Begin typing your search above and press return to search.

రాష్ట్రం ఏదైనా.. పవర్ పోతే అంతేనా?

రాజకీయాలు మారిపోయాయి. అధికారం చుట్టూనే రాజకీయం నడిచే పాడు రోజులు వచ్చి చాలాకాలమే అయ్యింది.

By:  Garuda Media   |   5 Jun 2026 5:00 PM IST
రాష్ట్రం ఏదైనా.. పవర్ పోతే అంతేనా?
X

రాజకీయాలు మారిపోయాయి. అధికారం చుట్టూనే రాజకీయం నడిచే పాడు రోజులు వచ్చి చాలాకాలమే అయ్యింది. అయితే.. ఇలాంటి దరిద్రాలు ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లోనే కనిపించేవన్న మాట బలంగా వినిపించేది. అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిన వైనం కనిపిస్తోంది. మిగిలిన రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. కమ్యునిస్టులు సుదీర్ఘకాలం పాలించిన రాష్ట్రాల్లో రెండు ముఖ్యమైనవి అందులో ఒకటి పశ్చిమ బెంగాల్ అయితే రెండోది కేరళం (కేరళ)

ఈ రెండు రాష్ట్రాల్లో ఒక రాజకీయ పార్టీ చేతిలో ఉన్న అధికారం చేజారితే.. ఆ పార్టీ చెల్లాచెదురు కావటం పెద్దగా కనిపించదు. కానీ.. తాజాగా మాత్రం పశ్చిమబెంగాల్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తే.. అధికారం చుట్టూనే రాజకీయం.. రాజకీయ నేతలన్న విషయం స్పష్టమవుతోంది. బ్యాక్ టు బ్యాక్ అన్నట్లుగా పదిహేనేళ్ల పాటు సుదీర్ఘంగా బెంగాల్ రాజకీయాల్ని ఒంటిచేత్తో నడిపిన దీదీ అలియాస్ మమతా బెనర్జీ ఇప్పుడు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

పార్టీ ఏదైనా.. అధినేత ఎవరైనా.. తనకు నచ్చినట్లుగా.. తన పొలిటికల్ లెక్కలకు సరిపడే వారికి మాత్రమే కనీస గౌరవ మర్యాదలు దక్కేలా వ్యవహరించేవారు. ముఖ్యమంత్రులుగా వ్యవహరించి.. కాలం కర్మం బాగోక అధికారం చేజారితే అలాంటి ఇతర రాష్ట్రాలకు చెందిన అధినేతల్ని కలిసేందుకు సైతం ఇష్టపడని ట్రాక్ రికార్డు మమత సొంతం. అలాంటి ఆమెకు ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇటీవల వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ఘోర పరాజయం పాలు కావటం ఒక ఎత్తు అయితే.. ఆ తర్వాత ప్రజల నుంచి ఎదురవుతున్న వ్యవతిరేకత.. తమ పార్టీ నేతలకు ఎదురవుతున్న చేదు అనుభవాలు ఆమెకు మరింత ఇబ్బందికరంగా మారాయి. నా మాటే శాసనం అన్నట్లుగా దశాబ్దాన్నర కాలం పాటు వ్యవహరించిన అధినేత మాట తాజాగా పూచిక పుల్లతో సమానంగా మారటాన్ని దీదీ లాంటి వారు జీర్ణించుకోవటం అంత తేలికైన విషయం కాదు.

ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీకి చెందిన 58 మంది ఎమ్మెల్యేలు బుధవారం వేరు కుంపటి పెట్టుకోగా.. అలాంటి షాక్ తగిలిన 24 గంటల్లోపే మరో దిమ్మతిరిగే షాక్ దీదీకి ఎదురైంది. పార్టీకి చెందిన కనీసం 20 మంది ఎంపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధమువుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే.. మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ తగిలినట్లు అవుతుందని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆమె పార్టీకి లోక్ సభలో 28 మంది ఎంపీలు ఉంటే.. రాజ్యసభలో 13 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో అత్యధికులు పార్టీ మారే ఆలోచన చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. అదే జరిగితే.. అదంతా దీదీ వైఫల్యంగానే చెప్పాలి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరి మాటకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వకుండా..తాను నమ్మిన దారిలో నడవటం.. అలా నడిచే అంశంపై పార్టీలో వ్యతిరేకత ఉన్నప్పటికి.. తనకున్న అధికార బలంతో బయటకు రాకుండా ఉండేలా వ్యవహరించిన ఆమెకు.. ఇప్పుడు కొత్త అనుభవాలు ఎదురవుతున్నాయి.

ఆమెకు అత్యంత సన్నిహితులుగా చెప్పే వారు సైతం ఆమె నుంచి దూరమవుతున్నారు. తాజాగా దీదీకి అత్యంత సన్నిహితుడన్న పేరున్న కోల్ కతా మేయర్ గా వ్యవహరించే ఫర్హద్ హకీమ్ సైతం తన పదవికి రాజీనామా చేశారు. ముఖ్యమంత్రి సువేందుతో చర్చలు జరిపిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవటం చూస్తే.. అధికారం ఉన్నంతవరకు చుట్టూ ఉన్న వారంతా.. పవర్ చేజారిన తర్వాత అంతే సంగతులన్న కొత్త విషయం దీదీ అనుభవంలోకి వచ్చినట్లైంది. మరి.. ఈ వరుస షాకులకు ఆమె ఎలా రియాక్టు అవుతారో చూడాలి.