‘ఆ రెండు కులాలు’.. బీసీ నేత రామచంద్ర యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు!
దశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రభుత్వాలను నడుపుతున్న రెండు కులాలకు చెందిన నాయకులను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు.
By: Tupaki Desk | 24 July 2025 3:47 PM ISTదశాబ్దాలుగా రాష్ట్రంలో ప్రభుత్వాలను నడుపుతున్న రెండు కులాలకు చెందిన నాయకులను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టనీయకూడదని బీసీవై పార్టీ నేత రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. అయితే రెండు ప్రధాన సామాజికవర్గాల పేర్లు ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. భారత చైతన్య యువజన పార్టీ రెండవ ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన రామచంద్ర యాదవ్.. రాష్ట్రంలో ప్రధాన సామాజిక వర్గాలుగా చెలామణి అవుతున్న కమ్మ, రెడ్డి కులాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కమ్మ, రెడ్డి కులాలకు చెందిన నాయకులే రాష్ట్రాన్ని ఎక్కువగా పాలించారని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి పార్టీలను ప్రస్తావిస్తూ రామచంద్రయాదవ్ విమర్శలు గుప్పించారు. సంవత్సరాలుగా రాష్ట్రాన్ని పాలిస్తున్న రెండు కులాల వారు బీసీల ప్రగతికి ఏ మాత్రం కృషి చేయలేదని రామచంద్ర యాదవ్ ఆరోపించారు. ప్రజలు అప్పగించిన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్రం వచ్చిన నుంచి రెండు వర్గాలు వారే రాష్ట్రాన్ని ఎక్కువగా పాలిస్తున్నారని, వారిని పాలన నుంచి బహిష్కరించాల్సిన అవసరం ఉందని రామచంద్ర యాదవ్ పిలుపునిచ్చారు. ఆ రెండు సామాజికవర్గాల మినహా మిగిలిన అన్ని సామాజికవర్గాలను ఏకం చేసే బాధ్యతను బీసీవై పార్టీ తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ బలహీనవర్గాల వారు రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
అయితే రామచంద్రయాదవ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీని ప్రారంభించి ఇతర కులాలను కించపరచడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రాన్ని ఎక్కువగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మామ, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ పాలించారు. అదేసమయంలో వైసీపీ అధినేత జగన్మోహనరెడ్డి, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి కూడా సీఎంలుగా పనిచేశారు. వీరు కాకుండా కోట్ల విజయభాస్కరరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వంటివారు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే సీఎంలుగా పనిచేసిన నేతలను టార్గెట్ చేసిన రామచంద్రయాదవ్ కమ్మ, రెడ్డి సామాజికవర్గాలను కించపరిచేలా వ్యాఖ్యానించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
