Begin typing your search above and press return to search.

డిజిటల్ చెల్లింపులకు నో.. మళ్లీ నగదు పేమెంట్లే శరణ్యమా?

ప్రస్తుతం జీఎస్టీ చట్టం ప్రకారం.. వస్తువులు విక్రయించే వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు దాటితే పన్నుచెల్లించాలి.

By:  Tupaki Desk   |   18 July 2025 10:01 AM IST
డిజిటల్ చెల్లింపులకు నో.. మళ్లీ నగదు పేమెంట్లే శరణ్యమా?
X

దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన బెంగళూరు నగరం ఇప్పుడు షాకిస్తోంది... డిజిటల్ పేమెంట్లను తిరస్కరిస్తూ నగదు లావాదేవీల వైపు మళ్లుతోంది. 'నో యూపీఐ – ఓన్లీ క్యాష్' అనే బోర్డులు, స్టిక్కర్లు నగరంలోని అనేక చిన్న వ్యాపార, వీధి దుకాణాల్లో కనిపించడం మొదలైంది. డిజిటల్ చెల్లింపుల్లో అగ్రగామిగా ఉన్న ఐటీ హబ్ బెంగళూరులో ఈ విధమైన మార్పు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఏం జరిగింది?

వివరాల్లోకెళితే.. ఇటీవల వేలాది మంది బెంగళూరు వ్యాపారులకు జీఎస్టీ (GST) నోటీసులు అందాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి వారి డిజిటల్ లావాదేవీల ఆధారంగా వార్షిక టర్నోవర్ నిబంధనలను అధిగమించినట్టు భావించి ఈ నోటీసులు పంపినట్టు పన్ను అధికారులు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో లక్షల రూపాయల పన్ను చెల్లించాల్సిందిగా నోటీసుల్లో పేర్కొనడం వ్యాపారుల్లో తీవ్ర భయాందోళనకు దారితీసింది.

నగదు పేమెంట్ల వైపు మళ్లే వ్యాపారులు

ఈ పరిణామాల నేపథ్యంలో చాలామంది చిన్న వ్యాపారులు ఇప్పుడు డిజిటల్ చెల్లింపులను పూర్తిగా నిరాకరిస్తున్నారు. వారి లావాదేవీలపై పన్ను అధికారుల దృష్టి పడకుండా ఉండేందుకు నగదు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. వారు తమ దుకాణాల వద్ద UPI నిషేధ బోర్డులు పెట్టడం ఈ మార్పుకు నిదర్శనం.

పన్ను చట్టం ఏం చెబుతోంది?

ప్రస్తుతం జీఎస్టీ చట్టం ప్రకారం.. వస్తువులు విక్రయించే వ్యాపారాల వార్షిక టర్నోవర్ రూ. 40 లక్షలు దాటితే పన్నుచెల్లించాలి. సేవలందించే వ్యాపారాల టర్నోవర్ రూ. 20 లక్షలు దాటితే కూడా పన్ను పడుతుంది. వారికి జీఎస్టీ నమోదు తప్పనిసరి. అలాగే పన్ను చెల్లింపూ చేయాల్సి ఉంటుంది. పన్ను శాఖ ప్రకారం, యూపీఐ లావాదేవీలు ఆధారంగా ఆ పరిమితిని దాటిన వారికి మాత్రమే నోటీసులు జారీ చేశారు. ఇది పారదర్శకత పెంచే ప్రయత్నంగా చూస్తున్నారు.

నిపుణుల హెచ్చరికలు

పన్ను నిపుణులు, న్యాయవాదులు మాత్రం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కేవలం డిజిటల్ ట్రాన్సాక్షన్ల ఆధారంగా వ్యాపార టర్నోవర్‌ను అంచనా వేయడం సరైన పద్ధతికాదని అంటున్నారు. ఎందుకంటే అన్ని యూపీఐ లావాదేవీలు వ్యాపార సంబంధితవే కావు. కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరిగిన నగదు మార్పిడులు కూడా ఉండొచ్చు. పర్సనల్ యూపీఐ ఖాతాల ద్వారా వచ్చిన డబ్బును వ్యాపార ఆదాయంగా పరిగణించడం అన్యాయం అంటున్నారు. దీంతో పన్ను అధికారుల అధిక అధికారాల దుర్వినియోగం జరిగే అవకాశముందని, ఇది చిన్న వ్యాపారులపై అనవసర ఒత్తిడిని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

-మళ్లీ నగదు ఆధారిత వ్యవస్థకే తలవంచాలా?

ఈ పరిస్థితుల్లో ప్రజలు, వ్యాపారులు మళ్లీ నగదు ఆధారిత వ్యవస్థ వైపు మళ్లడం తక్షణ సమస్యల పరిష్కారంగా కనిపించినా... దీర్ఘకాలంగా ఇది నష్టదాయకమేనని నిపుణుల అభిప్రాయం. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కల్పించాలంటే సరైన అవగాహన, స్పష్టమైన మార్గదర్శకాలు అవసరం. లేదంటే, డిజిటల్ ఇండియా లక్ష్యం దెబ్బతినే ప్రమాదం ఉంది.

డిజిటల్ పేమెంట్స్ పెరిగే కొద్దీ పారదర్శకత, సౌలభ్యం పెరుగుతాయి. కానీ, ఈ డేటాను విపరీతంగా వాడి చిన్న వ్యాపారులపై ఒత్తిడులు పెడితే, వారు మళ్లీ రివర్స్ గేర్ వేయాల్సిన పరిస్థితి వస్తుంది. బదులుగా, చిన్న వ్యాపారులకు అవగాహన కల్పిస్తూ, సరైన పద్ధతిలో పన్ను వ్యవస్థను అమలు చేస్తేనే.. ప్రజలు డిజిటల్ చెల్లింపులను భయంతో కాదు, నమ్మకంతో స్వీకరిస్తారు.