్‌కు తెలియజేయడానికి సాయపడ్డాయి. ఈ ప్రయాణం తర్వాత కార్ల్ బెంజ్ తన కారులో ముఖ్యమైన మార్పులు చేశారు.
బెర్తా బెంజ్ సాహసోపేతమైన ప్రయాణం ప్రజల్లో కారు పట్ల ఆసక్తిని, నమ్మకాన్ని పెంచింది. కారు కేవలం ఒక ఆవిష్కరణ మాత్రమే కాదు. అది నిజంగా పనిచేస్తుందని, సాధారణ ప్రజలు కూడా దానిని ఉపయోగించవచ్చని ఆమె నిరూపించారు. అందుకే 'ఎక్కువ దూరం కారు నడిపిన మొదటి వ్యక్తి' గానే కాకుండా, ఆటోమొబైల్ పరిశ్రమకు ఒక బ్రాండ్ అంబాసిడర్‌గా బెర్తా బెంజ్ చరిత్రలో నిలిచిపోయారు. ఆమె ధైర్యం, దూరదృష్టి లేకుండా కార్ల్ బెంజ్ ఆవిష్కరణకు అంతర్జాతీయ గుర్తింపు రావడానికి చాలా సమయం పట్టేది.
