Begin typing your search above and press return to search.

ఎవరా హైదరాబాద్ బిగ్ షాట్? బీసీసీఐ వార్నింగ్ ఏమిటి?

తాజాగా బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగటం.. స్పష్టమైన హెచ్చరికను జారీ చేయటం సంచలనంగా మారింది.

By:  Tupaki Desk   |   17 April 2025 5:58 AM
BCCI Warns Businessman
X

ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఏదో ఒక వివాదం రేగకుండా సీజన్ పూర్తి కాదు. తాజాగా జరుగుతున్న సీజన్ అందుకు మినహాయింపు కాదు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్ లో వెలుగు చూస్తున్న వివాదాలు కొంత తగ్గాయన్న మాట వినిపిస్తోంది. అందుకు చెక్ పడేలా.. తాజాగా బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగటం.. స్పష్టమైన హెచ్చరికను జారీ చేయటం సంచలనంగా మారింది.

హైదరాబాద్ కు చెందిన ఒక వ్యాపారి చట్టవ్యతిరేక పనులు చేసేలా వ్యక్తుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. ఈ సందర్భంగా ఐపీఎల్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ‘ఆ వ్యాపారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రికెటర్లు.. కోచ్ లు.. సహాయ సిబ్బంది.. వ్యాఖ్యాతలు.. ఐపీఎల్ తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఆ వ్యాపారికి బుకీలతో సంబంధాలు ఉన్నాయి’’ అంటూ బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో ఎవరీ హైదరాబాదీ వ్యాపారి? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒక బిగ్ షాట్ ను ఉద్దేశించి ఈ తరహా వార్నింగ్ లు ఇచ్చింది లేదని చెబుతున్నారు. ఐపీఎల్ వ్యక్తులతో స్నేహం చేయటానికి.. సంబంధాలుపెంచుకోవటానికి సదరు వ్యాపారి ప్రయత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఖరీదైన బహుమతులతో బుట్టలో వేసుకోవటం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్న సదరు వ్యాపారి.. ఇప్పటికే పలువురికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి కొందరితో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.