అప్డేట్: బెంగళూరు టెకీ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు
నిజానికి గత ఆదివారం షాజియా హైదరాబాద్ లోనే ఉన్నారు. తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆమె.. తిరిగి ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరారు.
By: Garuda Media | 2 April 2026 10:09 AM ISTతెలంగాణకు చెందిన టెకీలు ఇద్దరు బెంగళూరులో సూసైడ్ చేసుకోవటం.. భర్త హిందువు (భానుచందర్ రెడ్డి), భార్య ముస్లిం (షాజియా) కావటం.. వీరి వివాహం గురించి బయటకు తెలీదని.. తొమ్మిదేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉండి.. రెండున్నరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నట్లుగా సమాచారం బయటకు రావటం తెలిసిందే. భర్త ఆత్మహత్య చేసుకున్న ఇరవై నిమిషాలకు తన ప్లాట్ నుంచి లిఫ్టులో 17వ అంతస్తులోకి వెళ్లిన షాజియా అక్కడి నుంచి కిందకు దూకి ప్రాణాలు తీసుకోవటం అందరిని కలిచివేసింది. ఈ జంట ఆత్మహత్యలకు సంబంధించిన పలు షాకింగ్ అంశాలు పోలీసుల విచారణలో వెలుగు చూశాయి.
భానుచందర్ రెడ్డి అమెరికాలో (కొన్ని రిపోర్టుల ప్రకారం కెనడా)లో ఐటీ జాబ్ చేస్తుండేవాడు. అప్పట్లో అతడి ప్యాకేజ్ రూ.80 లక్షలుగా చెబుతున్నారు. అయితే.. అతను 2025లో విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. ఏఐ కారణంగా అతను తన జాబ్ ను పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఈ దంపతులు జాబ్ కోసం ప్రయత్నం చేయటం.. ఎనిమిది నెలల క్రితం ఐబీఎంలో షాజియాకు జాబ్ రావటంతో వారు బెంగళూరు షిప్టు అయినట్లుగా తెలుస్తోంది.
ఇక.. వీరిద్దరి మతాంతర వివాహం గురించి భానుచందర్ రెడ్డి ఇంట్లో సమాచారం ఉందని.. అతడి తండ్రి తెలంగాణ రాజకీయాల్లో కాస్త పేరున్న వ్యక్తిగా చెబుతున్నారు. కానీ.. ఆ వివరాలు బయటకు రావటం లేదు. ఆత్మహత్య చేసుకున్న భానుచందర్ రెడ్డి తాను రాసుకున్న సూసైడ్ లేఖలో తన చావుకు ఎవరూ కారణం కాదని.. తన భార్య షాజియాను నిందించొద్దని స్పష్టంగా పేర్కొనటం గమనార్హం. మతాంతర వివాహం కారణంగా తన ఇంటితో పెద్దగా సంబంధాలు లేకపోవటం.. జాబ్ లేకపోవటం.. ఎంగ్జైటీ.. తీవ్రమైన నిరాశలో మునిగిపోవటం లాంటివి ఆత్మహత్యకు పురిగొల్పి ఉంటాయని భావిస్తున్నారు.
నిజానికి గత ఆదివారం షాజియా హైదరాబాద్ లోనే ఉన్నారు. తన తల్లిని చూసేందుకు వచ్చిన ఆమె.. తిరిగి ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి బస్సులో బయలుదేరారు. ఆ టైంలో కూడా భానుచందర్ రెడ్డితో ఫోన్ లో మాట్లాడటం.. డిన్నర్ గురించి అడిగితే.. ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. సోమవారం ఉదయం బెంగళూరుకు చేరుకున్నంతనే.. నేరుగా ఆఫీసుకు వెళ్లిన షాజియా.. రాత్రికి ఇంటికి చేరుకున్నారు. భానుచందర్ రెడ్డి గది లాక్ చేసి ఉండటం.. ఎంతకూ పలకపోవటంతో..సెక్యూరిటీ సాయంతో తలుపు బద్ధలు కొట్టగా సూసైడ్ చేసుకున్న విషయాన్ని గుర్తించారు. దాదాపు 20 నిమిషాలు షాక్ లో ఉన్న షాజియా.. ఆ తర్వాత ఎవరికి అనుమానం రాకుండా బయటకు లిఫ్టులో వచ్చి.. అపార్టుమెంట్ లో 17వ అంతస్తులోకి వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకేసి ప్రాణాలు తీసుకున్నారు.
గడిచిన కొంతకాలంగా వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లుగా చెబుతున్నా.. దానికి సంబంధించిన ఆధారాల్ని గుర్తించలేదు. ఇద్దరి మధ్య ముందు రోజు (ఆదివారం) కూడా తీవ్ర వాగ్వాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నట్లుగా వస్తున్న వార్తల్లోనూ వాస్తవం ఎంతన్నది ప్రశ్నార్ధకమే. ఎందుకంటే.. వీరిద్దరి గొడవల గురించి తెలిసింది ఈ ఇద్దరికే. ఇప్పుడు వీరు చనిపోయారు. వారిద్దరూ ముందు రోజు రాత్రి గొడవ పడినట్లు చెప్పే వాళ్లు ఎవరు? అన్నది ప్రశ్న. అయితే.. ఈ ఇరువురి ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఈ ఫోన్లను.. ఫోన్ కాల్స్ ను విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే.. జాబ్ లేకపోవటం.. మతాంతర వివాహం కారణంగా బయటకు తమ వివరాలు ఎక్కువగా బయటకు రాకుండా తీసుకున్న జాగ్రత్తలు.. మొత్తంగా తీవ్రమైన ఒత్తిడి.. నిరాశ.. భానుచందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణంగా తెలుస్తోంది. ఏమైనా.. వీరిద్దరి ఆత్మహత్య విషాద ఉదంతం ఎన్నో కొత్త ప్రశ్నలకు తెర తీసిందని మాత్రం చెప్పక తప్పదు.
