తొక్కిసలాటతో సంబంధం లేదన్న కేఎస్సీఏ
బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 6 Jun 2025 5:06 PM ISTబెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో ఆర్సీబీ విజయోత్సవ వేడుకల సందర్భంగా స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట విషాదాన్ని నింపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 11 మంది అభిమానులు మృతిచెందడం కలచివేసింది. అయితే, ఈ దుర్ఘటనకు ఆర్సీబీ యాజమాన్యం, ఈవెంట్ మేనేజర్, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) కారణమని కేసు నమోదైంది. తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ఆరోపిస్తూ కేఎస్సీఏ, సంబంధిత ఈవెంట్ మేనేజ్‌మెంట్ అధికారులపై కేసులు నమోదు చేశారు.
ఈ క్రమంలోనే ఆ ఎఫ్ఐఆర్లను సవాలు చేస్తూ హైకోర్టులో కేఎస్సీఏ పిటిషన్ దాఖలు చేసింది. అనూహ్యండా జరిగిన ఈ విషాదకర ఘటనకు తమ అసోసియేషన్‌ను గానీ, తమ సభ్యులను గానీ క్రిమినల్‌గా బాధ్యులను చేయరాదని తన పిటిషన్‌లో వాదించింది. తాము నిర్దోషులమని, చట్టపరమైన రక్షణ కల్పించాలని కోరింది.
ఆ పిటిషన్‌ను స్వీకరించిన కర్ణాటక హైకోర్టు...ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ కేసు తదుపరి విచారణను జూన్ 10కి వాయిదా వేసింది.
కాగా, ఈ ఘటన నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్‌తో పాటు మరికొందరు పోలీసు అధికారులను తదుపరి విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేసింది. అయితే, పోలీసులు వద్దన్నా వినకుండా ఆర్సీబీ యాజమాన్యం నిర్లక్ష్యం వహించిందని పోలీసులు చెబుతున్నారు. విక్టరీ పరేడ్ లేదని పోలీసులు చెబితే..పరేడ్ ఉందని ఆర్సీబీ యాజమాన్యం చెప్పిందని గుర్తు చేస్తున్నారు.
