ట్రాఫిక్ విషయంలో బెంగళూరు వరల్డ్ రికార్డ్.. హైదరాబాద్ స్థానం ఇదే!
ప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరల్లో జనాభా రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Jan 2026 1:41 PM ISTప్రపంచ వ్యాప్తంగా ప్రధాన నగరల్లో జనాభా రోజు రోజుకీ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగాల కోసమో గ్రామాల్లోని ప్రజలు పట్టణాలకు పరుగుతులు తీస్తున్నారు. ఈ సమయంలో ప్రధాన నగరాల్లో జనాభా పెరుగుతుంది, వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది.. ఫలితంగా ట్రాఫిక్ సమస్యలు తదనుగుణంగా పెరుగుతున్నాయి. ఈ సమయంలో ప్రపంచంలో ఏయే నగరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందనే అంశంపై టామ్ టామ్ సంస్థ ఒక నివేదిక వెల్లడించింది.
అవును... ప్రపంచవ్యాప్తంగా పలు కీలక నగరాల్లో జనాభా విపరీతంగా పెరుగుతోంది.. వాహనాల సంఖ్య పెరుగుతోంది.. అయినప్పటికీ రోడ్లు మాత్రం అంతే ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు రోజు రోజుకీ కఠినతరం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తాజాగా నెదర్లాండ్స్ కు చెందిన సంస్థ టామ్ టామ్ ఓ ఆసక్తికర నివేదిక విడుదల చేసింది. ఈ 2025 రద్దీ డేటా ప్రకారం.. అత్యంత రద్దీగా ఉండే నగరాల్లో మెక్సీకో నగరం టాప్ ప్లేస్ లో నిలవగా.. బెంగళూరు నగరం రెండో స్థానంలో నిలిచింది.
తాజా ట్రాఫిక్ ఇండెక్స్ లో 75.9 స్కోరుతో అత్యంత రద్దీగా ఉండే నగరంగా మెక్సికో నగరం నిలిచింది. దీని ఫ్రీ-ఫ్లో ప్రయాణ సమయం కి.మీ.కు 1 నిమిషం 57 సెకన్లు కానీ దాని సగటు వాస్తవ ప్రయాణ సమయం కి.మీ.కు 3 నిమిషాలు 27 సెకన్లు. ఇక.. భారతదేశంలోని బెంగళూరు ఈ జాబితాలో రెండవ స్థానంలో (74.4) ఉంది. ఇక్కడ సగటు వేగం గంటకు 16.6 కి.మీ. కావడం గమనార్హం. ఇక ఐర్లాండ్ లోని చారిత్రాత్మక నగర కేంద్రం డబ్లిన్ ఈ జాబితాలో మూడవ స్థానంలో (72.9) ఉంది.
ఈ క్రమంలో... 2025 లో సమీక్షించబడిన దాదాపు 500 నగరాల్లో, కేవలం 34 నగరాల్లో మాత్రమే 2024 సంవత్సరంతో పోలిస్తే కిలోమీటరుకు వాటి అంతర్గత ప్రయాణ సమయాలు తగ్గాయని నివేదిక తెలిపింది. ఈ జాబితాలో ఉన్న భారతీయ నగరాల వివరాలు చూస్తే.. ముంబై (18వ స్థానం), ఢిల్లీ (23), కోల్ కతా (29), చెన్నై (32), హైదరాబాద్ (47) స్థానాల్లో నిలిచాయి. వాస్తవానికి కోల్ కతా గత ఏడాది ట్రాఫిక్ లో రెండో స్థానంలో ఉన్నప్పటికీ ఈ ఏడాది మెరుగుపడింది!
ఇక... అమెరికాలోని మూడు నగరాల్లో ప్రయాణ సమయాలు గత ఏడాదితో పోలిస్తే మరింత దిగజారాయి. ఇందులో భాగంగా... 2024లో సిరక్యూస్ లో ఒక కిలోమీటరు ప్రయాణానికి 1 నిమిషం 19 సెకన్లు పట్టగా.. 2025లో అది 1 నిమిషం 26కి పెరిగింది. మిన్నియాపాలిస్ లో ప్రయాణ సమయాలు 1:12 నుండి 1:17కి పెరిగాయి. ఇదే క్రమంలో... శాన్ ఫ్రాన్సిస్కాన్లు ట్రాఫిక్ లో అదనంగా 11 సెకన్లు గడిపారు. ఇక్కడ కి.మీ.కు 2024లో 2:47 నుండి 2025లో 2:58కి పెరిగాయి.
