Begin typing your search above and press return to search.

మమతకు చేదు ఫలితం ?

పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని అధికారం చలాయిస్తున్న మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికల్లో చేదు ఫలితాలు వస్తాయా అన్న చర్చ అయితే ఉంది.

By:  Satya P   |   30 April 2026 9:31 AM IST
మమతకు చేదు ఫలితం ?
X

పశ్చిమ బెంగాల్ లో తిరుగులేని అధికారం చలాయిస్తున్న మమతా బెనర్జీకి ఈసారి ఎన్నికల్లో చేదు ఫలితాలు వస్తాయా అన్న చర్చ అయితే ఉంది. దాని కి తోడు అనేక ప్రీ పోల్ సర్వేలు అయితే మమతకు టఫ్ ఫైట్ అన్నాయి. ఇక తాజాగా వచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితాలు చూస్తే అనుకున్నదే అయ్యేట్లుగా ఉందని అంటున్నారు. మొత్తం అయిదారు ప్రముఖ సర్వే సంస్థలు అందించిన ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు వరసగా విశ్లేషిస్తే ఇందులో ఒకటి రెండు తప్ప దాదాపుగా అన్నీ మమతా బెనర్జీ ఈసారి మాజీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని తేల్చేశాయి.

మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో :

మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య గట్టి పోరు సాగుతోంది. రెండు పార్టీలకు మధ్య చూస్తే సీట్లలో ఓట్లలో స్వల్ప తేడావే ఉండడంతో ఎవరిది విజయం అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు అయితే కొంత విపులంగా విశ్లేషించుకుని మరీ మమత పార్టీకి ఇబ్బందికరం అని చెప్పేస్తున్నాయి. అదే సమయంలో మ్యాజిక్ ఫిగర్ 148కి మరో అయిదారు సీట్లు ఎక్కువతో బీజేపీ అధికారం అందుకుంటుందని కూడా క్లారిటీ ఇస్తున్నాయి.

పోలింగ్ తీరు చూస్తే :

ఎగ్జిట్ పోల్స్ చెప్పాయని కాదు కానీ పోలింగ్ తీరు చూసినా ఏదో జరగబోతోంది అని అయితే అంతటా ఉంది. మొదటి విడత పోలింగ్ 92 శాతం పైగా సాగితే రెండవ విడత పోలింగ్ 91 శాతం పైగా సాగింది ఈ రెండు కలిపితే సగటున 90 శాతం పైగా పోలింగ్ జరిగినట్లు లెక్క పక్కాగా ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఇంత పెద్ద ఎత్తున పోలింగ్ అయితే బెంగాల్ లో జరగలేదు. సర్వ సాధారణంగా ఈ తరహా పోలింగ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతకు సంకేతంగా భావిస్తారు. అలాగే ప్రభుత్వం మారుతుందనడానికి నిదర్శనంగా విశ్లేషిస్తారు. ఎగ్జిట్ పోల్స్ కూడా వీటిని పరిగణనలోకి తీసుకుని సర్వే అంచనాలు వేసినట్లుగా కనిపిస్తోంది.

మమతలో అసహనం :

వీటిని పక్కన పెట్టినా మమతలో అసహనం అయితే అడుగడుగునా కనిపిస్తొంది. కేంద్ర బలగాలు ఎన్నికలను ప్రభావితం చేస్తున్నాయని ఆమె ఆరోపిస్తున్నారు. అంతే కాదు ప్రశాంతంగా సాఫీగా ఎన్నికలు జరగలేదని కూడా నిందిస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రకటనలు చూసిన వారిని చూస్తే గతంలో ఇలాగే చేసిన వారికి జరిగిన ఓటమి గుర్తుకు వస్తుందని చెప్పాలి. మరి అలాంటి ఓటమి మమత అందుకోబోతోందా అన్న చర్చ ఉంది. తమిళనాడులో కూడా అధిక ఓటింగ్ జరిగింది కదా అక్కడ డీఎంకే గెలుస్తోంది కదా అన్న ప్రశ్నలు రావడం సహజం. అయితే ఎక్కువ ఓటింగ్ జరగడానికి కారణం కొత్తగా పార్టీ పెట్టిన టీవీకే అధినేత విజయ్ సినీ గ్లామర్ కారణం. ఆయన కోసం యువత మధ్యతరగతి వర్గాలు తరలివచ్చాయి. ఎగ్జిట్ పోల్స్ లో కూడా అదే ప్రతిబింబించింది. కానీ బెంగాల్ లో విరగబడి వచ్చిన ఓటింగ్ అలాంటిది అయితే కాదు. ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ కచ్చితంగా బీజేపీ. ఇప్పటికే ముమ్మారు అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మీద జనాల్లో వ్యతిరేకత ఉందన్నది సర్వేల కంటే ముందే జనంలో మాటగా తెల్సిన విషయం. అయితే అది ఎంత వరకూ ఓటింగ్ గా మారింది అన్నదే చర్చ. ఇప్పటికీ మమతకు సగానికి సగం చాన్స్ ఉందనే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.