Begin typing your search above and press return to search.

ఐటీ నగరంలో నీటి కష్టాలు.. వారానికే ఒక్క రోజు స్నానం!

సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగు నీటికి కర్ణాటకలో ఇబ్బందులు తలెత్తాయి. కావేరి నదిలో నీరు కూడా లేకపోవడంతో ఈ ఇబ్బందులు రెట్టింపయ్యాయి.

By:  Tupaki Desk   |   13 March 2024 10:30 AM GMT
ఐటీ నగరంలో నీటి కష్టాలు.. వారానికే ఒక్క రోజు స్నానం!
X

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా, ఐటీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు ఎన్నో ఐటీ సంస్థలకు నెలవు. ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థలు బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే వేసవి కాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తింది. ఇక వేసవిలో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగు నీటికి కర్ణాటకలో ఇబ్బందులు తలెత్తాయి. కావేరి నదిలో నీరు కూడా లేకపోవడంతో ఈ ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నీళ్లు దొరక్క చాలా ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బెంగళూరుతోపాటు రాష్ట్రం మొత్తం మీద 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయి. 219 తాలుకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా బెంగళూరు నగరంలోని యల్హంక, కనకపుర, వైట్‌ ఫీల్ట్‌ ప్రాంతాల్లో నివసించే వారిని నీటి కొరత తీవ్రంగా వెంటాడుతోందని చెబుతున్నారు. ఈ క్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్‌ సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో నివసించే వారిలో ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని బాంబుపేల్చింది. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని నియమించారంటే బెంగళూరులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని ట్యాంకర్ల యజమానులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద వివరాలు నమోదు చేయాలని ఆదేశించింది. మరోవైపు నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.556 కోట్లు మంజూరుచేసినట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వెల్లడించారు. బెంగళూరు నగరంలోని ప్రజల కోసం తమవంతుగా రూ.10 కోట్లు ఇవ్వాలని నియోజకవర్గ ఎమ్మెల్యేలను ఆయన కోరారు. ఖాళీ పాల ట్యాంకులను నీటి నిల్వకు, సరఫరా కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు.

తన నివాసంలోని బోరు బావి కూడా ఎండిపోయిందని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. నీటి డిమాండ్‌ను తీర్చడానికి కాంగ్రెస్‌ సర్కారు తీవ్రంగా ప్రయత్నిస్తోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి సరఫరా జరిగేలా చూస్తామన్నారు. బెంగళూరు నగరానికి రామనగర, హోస్‌ కోట్, చన్నపట్న, మాగాడి వంటి పట్టణాల నుంచి ట్యాంకర్లు నీటిని సరఫరా చేస్తాయని చెప్పారు.

కాగా కొన్ని ట్యాంకర్లు రూ. 600కు నీటి సరఫరా చేస్తుండగా.. మరికొన్ని రూ.3 వేల వరకు ప్రజల నుంచి దండుకుంటున్నాయి. నీటి కొరతతో ఒక్కొక్కరికి ఒక్కో వ్యాన్‌ మాత్రమే అందిస్తున్నారు. బెంగళూరులో నీటి కొరతను తీర్చలేని పరిస్థితులకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమేనంటూ శివకుమార్‌ ఆరోపించారు. నగరంలో మంచి నీటిని అందించాలనే ఉద్దేశంతో మేకేదాటు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని అన్నారు. ప్రాజెక్టుకు ఆమోదం తెలపాలని పాదయాత్ర చేసినా.. కేంద్రం పట్టించుకోలేదని విమర్శించారు. ప్రస్తుత సంక్షోభాన్ని పరిగణనలోకి తీసుకుని అయినా ఈ ప్రాజెక్టు అనుమతులు ఇవ్వాలని కోరారు.

మరోవైపు తాము పడుతున్న నీటి బాధలను బెంగళూరు వాసులు సోషల్‌ మీడియాలో పంచుకుంటున్నారు. నీటి ఎద్దడి నేపథ్యంలో నీళ్లను ఆదా చేయడానికి ప్రెస్టీజ్‌ ఫాల్కన్‌ సిటీ అపార్ట్‌ మెంట్‌ వాసులు డిస్పోజబుల్‌ ప్లేట్లు, గ్లాసులు వాడుతున్నారని ఓ నెటిజన్‌ పోస్టు చేశారు. ముఖం, చేతులు కడుక్కోవడానికి వెట్‌ పేపర్లు వినియోగిస్తున్నామని వివరించారు. ఇప్పుడే ఇలావుంటే.. ఏప్రిల్, మే నెల గురించి తల్చుకుంటేనే భయమస్తోందని బెంగళూరు వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నీటి కష్టాలతో వారానికి ఒక్క రోజే స్నానం చేయాల్సిన దుస్థితి నెలకొంది. బెంగళూరులో నీటి ఎద్దడి తీవ్ర రూపం దాల్చడమే ఇందుకు కారణం. ప్రజలు ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వినియోగించుకుంటున్నారు. దీంతో వారానికి ఒక్కసారే స్నానం చేస్తున్నామని వాపోతున్నారు.

మరోవైపు వంట చేసుకోవడానికి ఎక్కువ నీళ్లు అవసరమవుతుండటంతో ఆహారం కోసం ఆన్‌ లైన్‌ ఫుడ్‌ డెలివరీ యాప్స్‌ పైనే ఆధారపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని నిపుణులు చెబుతున్నారు. ఎండా కాలం ఇంకా పూర్తి స్థాయిలో ప్రవేశించకముందే ఈ పరిస్థితి ఉంటే రానున్న మూడు నెలలు ఏ స్థాయిలో నరకాన్ని చూడాల్సి వస్తుందోనని బెంగళూరు నగర వాసులు బెంబేలెత్తుతున్నారు.