సీఎం టు సినీ ప్రముఖులతో ఫోటోలు.. కిట్టీ పార్టీలతో రూ.30 కోట్ల మోసం!
అవును... బెంగళూరులోని బసవేశ్వరనగర్ లో పోలీసులు సవిత (49) అనే మహిళను అరెస్టు చేశారు!
By: Tupaki Desk | 12 July 2025 12:00 PM ISTతక్కువ ధరకు విదేశాల నుంచి బంగారం రప్పిస్తానని.. రెట్టింపు ప్రాఫిట్ లభిస్తుందని హామీ ఇచ్చి.. సీఎం నుంచి సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెప్పుకుంటూ.. వారితో దిగిన ఫోటోలను చూపిస్తూ.. డబ్బున్న మహిళలను పరిచయం చేసుకుని రూ.30 కోట్ల వరకూ ముంచేసిన ఓ మహిళ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... బెంగళూరులోని బసవేశ్వరనగర్ లో పోలీసులు సవిత (49) అనే మహిళను అరెస్టు చేశారు! నగరంలోని కిట్టి పార్టీల పేరుతో డబ్బున్న మహిళలతో స్నేహం చేసి, వారిలో కనీసం 20 మంది నుండి సుమారు రూ.30 కోట్లకు పైగా మోసం చేశారనే ఆరోపణలపై ఆమెను అరెస్టు చేశారు. దీంతో.. స్థానిక కోర్టు ఆమెను ఐదు రోజుల పోలీసు కస్టడీకి పంపింది.
ఈ సందర్భంగా... సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఎంబీ పాటిల్ వంటి ప్రముఖ రాజకీయ ప్రముఖులతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పుకుంటూ.. వారితోపాటు సినీ ప్రముఖులతో దిగిన ఫోటోలు చూపిస్తూ సంపన్న మహిళలతో నమ్మకం పెంచుకోడానికి ఈ కిట్టీ పార్టీల ఉపయోగించుకుందని పోలీసులు తెలిపారు.
ఈ సమయంలో... అధిక రాబడి పెట్టుబడులు ఆశచూపి ఆమె వారి నుండి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిందని ఆరోపించారు. ఇదే సమయంలో... అమెరికా నుంచి తక్కువ ధరలకు బంగారం సరఫరా చేస్తానని సవిత హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో.. బాధితులు రూ.50 లక్షల నుంచి రూ.2.5 కోట్ల వరకు ఆమెకు చెల్లించారని వెల్లడించారు.
ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరు స్పందిస్తూ.. సవిత, ఆమె సహచరుల బృందం చేతిలో రెండేళ్లలో దాదాపు రూ.95 లక్షలు నష్టపోయినట్లు ఆరోపించారు. ఇదే సమయంలో... రిటైర్డ్ టీచర్, గృహిణి అయిన మహిళ.. తాను, తన భర్త 2022 నాటికి ఆదా చేసుకున్న రూ.24 లక్షల్లో అధిక మొత్తం ఆమె వద్ద పెట్టుబడి పెట్టినట్లు ఎఫ్.ఐ.ఆర్. లో పేర్కొన్నారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో స్పందించిన ఓ పోలీసు అధికారి... చాలా మంది బాధితులు ఆమె నెట్ వర్కింగ్ సామర్థ్యాలను చూసి నమ్మారని.. వీరిలో కొందరు నేరుగా నగదు అందజేయగా, మరికొందరు ఆన్ లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారని తెలిపారు. అయితే ఆ నిధులను బంగారం, గృహోపకరణాల కొనుగోళ్లకు ఆమె మళ్లించినట్లు తెలిపారు. ఆమె రహస్యంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని నిర్వహిస్తోందని అన్నారు!
