Begin typing your search above and press return to search.

ఆమె లాయర్.. కాలేజీ నాటి ఫ్రెండ్ కోసం ఐదేళ్ల కూతుర్ని చంపేసింది

సజావుగా సాగిపోతున్న కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు ఎలాంటి సునామీలు కారణమవుతున్నాయన్న ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి.

By:  Garuda Media   |   8 Jun 2026 10:07 AM IST
ఆమె లాయర్.. కాలేజీ నాటి ఫ్రెండ్ కోసం ఐదేళ్ల కూతుర్ని చంపేసింది
X

సజావుగా సాగిపోతున్న కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు ఎలాంటి సునామీలు కారణమవుతున్నాయన్న ఉదంతాలు ఇటీవల కాలంలో తరచూ వెలుగు చూస్తున్నాయి. తాజాగా బెంగళూరులో వెలుగు చూసిన ఐదేళ్ల వెన్నెల చిన్నారి మరణం గురించి తెలిస్తే మాత్రం నోటి వెంట మాట రాకుండా పోవటమే కాదు.. మరీ ఇంత దారుణమా? అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి. కొత్త మోజు కోసం.. కన్న కూతుర్ని చంపుకున్న దారుణ మనస్తత్వం.. అది కూడా ప్రాక్టీస్ చేసే మహిళా లాయర్ లో ఉండటం చూస్తే.. సమాజం ఎటు వెళుతోందన్న ఆందోళనకు గురి కాక మానదు. పెను సంచనలంగా మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

కర్ణాటకలోని దావణగెరెకు చెందిన ప్రవీణ్ బాసప్ప.. బెంగళూరుకు చెందిన న్యాయవాది ప్రియాంకలకు 2007లో పెళ్లైంది. వారి వైవాహిక జీవితానికి గుర్తుగా 17 ఏళ్లు.. ఐదేళ్ల వయసున్న ఇద్దరు కుమార్తెలున్నారు. వ్యవసాయంతో పాటు కొన్ని వ్యాపారాలు చేస్తుండే ప్రవీణ్ ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే.. ఎగువ మధ్యతరగతికి చెందిన వారిగా చెబుతున్నారు. 2025 చివర్లో ఒక భూవివాదానికి సంబంధించిన అంశంపై బెంగళూరు వెళ్లిన ప్రియాంకకు.. ఆమె కాలేజీ రోజుల్లోని స్నేహితుడు కలిశారు. రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన జీఎం మోహన్ తో ఆమె కాలేజీ రోజుల్లో ప్రేమించుకున్నట్లుగా తెలుస్తోంది.

దాదాపు రెండు దశాబ్దాల వైవాహిక జీవితం అనంతరం పరిచయమైన జీఎం మోహన్ తో ఆమెకు స్వల్ప వ్యవధిలోనే వివాహేతర సంబంధంగా మారింది. దాదాపు వెయ్యి కోట్లకు పైనే ఆస్తులు ఉన్న జీఎం మోహన్ తో కలిసి ఉండేందుకు వీలుగా భర్త ప్రవీణ్ తో గొడవ పడిన ప్రియాంక.. చివరకు తాను అనుకున్నట్లే విడాకుల పత్రాల మీద భర్త చేత బలవంతంగా సంతకాలు చేయించుకుంది. ఈ సందర్భంగా అతడికి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వచ్చినట్లుగా తెలుస్తోంది.అనంతరం ఐదేళ్ల చిన్న కూతురు వెన్నెలను తీసుకొని బెంగళూరులోని సీగేహళ్లిలోని ఒక లగ్జరీ విల్లాలో మోహన్ తో కలిసి సహజీవనం చేయసాగింది.

పెద్ద కుమార్తె మాత్రం తండ్రి దగ్గరే ఉండిపోయింది. కట్ చేస్తే.. మార్చి 24 రాత్రి చిన్నారి వెన్నెల అకస్మాత్తుగా మరణించింది. ఆ రోజు ప్రియాంక పుట్టినరోజు. తన చిన్న కూతురు మరణంపై ప్రియాంక ఒక్కొక్కరికి ఒక్కోలాంటి కారణం చెప్పింది. ఒకసారి బిర్యాని తినిపించినట్లుగా.. మరోసారి ఐస్ క్రీమ్ ఇచ్చి ఏసీ ఆన్ చేసి కారులో నిద్ర పుచ్చానని.. ఆ తర్వాత అనారోగ్యంతో చనిపోయినట్లుగా.. ఇలా వేర్వేరు సమాధానాలు చెప్పుకొచ్చింది. అదే సమయంలో చిన్నారి వెన్నెల శరీరం నల్లగా మారి ఉండటాన్ని గమనించిన తండ్రి ప్రవీణ్.. పోస్టు మార్టం రిపోర్టును చేజిక్కించుకున్నారు.

చిన్న కూతురు మరణం మీద సందేహాలున్న తండ్రి ప్రవీణ్.. పోస్టుమార్టం నివేదికను లండన్ లో ఉన్న వైద్యురాలైన తన సోదరికి పంపాడు. ఆమె అక్కడ పీడియాట్రిషియన్ గా పని చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టును చూసిన ఆమె.. పాప సహజంగా చనిపోలేదని.. శ్వాస ఆడకుండా చేసి.. భౌతికదాడికి పాల్పడిన కారణంగానే చనిపోయినట్లుగా గుర్తించారు. దీంతో.. జూన్ మొదటి వారంలో ప్రవీణ్ పోలీసులకు కంప్లైంట్ చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది.

తన మాజీ భార్య.. ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు..ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనేందుకు అడ్డుగా ఉన్న కారణంగానే తన చిన్న కుమార్తెను చంపినట్లుగా పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ లో పేరర్కొన్నారు. దీంతో స్పందించిన పోలీసులు ప్రియాంక ప్రియుడు మోహన్ ను అరెస్టు చేసి ఏడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. పోలీసులు మోహన్ ను అరెస్టు చేసేందుకు వెళ్లే సమయానికి అతను.. ముందస్తు బెయిల్ తీసుకొని ఉండటంతో.. కోర్టుకు అతడి మీద ఉన్న ఆరోపణలకు సంబంధించిన సమాచారం ఇవ్వటంతో న్యాయస్థానం అతడికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దైంది. దీంతో అతడ్ని అరెస్టు చేసి విచారణ చేయగా.. షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి.

మార్చి 24న ప్రియాంక పుట్టినరోజు కావటంతో ఆమె మోహన్ తో కలిసి పుట్టినరోజు వేడుకల్ని చేసుకున్నట్లుగా వెల్లడించాడు. తామిద్దరం కొత్త జీవితాన్ని ప్రారంభించటానికి.. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనడానికి చిన్నారి వెన్నెల అడ్గుగా ఉండటంతో.. ఆమెను పథకం ప్రకారం వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నాడు. ప్రియాంక పుట్టినరోజు వేడుకుల వేళ చిన్నారి పొట్టపై బలంగా తన్నడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆపై ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. ముందస్తుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం చిన్నారి వెన్నెలను చంపేసిన వీరు.. కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ ను తెచ్చుకుున్నారు. పోస్టుమార్టం రిపోర్టులోని అంశాలతో అతడికి ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దైంది. ఇదిలా ఉంటే.. ఈ మొత్తం దుర్మార్గానికి కారణమైన ప్రియాంక ఇప్పుడు పరారీలో ఉన్నారు. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. లాయర్ గా ప్రాక్టీస్ చేసే ఒక మహిళ.. కాలేజీ నాటి ప్రియుడితో కొత్త జీవితం కోసం కన్నకూతుర్ని చంపుకునేందుకు వెనుకాడని వైనం ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేసేలా మారింది.