Begin typing your search above and press return to search.

ఇదేం దుర్మార్గం.. బట్టలు బాగోలేవని మెట్రోలోకి నో ఎంట్రీ

ఒక రైతు మెట్రోలో ప్రయాణించేందుకు వీలుగా టికెట్ తీసుకొని సెక్యూరిటీ వద్దకు వచ్చారు

By:  Tupaki Desk   |   27 Feb 2024 4:54 AM GMT
ఇదేం దుర్మార్గం.. బట్టలు బాగోలేవని మెట్రోలోకి నో ఎంట్రీ
X

విన్నంతనే కోపం కట్టలు తెగే ఉదంతంగా దీన్ని చెప్పాలి. ప్రజారవాణాగా సుపరిచితమైన మెట్రో రైలుకు సంబంధించి సిలికాన్ వ్యాలీగా పేర్కొనే బెంగళూరు మహానగరంలో ఒక రైతుకు జరిగిన అవమానం గురించి తెలిస్తే షాక్ తింటాం. సదరు రైతు బట్టలు మాసి ఉన్న కారణంగా మెట్రో సిబ్బంది ఆయన్ను రైలు ఎక్కేందుకు మెట్రో స్టేషన్ లోకి అనుమతించని పరిస్థితి. ఈ ఓవరాక్షన్ ను గుర్తించిన ఒక వ్యక్తి మెట్రో సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఒక రైతు మెట్రోలో ప్రయాణించేందుకు వీలుగా టికెట్ తీసుకొని సెక్యూరిటీ వద్దకు వచ్చారు. అయితే.. అతడు ధరించిన తుస్తులు మాసి ఉన్నాయని.. అందుకే అతన్ని అనుమతించమంటూ మెట్రో సిబ్బంది ఆపేశారు. ఈ ఉదంతాన్ని గమనించిన ఒక ప్రయాణికుడు.. ఇదేం న్యాయం అంటూ మెట్రో సిబ్బందిని ప్రశ్నించారు. ఈ ఉదంతాన్ని అక్కడే ఉన్న ఒకరు రికార్డు చేయటం.. ఆ వీడియో వైరల్ గా మారింది.

ఒక రైతు బట్టలు మాసి పోతే మెట్రోలో ఎక్కటానికి అనుమతించరా? ఇదేం పద్దతి? ఇదేమైనా వీఐపీ రైలా? బట్టలకు మెట్రో ప్రయాణానికి లింకేంటి? ఒక రైతును ఇలా అవమానిస్తారా?’’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. కొంతసేపు ఆర్గ్యూమెంట్ జరిగిన తర్వాత సదరు రైతును మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో పాటు.. తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మెట్రో సిబ్బందిని తిట్టిపోస్తున్నారు.

మెట్రో సిబ్బందిని కడిగేసిన వ్యక్తి పేరు కార్తీగా గుర్తించారు. అతడిపై పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లో పెద్ద ఎత్తున షేర్ కావటం.. తీవ్ర ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో సదరు సెక్యూరిటీ సూపర్ వైజర్ ను విధుల నుంచి తొలగిస్తూ.. ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసినట్లుగా బెంగళూరు మెట్రో అధికారికంగా ప్రశ్నించింది. ఈ మొత్తం ఎపిసోడ్ ను చూస్తే.. దిద్దుబాటు చర్యల్లో భాగంగా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని భావిస్తున్నారు.