Begin typing your search above and press return to search.

బీసీ సీఎం : తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఎందుకు కాలేదు...?

తెలుగు రాష్ట్రాలలో బీసీ సీఎం ఒక నినాదంగా ఉంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేసారు

By:  Tupaki Desk   |   19 Nov 2023 4:01 AM GMT
బీసీ సీఎం : తెలుగు రాష్ట్రాలలో ఇప్పటిదాకా ఎందుకు కాలేదు...?
X

తెలుగు రాష్ట్రాలలో బీసీ సీఎం ఒక నినాదంగా ఉంది. ఏడున్నర దశాబ్దాల స్వాతంత్ర దేశంలో దాదాపుగా అన్ని రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులుగా పనిచేసారు. సౌతిండియాలో చూస్తే పొరుగున తమిళనాడులో అర్ధ శతాబ్దం ముందు నుంచే బీసీ ముఖ్యమంత్రులు ఉన్నారు. కేరళ, కర్నాటకలలోనూ వారు చాలా సార్లు అయ్యారు. ప్రస్తుత కేరళ సీఎం కూడా బీసీనే. అలాగే కర్నాటక కాంగ్రెస్ సీఎం గత బీజేపీ సీఎం కూడా బీసీలే.

మరి అన్ని చోట్లా బీసీలు రాజ్యాధికారంలోకి వస్తే ఉమ్మడి ఏపీలోనూ విభజన ఏపీలోనూ బీసీలకు అందని పండుగా సీఎం పదవి ఉండడం మాత్రం రాజకీయ విషాదంగానే ఉంది. మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరుపడినపుడు బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన టంగుటూరి ప్రకాశం పంతులు తొలి సీఎం అయ్యారు. హైదరాబాద్ స్టేట్ కి బూర్గుల రామక్రిష్ణారావు అనే బ్రాహ్మిణ్ నాలుగేళ్ల పాటు సీఎం గా పనిచేసారు.

ఆ తరువాత 1956లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణాతో కలసి ఏర్పడింది. అలా తొలి సీఎం గా నీలం సంజీవరెడ్డి అయ్యారు. ఆయన తరువాత దామోదరం సంజీవయ్య అనే దళితవర్గం నేత సీఎం అయ్యారు. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి సీఎం గా చాన్నాళ్ళు చేశారు. తెలంగాణా ఉద్యమం నేపధ్యంలో 1970 దశకం తొలి నాళ్ళలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన పీవీ నరసింహారావు సీఎం అయ్యారు.

ఆ తరువాత వెలమ సామాజికవర్గానికి చెందిన జలగం వెంగళరావు సీఎం అయితే మర్రి చెన్నారెడ్డి టంగుటూరు అంజయ్య, భవనం వెంకటరాం, కోట్ల విజయభాస్కరరెడ్డి రెడ్డి సామాజిక వర్గం నుంచి సీఎంలుగా పనిచేశారు. 1983లో ఎంటీయార్ కమ్మ సామాజిక వర్గం నుంచి సీఎం అయ్యారు. అదే టీడీపీ నుంచి నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబు సీఎం లు అయ్యారు కాంగ్రెస్ నుంచి చూస్తే గడచిన ముప్పయ్యేళ్లలో వైశ్య సామాజికవర్గానికి చెందిన ఒక్క రోశయ్య తప్ప నేదురుమల్లి జనార్ధనరెడ్డి, వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి సీఎంలు అయ్యారు.

విభజన తరువాత కేసీయార్ వెలమ సామాజిక వర్గం నుంచి తెలంగాణా సీఎం గా ఉంటే ఏపీ నుంచి చంద్రబాబు జగన్ ఉన్నారు. ఇలా చూసుకుంటే కనుక తెలుగు రాష్ట్రాలలో రెడ్లు, కమ్మలు వారి తరువాత వెలమలు ఎక్కువ కాలం సీఎంలుగా చేస్తే మధ్యలో దళితుల నుంచి ఒక్కరు, బ్రాహ్మణుల నుంచి ముగ్గురు, వైశ్యుల నుంచి ఒక్కరు సీఎంలు అయ్యారు. మిగిలిన సామాజిక వర్గాలకు మాత్రం చాన్స్ రాలేదు

అటు తెలంగాణా ఇటు ఆంధ్రాలలో బీసీలు నూటికి యాభై శాతానికి పైగా జనాభా ఉన్నారు. కానీ వారికి రాజ్యాధికారం అందకుండా పోతోంది. మరి బీజేపీ బీసీ సీఎం అని తెలంగాణాలో అంటోంది. కానీ అది ఫక్తు రాజకీయ నినాదంగానే ఉందని అంటున్నారు. అధికారంలో అవకాశం ఉన్న చోట ఈ మాట అంటే నెరవేరుతుంది కానీ లేకపోతే కంటి తుడుపుగానే ఉంటుంది అని అంటున్నారు. ఇంతకీ బీసీలు సీఎంలు అయ్యే రోజు తెలుగు రాష్ట్రాలలో ఉంటుందా అంటే వేచి చూడాల్సిందే.