భయానక పూజల ట్రాప్ లో చిక్కుకోవద్దు
కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల మహిళ భయానక అనుభవం గురించి తెలిస్తే.. ఈ తరహా వ్యక్తులతో ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది ఇట్టే అర్థమవుతుంది.
By: Tupaki Desk | 17 Jun 2025 11:00 AM ISTమనం కోసం.. మన సమస్యల్ని తీర్చటం కోసమే తాము పుట్టినట్లుగా కొందరు బిల్డప్ ఇస్తారు. ఇలాంటి వారు తమ తియ్యటి మాటలతో బోల్తా కొట్టిస్తుంటారు. సాధారణ స్థితిబెంగలో ఉండే వారు ఇలాంటి వారి ట్రాప్ నుంచి తప్పించుకునే ఛాన్సు ఉంటుంది కానీ అప్పటికే ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా.. తీవ్రమైన సమస్యల్లో చిక్కుకొని ఉన్నా.. వీరి ట్రాప్ లో పడకుండా తప్పించుకోవటం అంత సాధ్యమయ్యే పని కాదు. కర్ణాటకకు చెందిన 38 ఏళ్ల మహిళ భయానక అనుభవం గురించి తెలిస్తే.. ఈ తరహా వ్యక్తులతో ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది ఇట్టే అర్థమవుతుంది.
బెంగళూరుకు చెందిన 38 ఏళ్ల మహిళ కేరళలోని ఒక ఆలయానికి వెళ్లింది. అక్కడి పూజారి ఆమెతో మాటలు కలిపాడు. తన ఇబ్బందులు.. సమస్యల్ని ఆమె షేర్ చేసింది. మీ సమస్యల్ని తొలగించాలంటే నిగూఢమైన పూజలు చేయాలని.. అందుకు మీరు సిద్ధమైతే పూజల ఏర్పాట్లు చేస్తామని పూజారి అరుణ్ చెప్పాడు. దీంతో.. ఆమె పూజలకు ఓకే చెప్పింది. ఒక దశలో సదరు పూజల నుంచి తప్పుకోవాలని ఆమె అనుకున్నా.. అందుకు నో చెప్పలేని పరిస్థితిని కల్పించటంతో ఆమె పూజలకు సిద్ధం కాక తప్పలేదు.
పూజలో భాగంగా ఒంటి మీద నూలుపోగైనా లేకుండా పూజల్లో పాల్గొనేలా చేశాడు. ఆమెకున్న సమస్యలు తీరటం తర్వాత.. ఆ పూజల తర్వాత ఆమెలో విపరీతమైన భయాన్ని కలిగించాయి. భయంగా బెంగళూరుకు తిరిగి వచ్చిన ఆమె.. పూజలు కొనసాగించటానికి మళ్లీ కేరళకు రావాలని అరుణ్ పట్టుబట్టాడు.అందుకు ఆమె నో చెప్పేసరికి.. ఆమె చేసిన పూజల వీడియోలు.. ఫోటోలు ఉన్నాయని.. ప్రపంచానికి ఆమె పూజల్ని చూపించాలా? అని బెదిరించటం మొదలుపెట్టాడు.
దీంతో భయంతో మళ్లీ కేరళకు వెళ్లక తప్పలేదు. అది మొదలు.. తాను చెప్పినప్పుడల్లా కేరళకు రావాలని.. లేకుంటే సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరింపులకు విసిగిన ఆమె పోలీసుల్ని ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడ్ని అరెస్టు చేసి.. బెంగళూరకు తీసుకొచ్చారు. ఈ ఉదంతం నేర్పే పాఠం ఏమంటే.. మనల్ని తప్పుడు ట్రాక్ లో దింపే వారి విషయంలో మొహమాటానికి పోతే.. అది తర్వాతి కాలంలో మరిన్ని సమస్యలకు కారణమవుతుంది. అందుకే.. ఇలాంటి వాటికి దూరంగా ఉండటం చాలా అవసరం.
