వద్దన్నా పదవి... తమ్ముడికి తలనొప్పులేనా ?
బీద రవిచంద్ర ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని కోరుకుంటున్నారుట. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, అంగబలం అర్ధం బలం నిండుగా ఉన్న వారు.
By: Tupaki Desk | 29 Dec 2025 3:00 PM ISTపదవి కావాలని చాలా మంది అనుకుంటారు. ఆశిస్తారు. రాజకీయాల్లో ఎవరైనా కోరేవి పదవులే కదా. అంతే కాదు అధికారంలో పార్టీ ఉంటే దానికి పదవి తోడు అయితే ఆ మజా వేరు కదా. అలా పదవులు కావాలని పైరవీలు చేసుకునే వారు చాలా మంది ఉంటే నాకు పదవి వద్దు అని అంటున్న ఒక నేతకు అది ఇస్తే ఎలా ఉంటుంది. దాంతో ఆయన ఎందుకొచ్చిన తలనొప్పి స్వామీ అని వాపోతున్నారుట. ఇంతకీ ఏమా పదవి ఎవరా నేత అంటే టీడీపీకి హాట్ ఫేవరేట్ జిల్లా అయిన నెల్లూరులోనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు.
బీదకు జిల్లా పీఠం :
టీడీపీలో సీనియర్ నేతగా బీద రవిచంద్ర ఉన్నారు. ఆయన సోదరుడు బీద మస్తాన్ రావు టీడీపీని వీడి వైసీపీలోకి వెళ్ళి రాజ్యసభ సీటు సాధించి తిరిగి టీడీపీలోకి వచ్చారు. బీద మాత్రం అన్న వెంట నడవకుండా పార్టీకే కట్టుబడి పనిచేశారు దానికి ప్రతిఫలంగా ఆయనకు ఎమ్మెల్సీ పదవి అయితే ఇచ్చారు కానీ మంత్రి పదవి దక్కలేదు, ఆ అసంతృప్తి ఒక వైపు ఉంది, మరో వైపు చూస్తే పార్టీ పదవులలో అయినా ప్రమోషన్లు కోరుకుంటూంటే ఆయనను తెచ్చి మరో సారి జిల్లా పగ్గాలు చూసుకోమని అధినాయకత్వం చెప్పడంతో తెగ వర్రీ అవుతున్నారని అంటున్నారు.
ఏపీ అధ్యక్షుడిగా :
బీద రవిచంద్ర ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ పదవిని కోరుకుంటున్నారుట. బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు, అంగబలం అర్ధం బలం నిండుగా ఉన్న వారు. పైగా అధినాయకత్వం వద్ద మంచి సాన్నిహిత్యం ఉంది, వాగ్దాటి కూడా ఉంది. దాంతో తనకు కీలక పదవి ఇస్తే టీడీపీలో దూసుకుని పోవచ్చు అని ఆయన తలచారుట. తన మదిలో మాటను పెద్దల వద్ద వ్యక్తం చేసారో లేదో తెలియదు కానీ ఆయన స్టేట్ ప్రెసిడెంట్ ఆశిస్తే జిల్లా ప్రెసిడెంట్ పదవిని ఇచ్చి సర్దుకోమంటే ఆయనకు ఏమి చేయాలో అర్ధం కాలేదు అని అంటున్నారు. దాంతో ఆయన ఫుల్ సైలెంట్ అయ్యారని టాక్ నడుస్తోంది.
వైసీపీకి పట్టు :
నెల్లూరు జిల్లా అంటే గతంలో కాంగ్రెస్ ప్రస్తుతం వైసీపీకి పట్టు ఉన్న జిల్లా. 2024 ఎన్నికల్లో అనేక కారణాల వల్ల వైసీపీ ఓటమి పాలు అయింది కానీ మళ్లీ వేగంగా పుంజుకునే జిల్లాలలో నెల్లూరు ఒకటి అని అంటున్నారు. ఇక టీడీపీ బలం పెరగడానికి వైసీపీ నుంచి ఎన్నికల ముందు చేరికలు కారణం అని అంటున్నారు. ఇలా వచ్చి పదవులు అందుకున్న వారికీ మొదటి నుంచి టీడీపీలో ఉంటున్న వారికీ మధ్య అసలు పొసగడం లేదుట. అంతే కాదు తాజా మాజీల మధ్య సీనియర్లు జూనియర్ల మధ్య కూడా వివాదాలు పెరిగిపోతున్నాయట. దీంతో అన్నీ చక్కదిద్దే బాధ్యతను బీద రవిచంద్ర మీద పెడుతూ జిల్లా పీఠం అప్పగించారు అని అంటున్నారు. ఆయన గతంలో ఇదే పదవిలో ఉంటూ పార్టీని ఏకతాటి మీద నడిపించారు అని అంటున్నారు. ఆ విశ్వాసంతోనే అధినాయకత్వం మళ్లీ ఆయనకే పట్టం కట్టింది అని చెబుతున్నారు.
సీన్ మారింది అంటూ :
అయితే గతానికి ఇప్పటికీ చూస్తే జిల్లాలో సీన్ మొత్తం మారింది అని బీద వర్గీయులు చెబుతున్నారు. ఇపుడు ఎవరిని ఎవరూ కంట్రోల్ చేయలేని స్థితిలో ఉందని చెబుతున్నారు. పైగా బీద సైతం మనసు పెట్టి పనిచేయలేనని అంటున్నట్లుగా భోగట్టా. అయితే హైకమాండ్ ఆయనకు అన్నీ వివరించి నచ్చచెప్పి పదవి అప్పగించింది కాబట్టి రంగంలోకి దిగాల్సిందే అని అంటున్నారు మరి బీద ఏమి చేస్తారో చూడాల్సిందే అని అంటున్నారు.
