Begin typing your search above and press return to search.

"నల్లులతో నరకం"... ఇది ఫ్రాన్స్ జాతీయ సమస్య!

రాజధాని ప్యారిస్‌ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ సమస్య విస్తరించింది. అదే... నల్లుల సమస్య!

By:  Tupaki Desk   |   7 Oct 2023 8:35 AM GMT
నల్లులతో నరకం... ఇది ఫ్రాన్స్  జాతీయ సమస్య!
X

2024లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించబోతోన్న ఫ్రాన్స్ కు ఇప్పుడు ఒక అతిపెద్ద జాతీయ సమస్య వచ్చిపడింది. రాజధాని ప్యారిస్‌ తో పాటు చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఈ సమస్య విస్తరించింది. అదే... నల్లుల సమస్య! ఇప్పుడు ఫ్రాన్స్ దేశానికి ఇది అతిపెద్ద సమస్యగా పరిణమించిందని తెలుస్తుంది. దీంతో అధికారులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులంతా హడావుడిగా ప్రకటనలు జారీ చేస్తున్నారు.

అవును... ప్రస్తుతం ఫ్రాన్స్ ప్రజలకు అతిపెద్ద సమస్య ఎదురైంది. ఇందులో భాగంగా... ఎక్కడబడితే అక్కడ నల్లులు విజృంభిస్తున్నాయి. దీంతో... ప్రజలంతా నల్లులను తరిమికొట్టాలంటూ ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించారు అధికారులు. మరోపక్క అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వచ్చే ఏడాది ఒలింపిక్ క్రీడలను ఫ్రాన్స్ నిర్వహిస్తోంది. ఇటువంటి పరిస్థితిలో ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే ఆటగాళ్లు నల్లుల భారిన పడకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాలు అని అంటున్నారు. ఈ సమయంలో పారిస్ డిప్యూటీ మేయర్ ఇమ్మాన్యుయేల్ గ్రెగోయిర్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మీరు ఎప్పుడైనా నల్లుల బారిన పడవచ్చు.. అలర్ట్ గా ఉండండి అని హెచ్చరించారు.

కాగా... కోవిడ్ కి ముందు సుమారు మూడేళ్ల కిందట కూడా ఫ్రాన్స్ దేశానికి నలుల్ల బెడద దాపురించింది. ఆ సమయంలో వెంటనే స్పందించిన ప్రభుత్వం... ఒక ప్రత్యేక వెబ్‌ సైట్, హాట్‌ లైన్‌ సాయంతో "యాంటీ బెడ్‌ బగ్" ప్రచారాన్ని ప్రారంభించింది. 1950లో కూడా ఫ్రాన్స్‌ లో నల్లుల సమస్య తీవ్రంగా కనిపించింది. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకు నల్లులు మాయమయ్యాయి.

ఈ నేపథ్యంలో... తాజాగా ఇప్పుడు హఠాత్తుగా నల్లుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఇటీవల మెట్రోలో నల్లులు కనిపించిన నేపధ్యంలో ప్రయాణికులు సీట్లలో కూర్చోవడం మానేశారని అంటున్నారు. ఇక సినిమా హాళ్లు, బస్సుల సంగతైతే చెప్పేపనిలేదని సమాచారం.

మరోపక్క నల్లులు కుట్టడం వలన డిప్రెషన్, యాంగ్జయిటీ తదితర వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా చర్మ సంబంద వ్యాదులు వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో... పారిస్ సిటీ హాల్ సభ్యులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌ కు లేఖ రాశారు.