Begin typing your search above and press return to search.

సెప్టెంబర్ లో బీసీ డిక్లరేషన్ ?

బీసీ డిక్లరేషన్ కసరత్తులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కూడా భేటీ అవ్వాలని సీనియర్లు నిర్ణయించారు.

By:  Tupaki Desk   |   28 Aug 2023 5:47 AM GMT
సెప్టెంబర్ లో బీసీ డిక్లరేషన్ ?
X

ఎన్నికలు దగ్గరకు వస్తున్నకొద్దీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో డిక్లరేషన్ల జోరు పెంచుతోంది. డిక్లరేషన్ అంటే ఏమీలేదు అధికారంలోకి వస్తే కాంగ్రెస్ అమలుచేయబోయే హామీలే. మామూలుగా అయితే మ్యానిఫెస్టో అంటారు. మ్యానిఫెస్టో అంటే ఎన్నికల సమయలో ప్రకటించే హామీల జాబితా. దానికే పేరుమార్చి డిక్లరేషన్ అంటున్నారంతే. సెప్టెంబర్ రెండోవారంలో బీసీ డిక్లరేషన్ చేయాలని సీనియర్ నేతలు పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణా ఇన్చార్జి మాణిక్ రావ్ థాక్రేతో సీనియర్ నేతలంగా భేటీ అయ్యారు.

బీసీ డిక్లరేషన్ కసరత్తులో బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యతో కూడా భేటీ అవ్వాలని సీనియర్లు నిర్ణయించారు. ఇప్పటికే కృష్ణయ్య-థాక్రే మధ్య భేటీ జరిగిన విషయం తెలిసిందే. దానికి కంటిన్యుయేషన్ గానే తొందరలోనే సీనియర్ నేతలు కృష్ణయ్యతో భేటీ అవబోతున్నారు. పార్లమెంటులో బీసీ బిల్లు, కేంద్రక్యాబినెట్లో ప్రత్యేకంగా బీసీ మంత్రత్వ శాఖ, ఉద్యోగులకు ప్రమోషన్లు, రిజర్వేషన్లు, సుప్రింకోర్టు నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం లాంటివి ఉండబోతున్నది.

ఇక రాష్ట్రానికి వస్తే బీసీ బంధు పేరుతో అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి రు. 10 లక్షలు, బీసీ జనాభా గణన, ప్రైవేటు కంపెనీల్లోను బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్లు అమలుచేయాలని కృష్ణయ్య ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు.

ఈ పాయింట్లన్నీ రూపొందించబోయే బీసీ డిక్లరేషన్లో ఉంటుందని అనుకుంటున్నారు. ఇపుడు చర్చల్లో ఉన్న పాయింట్లకు గతంలో రాహుల్ గాంధీ కూడా సానుకూలంగా స్పందించారని స్వయంగా కృష్ణయ్యే చెప్పారు.

వివిధ వర్గాలను ఆకట్టుకోవటానికి కాంగ్రెస్ ఇప్పటికే కొన్ని డిక్లరేషన్లను ప్రకటించింది. రైతు, యువత, మహిళ, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇలాంటి డిక్లరేషన్లు, ఉచిత హామీలతోనే ప్రభుత్వాల ఆర్ధిక పరిస్ధితి నానాటికీ అప్పుల్లో కూరుకుపోతోంది.

అయినా పార్టీలకు బుద్ధిరావటంలేదు. అధికారంలోకి రావటమనే ఏకైక ధ్యేయంతోనే పార్టీలు జనాలను ఆకర్షించేందుక బుర్రకు తోచిన హామీలను, డిక్లరేషన్లని చేసేస్తున్నాయి. చివరకు ఇవి బాగా పెరిగి పెరిగి జనాల్లో ఒక్కసారిగా తిరుగుబాటు వస్తేకానీ పార్టీలకు బుద్ధిరాదు.