Begin typing your search above and press return to search.

ఇదేం ఆరాచకం? మైకు పెట్టి మరీ అర్థరాత్రి బెల్టుషాపు వేలం

పోలీసులు స్పందిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:16 AM GMT
ఇదేం ఆరాచకం? మైకు పెట్టి మరీ అర్థరాత్రి బెల్టుషాపు వేలం
X

తెగింపును అర్థం చేసుకోవచ్చు. బరితెగింపు తీరు చూస్తే నోటి వెంట మాట రాదంతే. ఏపీలోచోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాల మీద ఆయా శాఖలకు చెందిన అధికారులు.. పోలీసులు స్పందిస్తున్న తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి తీరు ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. తాజాగా అలాంటి ఉదంతమే పల్నాడులో చోటు చేసుకుంది. దాచేపల్లి మండలం భట్రుపాలెంలో బెల్టు షాపును వేలం వేసిన తీరు అవాక్కు అయ్యేలా మారింది. ప్రభుత్వాధికారులు ఏం చేస్తున్నారన్నట్లుగా ఉన్న ఈ ఉదంతాన్ని చూస్తే.. ఇదెక్కడి పంచాయితీ అన్న భావన కలుగక మానదు.

రాత్రి వేళ.. మైకు పెట్టి మరీ బెల్టుషాపునకు సంబంధించిన వేలంపాటను నిర్వహించారు. వేలంలో బెల్టుషాపును సొంతం చేసుకోవటానికి పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. బెల్టుషాపులపై కొరడా ఝుళిపిస్తామని చెప్పే ఎక్సైజ్ అధికారులతో పాటు.. పోలీసులు సైతం పత్తా లేకుండా ఉండటం విమర్శలకు తావిస్తోంది. ఈ వేలంలో పాల్గొన్న వారిలో అధికార పార్టీకి చెందిన నేతలు ఎక్కువగా ఉన్నారు.

గత ఏడాది ఇదే బెల్టుషాపునకు జరిగిన వేలంలో రూ.2.55 లక్షలకు ఒకరు సొంతం చేసుకోగా.. ఈసారి ఎన్నికల ఏడాది కావటంతో మరింత భారీగా ఆదాయం వస్తుందని పేర్కొంటూ మైకుల్లో హుషారు చేస్తూ వేలాన్ని ముందుకుతీసుకెళ్లారు. చివరకు వైసీపీకి చెందిన నాయకుడు ఒకరు ఈ బెల్టుషాపును రూ.3,93,000లకు సొంతం చేసుకున్నారు. బాహాటంగా సాగిన ఈ బెల్టుషాపు వేలం చుట్టుపక్కల ఊళ్లలో హాట్ టాపిక్ గా మారింది. ఈ తరహా ఉదంతాలు ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తాయన్న విషయాన్ని గుర్తిస్తే మంచిదంటున్నారు.