Begin typing your search above and press return to search.

అక్కడ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లడానికి ఇదే 'బెంగ'!

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా, ఐటీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు ఎన్నో ఐటీ సంస్థలకు నెలవు

By:  Tupaki Desk   |   21 April 2024 3:30 PM GMT
అక్కడ అభ్యర్థులు ప్రచారానికి వెళ్లడానికి ఇదే బెంగ!
X

సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా, ఐటీ హబ్‌ ఆఫ్‌ ఇండియాగా పేరుగాంచిన బెంగళూరు ఎన్నో ఐటీ సంస్థలకు నెలవు. ప్రపంచ స్థాయి ప్రముఖ సంస్థలు బెంగళూరు కేంద్రంగా తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయి. అయితే వేసవి కాలం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే బెంగళూరులో నీటి సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు వేసవి కావడంతో ఎలాంటి పరిస్థితి ఉంటుందోనని నగర ప్రజలు బెంబేలెత్తుతున్నారు.

సకాలంలో వర్షాలు కురవకపోవడంతో సాగు, తాగు నీటికి కర్ణాటకలో ఇబ్బందులు తలెత్తాయి. కావేరి నదిలో నీరు కూడా లేకపోవడంతో ఈ ఇబ్బందులు రెట్టింపయ్యాయి. నీళ్లు దొరక్క చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇటీవల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బెంగళూరుతోపాటు రాష్ట్రం మొత్తం మీద 236 తాలూకాల్లో 223 తాలూకాలు కరువు బారిన పడ్డాయి. 219 తాలుకాల్లో కరువు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని స్వయంగా ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయి.

ముఖ్యంగా బెంగళూరు నగరంలోని యల్హంక, కనకపుర, వైట్‌ ఫీల్ట్‌ ప్రాంతాల్లో నివసించే వారిని నీటి కొరత తీవ్రంగా వెంటాడుతోంది. ఈ క్రమంలో నీటి వృథాను కట్టడి చేసేందుకు బెంగళూరులోని ఓ హౌసింగ్‌ సొసైటీ ఎవరైనా నీరు ఎక్కువగా ఉపయోగిస్తే.. వారికి రూ.5 వేలు జరిమానా విధిస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని కూడా నియమించారంటే బెంగళూరులో పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.

ఈ నీటి సమస్య ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను బెంబేలెత్తిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఉన్న 28 లోక్‌ సభ స్థానాలకు కూడా పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు నగర పరిధిలో పోటీ చేస్తున్న అభ్యర్థులు ‘చుక్కలు’ చూస్తున్నారు. ప్రచారానికి వెళ్లడానికి తచ్చట్లాడుతున్నారు. నీటి ఎద్దడి సమస్యతో ప్రజలు ఎక్కడ తమను నిలదీస్తారోనని ఆందోళన చెందుతున్నారు.

బెంగళూరు నగరం పరిధిలో నాలుగు లోక్‌ సభా స్థానాలున్నాయి. ప్రతిసారి నగర పరిధిలో తక్కువ పోలింగే నమోదవుతోంది. ఇప్పుడు ఓవైపు వేసవితో ఎండలు మండుతున్నాయి.. మరోవైపు నీటి ఎద్దటి అభ్యర్థులను బెంబేలెత్తిస్తున్నాయి. నీళ్లు దొరక్క వారాలు తరబడి స్నానాల మాటను కూడా బెంగళూరు వాసులు మర్చిపోయారు. బాత్‌ రూమ్‌ కు వెళ్లాలన్నా పేపర్లు, టాయిలెట్‌ పేపర్లే గతయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఓట్ల కోసం ఓటర్ల వద్దకు వెళ్తే వాళ్లు తమ దుమ్ము దులపడం ఖాయమని ఆయా పార్టీల తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు వాపోతున్నారంటున్నారు.

బెంగళూరు పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాలకు ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. బెంగళూరులో వలస వచ్చినవారే ఎక్కువ. ఐటీ నిపుణులతో భవన నిర్మాణ రంగంలో పనిచేయడానికి వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ఇక్కడకు వస్తుంటారు. వీరంతా సహజంగానే ఓటు హక్కు స్థానికంగా లేకపోవడం, తదితర కారణాలతో ఓటింగుకు దూరంగా ఉంటున్నారు.

గత 40 రోజులుగా బెంగళూరులో నీటి సమస్య తీవ్రంగా ఉంది. ఇది మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోందని అంటున్నారు. గత ఐదు దశాబ్దాల్లో ఎన్నడూ చూడని నీటి సంక్షోభాన్ని బెంగళూరు ఎదుర్కొంటోంది. ఒక్కో ట్యాంకరును రూ.1500 నుంచి రూ.2000 కొనుక్కోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారానికి వెళ్లలేకపోతున్నారు. ప్రజలు తమను నీటి సమస్యపై నిలదీస్తారోనని భయపడుతున్నారు.

ఆయా పార్టీలు నీటి అంశంపైనే విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ దుస్థితికి మీరు కారణమంటే మీరు కారణమని అధికార, విపక్ష కాంగ్రెస్, బీజేపీ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.