వీడియో: యువతిపై ర్యాపిడో డ్రైవర్ దాడి.. ఏమి జరిగిందంటే..?
బెంగళూరులోని జయనగర్ లో రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్.. ఒక యువతిపై దాడి చేసినట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది
By: Tupaki Desk | 16 Jun 2025 11:22 PM ISTబెంగళూరులోని జయనగర్ లో రాపిడో బైక్ ట్యాక్సీ డ్రైవర్.. ఒక యువతిపై దాడి చేసినట్లు చూపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అతడి బైక్ పై ప్రయాణించిన యువతి.. రైడ్ అనంతరం బైక్ డ్రైవర్ ర్యాష్ డ్రైవింగ్ విషయంలో గొడవకు దిగినట్లు చెబుతున్నారు. దీంతో... పోలీసులు ఎంట్రీ ఇచ్చారు.
అవును... ఎంత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆప్షన్ ఉన్నప్పటికీ.. సిటీలో చాలా మంది మహిళలు సైతం అనుకున్న సమయానికి గమ్యస్థానాలకు చేరేందుకు కారు, బైక్ రైడ్ సర్వీసులను ఉపయోగించుకుంటుంటారు. అయితే.. తాజాగా ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్న ఓ యువతికి, డ్రైవర్ కి మధ్య వాగ్వాదం కాస్తా భౌతిక దాడి వరకూ వెళ్లింది.
వివరాళ్లోకి వెళ్తే... బెంగళూరులోని ఒక గోల్డ్ షాప్ లో సేల్స్ ఉమెన్ గా పనిచేస్తున్న ఒక యువతి జయనగర్ నుంచి ర్యాపిడో బైక్ బుక్ చేసుకుంది. దీంతో.. ఆమెను బైక్ ఎక్కించుకున్న డ్రైవర్.. యువతిని లొకేషన్ లో దించాడు. ఈ సమయంలో ఆ డ్రైవర్ కి డబ్బులు ఇవ్వకుండా.. ర్యాష్ డ్రైవింగ్ పేరు చెప్పి యువతి వాగ్వాదానికి దిగింది.
ఈ సమయంలో డబ్బులతో పాటు, హెల్మెట్ ను తిరిగి ఇచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో.. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.. కాసేపటికి అది ముదిరింది. ఆ సమయంలో ఆమె ఇంగ్లిష్ లో మాట్లాడుతుండగా.. అతడు కన్నడలో మాట్లాడాడు! అనంతరం.. ఆ డ్రైవర్ ఆమెను చెంపదెబ్బ కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది.
దీంతో.. ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా స్పందించిన డ్రైవర్ తన చర్య సమర్ధించుకున్నట్లు చెబుతున్నారు. ఆమె తనను దుర్భాషలాడిందని, నేను చదువుకున్నానా లేదా అని అడిగిందని.. ఆమె అసభ్యంగా ప్రవర్తించిందని, డబ్బులు ఇవ్వకుండా దుర్భాషలాడిందని ఆరోపించాడు.
ఇదే సమయంలో.. తన కాలర్ కూడా పట్టుకుందని చెప్పిన ఆ డ్రైవర్.. ఆ యువతితో "మీ దేశానికి తిరిగి వెళ్లు" అని చెప్పినట్లు అంగీకరించాడు! ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది!
