బెంగళూరు ట్రాఫిక్ బాధలకు బుధవారం ‘వర్క్ ఫ్రం హోం’
ఇదే క్రమంలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అత్యధిక రద్దీ నమోదవుతుండటంతో ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను ఉదయం 7:30 గంటలకే ప్రారంభించాలని సూచన చేశారు.
By: Tupaki Desk | 24 July 2025 7:29 PM ISTదేశ ఐటీ రాజధాని అయిన బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకీ మరింత తీవ్రమవుతోంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డు (ORR) పరిధిలో ఉన్న టెక్ పార్కుల చుట్టూ రోజూ ఉదయం, సాయంత్రం గంటలపాటు భారీ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఓ వినూత్న ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు.
ట్రాఫిక్ తగ్గించేందుకు సరికొత్త ఆలోచన
బెంగళూరు ట్రాఫిక్ శాఖ, ORRలోని ఐటీ కంపెనీలకు బుధవారం రోజున వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH Wednesdays) ప్రకటించాలని సిఫారసు చేసింది. ఐటీ ఉద్యోగుల రాకపోకల వల్ల ఏర్పడుతున్న రద్దీని తగ్గించేందుకు ఇది ఒక ప్రయోగాత్మక చర్యగా పరిగణించవచ్చు. ఉద్యోగులు వారంలో ఒక్కరోజైనా ఇంటి నుంచే పని చేస్తే ట్రాఫిక్ పీక్ అవర్లలో భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
కార్యాలయాల ప్రారంభ సమయాల్లో మార్పు సూచన
ఇదే క్రమంలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య అత్యధిక రద్దీ నమోదవుతుండటంతో ఐటీ కంపెనీలు తమ కార్యాలయాలను ఉదయం 7:30 గంటలకే ప్రారంభించాలని సూచన చేశారు. ఇది ఉదయపు ట్రాఫిక్ పీక్ అవర్‌ని సమర్థవంతంగా నిర్వహించడంలో దోహదపడుతుంది. ఈ విధంగా ట్రాఫిక్‌లో చిక్కుకునే సమయం తగ్గడం ద్వారా ఉద్యోగుల ప్రయాణ అనుభవం మెరుగవుతుంది.
-షటిల్ బస్సుల వినియోగం, డేటా ఆధారిత ప్రణాళిక
ఉద్యోగుల రవాణా సౌకర్యార్థం కంపెనీలు తమ సిబ్బందికి షటిల్ బస్సులు అందించాలని కూడా సూచనలు ఉన్నాయి. అలాగే, ట్రాఫిక్ పీక్స్, డెన్సిటీ మొదలైన అంశాలపై మూడు రోజుల పాటు ప్రత్యేకంగా డేటా సేకరణ చేయనున్నారు. ఇందుకోసం పలు ట్రాఫిక్ పాయింట్ల వద్ద కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ డేటాను విశ్లేషించి, భవిష్యత్తులో మరింత సమర్థవంతమైన ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలు రూపొందించనున్నారు.
-అక్రమ పార్కింగ్‌పై జీరో టాలరెన్స్ విధానం
టెక్ పార్కుల చుట్టూ, ప్రధాన రహదారుల వద్ద అక్రమంగా వాహనాలు పార్క్ చేయడాన్ని పూర్తిగా అరికట్టేందుకు ట్రాఫిక్ అధికారులు జీరో టాలరెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను వెంటనే టోయింగ్ చేయాలని ఆదేశించారు. అలాగే, బ్రేక్‌డౌన్ అయ్యే బస్సులు, ట్రక్కులు, వాటర్ ట్యాంకర్ల వలన ఏర్పడే ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు ప్రత్యేక చర్యలూ తీసుకోనున్నారు.
సమన్వయంతో ముందడుగు
ఈ మార్గదర్శకాలను రూపొందించేందుకు ట్రాఫిక్ శాఖ అధికారులు, ఐటీ కంపెనీల ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి ఈ సమావేశానంతరం మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొనడంలో ఇది మంచి ముందడుగని అన్నారు.
వాస్తవానికి బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్య ఒక పెద్ద సవాలే. అయితే అధికారులు వారం మధ్యలో వర్క్ ఫ్రమ్ హోమ్, కార్యాలయ సమయాల మార్పు, అక్రమ పార్కింగ్‌పై కఠిన చర్యలు వంటి వినూత్న మార్గాలను అన్వయిస్తూ, నగర వాసులకు కొంత ఊరట కలిగించే దిశగా ముందడుగు వేస్తున్నారు. టెక్ సిటీగా పేరుగాంచిన బెంగళూరుకు ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.
