Begin typing your search above and press return to search.

బీజేపీ అభ్యర్థిని వెంటాడి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు.. బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు.

By:  Tupaki Political Desk   |   23 April 2026 3:22 PM IST
బీజేపీ అభ్యర్థిని వెంటాడి కొట్టిన తృణమూల్ కార్యకర్తలు.. బెంగాల్ లో తీవ్ర ఉద్రిక్తత
X

పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తొలి విడత పోలింగ్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు పోటెత్తారు. అదే సమయంలో పలు చోట్ల హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఈ ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ ముందు ఎన్నడూ లేనట్లు భద్రతా చర్యలు చేపట్టింది. అయినప్పటికీ పలు చోట్ల దాడులు, ప్రతిదాడులతో భయానక పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రసార మాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా ఎన్నికల అక్రమాలను అడ్డుకునేందుకు ప్రయత్నించే వారిపై అల్లరిమూకలు విరుచుకుపడుతున్నాయని చెబుతున్నారు. కోల్ కతా సమీపంలోని ఎక్బల్‌పూర్ సమీపంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ లక్ష్యంగా దాడి జరగగా, కుమార్ ఘంజ్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సుబేందు సర్కార్ పై తృణమూల్ శ్రేణులు విరుచుపడ్డాయి.

పశ్చిమబెంగాల్ లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కుమార్‌గంజ్ నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాల నుంచి తమ ఏజెంట్లను టీఎంసీ కార్యకర్తలు బలవంతంగా బయటకు పంపుతున్నారని సమాచారం అందడంతో సుబేందు సర్కార్ అప్రమత్తమయ్యారు. 24వ నెంబరు పోలింగ్ బూత్ వద్దకు వెళ్లిన ఆయన తృణమూల్ కార్యకర్తలు గంపుగా చేరడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన తృణమూల్ కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. సుబేంధు సర్కార్ కారును ధ్వంసం చేయడమే కాకుండా, ఆయనను వెంబడించడంతో ఆయన తన ప్రాణాలను కాపాడుకోవడానికి పరుగెత్తాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన స్వల్పంగా గాయపడ్డారు.

కాగా, దాడి జరుగుతున్న సమయంలో కేంద్ర బలగాలు బూత్ లోపలే ఉన్నాయి, కానీ బయట జరుగుతున్న హింసను అరికట్టడంలో విఫలమయ్యాయని సుబేందు సర్కార్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటమి భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. మరోవైపు ముర్షిదాబాద్ లో టీఎంసీ, హుమాయూన్ కబీర్ నేతృత్వంలోని ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ (ఏజేయూపీ) కార్యకర్తల మధ్య బాంబుల దాడి జరిగింది. ఇరువర్గాల వారు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం అయ్యాయి.

అదేవిధంగా కోల్‌కతాలోని ఎక్బల్‌పూర్ సమీపంలో బీజేపీ అభ్యర్థి రాకేష్ సింగ్ లక్ష్యంగా దాడి జరిగినట్లు చెబుతున్నారు. హుస్సేన్ షా రోడ్డులో రాకేష్ సింగ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశం జరుగుతుండగా, టీఎంసీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ అక్కడికి చేరుకున్నారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. టీఎంసీ కార్యకర్తలు బీజేపీ అభ్యర్థిపైన దాడి చేశారని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనపై కోల్‌కతా పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 9 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు ఉండగా, నలుగురు తృణమూల్ కార్యకర్తలు ఉన్నారు.

ఇవే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పలు హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. బెంగాల్ లో రెండు విడతలుగా పోలింగ్ నిర్వహణకు ఈసీ నిర్ణయించింది. గురువారం తొలివిడతలో 152 చోట్ల పోలింగ్ జరుగుతోంది. ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసీ గతంలో ఎప్పుడూ లేనట్లు కేంద్ర బలగాలను మోహరించింది. సుమారు 2,450 కంపెనీలకు చెందిన 2.5 లక్షల మంది భద్రతా సిబ్బందిని బెంగాల్ లో మొహరించింది. అయినప్పటికీ పలు చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండో విడత పోలింగ్ పైనా టెన్షన్ నెలకొంది.