Begin typing your search above and press return to search.

ఆర్సీబీ న్యూసెన్స్ చేసింది.. పోలీసులపై ట్రైబ్యునల్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   1 July 2025 6:03 PM IST
ఆర్సీబీ న్యూసెన్స్  చేసింది.. పోలీసులపై ట్రైబ్యునల్  ఆసక్తికర వ్యాఖ్యలు!
X

బెంగళూరులోని చినస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ విజయోత్సవ వేడుకల సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని మిగిల్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. ఈ ఘటన పెను దుమారం రేపింది. ఈ సమయంలో ఈ ఘటనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవును... బెంగళూరులో ఇటీవల చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు సంబంధించి సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (సీఏటీ) కీలక వ్యాఖ్యలు చేసింది. ఇందులో భాగంగా... అక్కడ లక్షల సంఖ్యలో అభిమానులు గుమిగూడటానికి 'రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు'నే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని పేర్కొంది. ఈ సందర్భంగా ఓ ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌ ను రద్దు చేసింది.

ఈ సందర్భంగా స్పందించిన ట్రైబ్యునల్... మూడు నుంచి ఐదు లక్షల మంది ప్రజలు గుమిగూడటానికి ఆర్సీబీనే కారణమని ప్రాథమికంగా తెలుస్తోందని తెలిపింది. పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు లేదా సమ్మతిని వాళ్లు తీసుకోలేదని వ్యాఖ్యానించింది. అకస్మాత్తుగా సోషల్‌ మీడియాలో పోస్టు చేయడంతో భారీ సంఖ్యలో అభిమానులు అక్కడికి తరలివచ్చారని పేర్కొంది.

ఇదే సమయంలో... పోలీసు సిబ్బంది కూడా మనుషులేనని.. వారు దేవుళ్లు లేదా ఇంద్రజాలికులు కాదని.. వేలు రుద్దడం ద్వారా ఎలాంటి కోరికనైనా తీర్చగల 'అల్లాదీన్ అద్భుత దీపం' వంటి మాయా శక్తులు కూడా వారికి లేవని వ్యాఖ్యానించింది. సుమారు 12 గంటల తక్కువ సమయంలో భద్రతా ఏర్పాట్లు చేస్తారని పోలీసుల నుంచి ఆశించలేమని ట్రైబ్యునల్ పేర్కొంది.

జూన్ 4, 2025న సమయం లేకపోవడం వల్ల పోలీసులు తగిన ఏర్పాట్లు చేయలేకపోయారని.. పోలీసులకు తగినంత సమయం ఇవ్వలేదని చెబుతూ.. బెంగళూరు పోలీసు అధికారి వికాస్‌ కుమార్‌ తన సస్పెన్షన్‌ ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ ను విచారించినప్పుడు ట్రిబ్యునల్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆ ఐపీఎస్‌ అధికారి సస్పెన్షన్‌ ను రద్దు చేసింది.