Begin typing your search above and press return to search.

ఏపీలో బీసీ నినాదం : 90 సీట్లు ఇవ్వాల్సిందే....!

ఏపీలో బీసీ నినాదం ఊపందుకుంటోంది. బీసీలకు రాజ్యాధికారం కావాలని కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నినదిస్తున్నారు.

By:  Tupaki Desk   |   20 Nov 2023 5:19 PM GMT
ఏపీలో బీసీ నినాదం :  90 సీట్లు ఇవ్వాల్సిందే....!
X

ఏపీలో బీసీ నినాదం ఊపందుకుంటోంది. బీసీలకు రాజ్యాధికారం కావాలని కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు నినదిస్తున్నారు. బీసీలు మొత్తం రాష్ట్ర జనాభాలో యాభై శాతం పైగా ఉన్న బీసీలకు సీట్ల విషయంలో కూడా పూర్తి న్యాయం చేయాలన్న డిమాండ్ నానాటికీ పెరుగుతోంది.

జనాభా ప్రాతిపదికన బీసీలకు 90 అసెంబ్లీ సీట్లు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. ఏపీ అసెంబ్లీలో 175 సీట్లు ఉన్నాయి. దాంతో తొంబై సీట్లను బీసీలకు రాజకీయ పార్టీలు కేటాయించాలని అంటున్నారు. అలాగే మొత్తం పాతిక ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో పదమూడు ఎంపీ సీట్లను బీసీలకు ఇవ్వాలని కూడా డిమాండ్ వస్తోంది.

బీసీలకు ఈ విధంగా అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వాల్సిందే అని అంటున్నారు. బీసీలను సమాదరించిన పార్టీలకే తమ మద్దతు ఉంటుందని కూడా బీసీ సంఘాల నేతలు చెబుతున్నారు. బీసీలకు చూసుకుంటే స్వాతంత్రం వచ్చిన తరువాత ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి పదవి అయితే దక్కలేదు.

ఏడున్నర దశాబ్దాల రాజకీయ ప్రస్తానంలో వారు ఉప ముఖ్యమంత్రుల స్థాయి దాకా మాత్రమే ఎదిగారు, కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోలేకపోయారు. అల్ప సంఖ్యాక జనాభాయే రాజ్యాధికారం చేస్తోందని దశాబ్దాలుగా వారే అందలం మీద ఉంటున్నారని బీసీలు అంటున్నారు.

ఏపీలో చూసుకుంటే బీసీలలో డెబ్బై నుంచి ఎనభైకి పైగా కులాలు ఉన్నాయి. ఇందులో యాదవులు అధికంగా ఉన్నారని ఒక అంచనాగా ఉంది. అలాగే తూర్పు కాపులు ఉత్తరాంధ్రాలో బీసీలుగా ఉన్నారు. రాయలసీమలో బలిజలు కూడా బీసీలుగా వస్తారు.

ఇక వెలమలు ఉత్తరాంధ్రాలో బీసీలుగా ఉన్నారు. మిగిలిన చోట ఓసీలుగా ఉన్నారు. తెలంగాణాలో చూస్తే వెలమలకు రాజ్యాధికారం దక్కింది. కానీ ఏపీలో మాత్రం ఆ అవకాశం ఇప్పటిదాకా రాలేదు. దాంతో బీసీలు అంతా ఏకమైతే తప్ప రాజ్యాధికారం దక్కదని భావిస్తున్నారు.

ఇక ఉమ్మడి విశాఖలో తాజాగా సమావేశం అయిన జాతీయ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంగళ రావు యాదవ్ బీసీలకు న్యాయం చేసే పార్టీలకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. బీసీలకు రాజ్యాధికారం కోరుతూ డిసెంబర్ 7 నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలలోని ఇచ్చాపురం నుంచి కర్నూలు దాకా బీసీల ఆత్మ గౌరవ రధ యాత్ర ప్రారంభిస్తామని కూడా ఆయన వెల్లడించారు.

బీసీ దేశానికి ప్రధానిగా ఉన్నా ఏమీ మేలు జరగడంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, దానికి లక్ష కోట్ల రూపాయల నిధులను కూడా కేటాయించాలని ఆయన డిమాడ్ చేశారు.

బీసీలకు దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్యాయాల మీద త్వరలోనే ఢిల్లీలో భారీ ఉద్యమం నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే బీసీలకు రాజ్యాధికారం దక్కకపోవడం వెనక వారిలో ఐక్యత కూడా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతోంది అని అంటున్నారు.

బీసీలలో కొన్ని కులాలు ఒక పార్టీకి మరి కొన్ని కులాలు ఇంకో పార్టీకి మద్దతుగా ఉంటున్నాయి. దాంతో వారికి మంత్రి పదవుల దాకా ఏ మాత్రం ఢోకా లేకఒపోయినా ముఖ్యమంత్రి పదవి మాత్రం అందని పండుగా మారింది.

అంగబలం అర్ధబలంతో బీసీలు ఐక్యంగా పోరాడితేనే రాజ్యాధికారం వస్తుంది అని అంటున్నారు.

ఏపీలో కాపులు కూడా రాజ్యాధికారం కోసం పోరాడుతున్నారు. ఇపుడు బీసీలు కూడా అదే నినాదంతో ముందుకు వస్తున్నారు. మరి రాజకీయ పార్టీలు ఏమి చేస్తాయి అన్నది కూడా చూడాల్సి ఉంది.