సిటీలో 'ఏఐ' బోర్డు.. దీని కంట పడ్డారా మొత్తం జాతకం బట్టబయలు..
వాహనాలు నడపాలంటే నిబంధనలు పాటించకతప్పదు. కొందరు వ్యక్తులు నిబంధనలు పాటించరు.
By: Tupaki Desk | 25 Sept 2025 5:00 PM ISTవాహనాలు నడపాలంటే నిబంధనలు పాటించకతప్పదు. కొందరు వ్యక్తులు నిబంధనలు పాటించరు. దీంతో సీసీ కెమెరాలే నుంచే కానీ, ట్రాఫిక్ పోలీసుల నుంచి ఫైన్లు ఎదుర్కొంటారు. అయితే వీరు ఫైన్లు కట్టరు సరికదా స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతూనే ఉంటారు. అలాంటి వారికి ఇక చెక్ పడనుంది. నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసే అలవాట్లు, ట్రాఫిక్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం.. ఇవన్నీ రహదారులను మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ట్రినిటీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన ‘ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్ (ఏఐ)’ ఆధారిత డిజిటల్ బిల్‌బోర్డు ఒక కొత్త అధ్యాయానికి తెర తీసింది.
అత్యాధునిక కెమెరాలు..
ఈ బోర్డుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక కెమెరాల సాయంతో వంద మీటర్ల దూరం నుంచే వాహన రిజిస్ట్రేషన్ నంబర్లను గుర్తిస్తుంది. కేవలం పది సెకన్లలోనే జాతీయ వాహన డేటాబేస్ నుంచి పూర్తి డేటాను తీసుకుంటుంది. పెండింగ్ చలాన్లు, పొల్యూషన్ సర్టిఫికెట్లు లేదంటే ఇతర ట్రాఫిక్ ఉల్లంఘనల వివరాలను బహిరంగంగా తెరపై ప్రదర్శిస్తుంది. ఉద్దేశ్యం కేవలం జరిమానాలు గుర్తు చేయడం మాత్రమే కాదు. ప్రతి డ్రైవర్ తన బాధ్యతను గుర్తించాలని.
స్వాగతించిన ప్రముఖలు..
కార్స్-24, క్రాష్ ఫ్రీ ఇండియా లాంటి దిగ్గజ కంపెనీలు ఈ విధానాన్ని స్వాగతిస్తున్నాయి. ఇలాంటి ఏఐ బోర్డులతో పెండింగ్ చలాన్లకు చెక్ పెట్టచ్చని, ట్రాఫిక్ ఉల్లంఘనలు చేస్తే ఎక్కడైనా పట్టుకునేలా ఈ బోర్డులు ఉపయోగపడడం మంచి పరిణామం అంటున్నారు. దీన్ని ప్రవర్తనా మార్పు సాధనంగా చూస్తున్నామని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కలిగే పరిణామాలను రియల్ టైమ్‌లో చూపించడం వల్ల, డ్రైవర్లలో బాధ్యతాయుతమైన అలవాట్లు పెరుగుతాయని అధికారులు ఆశిస్తున్నారు.
మూడు వారాల్లోనే 37.8 లక్షల ఉల్లంఘనలు
ఈ విధానంలో కేవలం మూడు వారాల వ్యవధిలోనే (ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 12 వరకు) 37.8 లక్షలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు కావడం, పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ చలాన్లపై తాత్కాలికంగా 50 శాతం మాఫీ ప్రకటించినప్పటికీ, దీన్ని ఎవరూ పట్టించుకోలేదని ఈ బోర్డు డిస్ ప్లే చేసే వాహన నెంబర్లను చూస్తే అర్థం అవుతుంది.
ప్రజల్లో మార్పు అవసరం
ట్రాఫిక్ ఉల్లంఘనలను అరికట్టేందుకు జరిమానాలు విధించడం ఒక మార్గం కావచ్చు, కానీ అది మాత్రమే సరిపోదు. ప్రజల్లో మార్పు రావాలి. బాధ్యత పెరగాలి. ట్రినిటీ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన ఈ ఏఐ బిల్‌బోర్డు ఆ దిశగా ఒక సృజనాత్మక ప్రయత్నం మాత్రమే. ఇలాంటి సాంకేతిక పరిష్కారాలు ఇతర నగరాల్లో కూడా అమలు చేస్తే, వాహనదారుల క్రమశిక్షణ పెరుగుతుంది.
