Begin typing your search above and press return to search.

భిక్షాటనలో తమకంటే ఎక్కువ డబ్బులు వస్తున్నాయని చంపేశారు

నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ ప్రహరీ గోడ పక్కనే పద్నాలుగు నెలల పసి ప్రాణం హత్యకు గురైన మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. అసలేం జరిగిందంటే..

By:  Tupaki Desk   |   1 April 2025 11:00 AM IST
Nizambad Tragedy
X

వామ్మో.. లోకం ఎక్కడికి పోతుంది సామీ అన్నట్లుగా ఉంటుంది ఈ ఉదంతం. భిక్షాటనలో తమ కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారన్న కోపంతో కక్ష పెంచుకొని.. పసి పిల్లాడు అన్నది కూడా చూడకుండా కిరాతకంగా హత్య చేసిన వైనం గురించి తెలిస్తే నోట మాట రాదంతే. నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీ గ్రౌండ్ ప్రహరీ గోడ పక్కనే పద్నాలుగు నెలల పసి ప్రాణం హత్యకు గురైన మిస్టరీని తాజాగా పోలీసులు చేధించారు. అసలేం జరిగిందంటే..

మహారాష్ట్ర నాందేడ్ జిల్లాకు చెందిన కమలాబాయి.. గంగాధర్ లు తమ ముగ్గురు పిల్లలతో మార్చి 27న నిజామాబాద్ కు వచ్చారు. ఇద్దరు కూతుళ్లతో తండ్రి ఆర్టీసీ బస్టాండ్ లో.. పద్నాలుగు నెలల కొడుకుతో కలిసి తల్లి రైల్వే స్టేషన్ లో భిక్షాటన చేస్తుండేది. వీరంతా కలిసి రైల్వే స్టేషన్ దగ్గర పడుకునేవారు. ఎప్పటిలానే పడుకొని.. లేచేసరికి తమ పద్నాలుగు నెలల చిన్నారి కనిపించకపోవటంతో వారు పోలీసుల్ని ఆశ్రయించారు. మరోవైపు.. పిల్లాడి డెడ్ బాడీ కాలేజీ గ్రౌండ్ దగ్గర దొరికింది.

ఈ కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల్ని గుర్తించి పట్టుకున్నారు. చివరకు వారు ఎవరంటే.. మహారాష్ట్రకు చెందిన 52 ఏళ్ల మాలబాయి.. 33 ఏళ్ల గోపాల్. వీరు కూడా భిక్షాటన చేస్తుంటారు. తమకంటే ఎక్కువగా సంపాదిస్తున్నారన్న కోపంతో కక్షకట్టి.. పిల్లాడ్ని కిడ్నాప్ చేసి.. అనంతరం దారుణంగా హత్య చేశారు. నిద్రపోతున్న చిన్నారిని ఎత్తుకెళ్లి.. కాలేజీ ప్రహరీ గోడ పక్కనే బండరాయితో మోది చంపేశారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. రిమాండ్ కు పంపారు.