Begin typing your search above and press return to search.

భర్త మరణించినా.. అతని వీర్యంతో బిడ్డకు జన్మ.. గృహిణి సాహసోపేత నిర్ణయం..

వివాహ బంధం అన్నా.. వివాహ వ్యవస్థ అన్నా ఇప్పటి జనరేషన్ కు అస్సలు పట్టింపు లేదు

By:  Tupaki Desk   |   17 Dec 2023 10:30 AM GMT
భర్త మరణించినా.. అతని వీర్యంతో బిడ్డకు జన్మ.. గృహిణి సాహసోపేత నిర్ణయం..
X

వివాహ బంధం అన్నా.. వివాహ వ్యవస్థ అన్నా ఇప్పటి జనరేషన్ కు అస్సలు పట్టింపు లేదు. మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట మూడు నెలలు కూడా కలిసి ఉండలేకపోతున్న ప్రస్తుత తరుణంలో ఒక మహిళ మాత్రం తన భర్త చనిపోయిన రెండేళ్లకు అదే అంశతో పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఆశ్చర్య పరిచింది. భార్య, భర్తల బంధం ఎంత గొప్పదో.. అందులో ఎంత ప్రేమ దాగుంటుందో లోకానికి చాటింది.

భర్త చనిపోయిన రెండేళ్లు అవుతుంది. అప్పటికీ ఆమెకు పిల్లలు కూడా లేరు. ఆమె కోరుకుంటే మరొకరిని వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించవచ్చు. కానీ ఆమె అలా అనుకోలేదు. తన భర్త అంశను తన కడుపులో మోసి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి అత్తింటి వంశానికి మరో అంకురాన్నిచ్చింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం, భీర్‌పూర్ జిల్లా, మురారై ప్రాంతానికి చెందిన అరుణ్ ప్రసాద్-సంగీత దంపతులు. వీరికి 27 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఈ జంట చాలా అన్యోన్యంగా జీవిస్తుంది. కష్ట సుఖాలు కలిసే పంచుకునేవారు. ఆనందంగా ఉన్న ఈ జంటకు ఒక లోపం ఉంది అదే పిల్లలు. వివాహం జరిగి 20 సంవత్సరాలకు పైగా గడుస్తున్నా పిలలు కలుగలేదు. అన్ని హాస్పిటల్స్, తీర్థయాత్రలు తిరిగారు. అయినా ప్రయోజనం లేదు.

ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితం కోల్‌కత్తాలోని ఒక ఐవీఎఫ్ సెంటర్ ను ఆశ్రయించారు. ఐవీఎఫ్ విధానంలో పిల్లలు పుడతారని వైద్యులు చెప్పగా.. దానికి వారు అంగీకరించారు. ఇక రెగ్యులర్ గా వైద్య పరీక్షలు వెళ్తూ వస్తున్నారు. ఈ మధ్యలో వచ్చిన కొవిడ్ ఆ దంపతులను విడదీసింది. సంగీత భర్త అరుణ్ ప్రసాద్ కొవిడ్ తో మరణించాడు. దీంతో ఆయన భార్య సంగీత తీవ్ర ఆందోళనకు గురైంది. పిల్లలు కూడా లేకపోవడంతో అత్తింటి వారు పట్టించుకోలేదు. అరుణ్ ప్రసాద్ నడిపిన కిరాణా దుకాణాన్ని నడుపుకుంటూ జీవిస్తోంది.

ఇంతలో ఆమెకు ఐవీఎఫ్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. తన భర్త వీర్యం ఉందని ప్రెగ్నెన్సీకి రావాలని వైద్యులు సూచించారు. దీంతో ఆమె ఆ వీర్యంతో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంది. వెంటనే అతని వీర్యాన్ని తన అండంలోకి పంపించగా ఈ ప్రాసెస్ సక్సెస్ అయ్యింది. డిసెంబర్ 12వ తేదీ (మంగళవారం) రాంపూర్ హాట్ వైద్య కాలేజీ హాస్పిటల్ లో సంగీత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.